తులా పురుష దాన విధానము

ఆయనము, విషువము, వ్యతీపాతము, దినక్షయము, యుగాదిదినము, గ్రహణదినము, మన్వంతరాది దినము, రవి సంక్రాంతి దినము, వైదృతియోగ దినము, చతుర్దశీ అష్టమీ శుక్ల పంచదశీ (పూర్ణిమా) పర్వదినము, ద్వాదశీ అష్టకా యజ్ఞములు ఉత్సవములు వివాహాది శుభకార్యములు, దుస్స్వప్నములు, అద్భుతములు కనబడుట ద్రవ్యము లభించుట తగిన బ్రాహ్మణులు లభించుట శ్రద్ధ కలుగుట -ఇట్టి సమయములందును తీర్థములు క్షేత్రములు గోష్ఠములు ఆరామములు, నదులు, గృహము, దేవాలయములు, తటాకములు మనోహర ప్రదేశములు- ఇటువంటి ప్రదేశములందును సంసారపు వలనుండి భయపడు వారెవరయినను ఈ మహా దానములను ఈయవచ్చును; ఏలయన జీవితము అనిత్యము; ధనము అతి చంచలము; మృత్యువు కేశముల యందు పట్టుకొనియే ఎల్లప్పుడును సిద్ధమయి ఉన్నదున్నట్లుగానే మానవుడు ధర్మమాచరించవలయును.

పుణ్య (శుభ) కరమగు తిథినాడు బ్రాహ్మణులచే స్వస్తి పుణ్యాహవాచనము జరిపించవలయును; పదునారు పిడిమూరల పొడవును పదికాని పండ్రెండుకాని మూరల వెడల్పునుకల చతురస్రాకృతి మండపమును నిర్మింపజేయవలయును, అందునాలుగు శుభాసనము లమర్చవలెను, దాని నడుమ ఏడుకాని ఐదుకాని మూరల వెడల్పున వీధి - మనుజులు నిరాఘాటముగా తిరుగుటకు-ఉండవలయును, ఈ మండపమునకు నడుమగా నుండునట్లు తోరణ (ప్రధాన ద్వార)మును దృఢమగు దారువుతో చేయించవలెను, నాలుగు దిక్కులందును నాలుగు కుండములును వానికి చుట్టును మేఖలలును (అంచు కట్టలును) యోనులును (ఇది లోగడ చెప్పబడినది) పూర్ణ కుంభములతో ఆసనములతో కూడ నిర్మించవలెను. అచటనే ప్రతి కుండముకడను రెండేసి తామ్ర పాత్రములును   స్రుక్కు, స్రవము, నేతిపాత్ర మొదలైన యజ్ఞ పాత్రములును మూరెడు చదరపు విష్టరములును (దర్భాసనములో, జింక చర్మములో) ఉండవలయును: తిలలు ఆజ్యము ధూప సామగ్రియు శోభన పుష్పోపహారములును ఉండవలయును. ఈశాన్యమున వేరుగా మూరెడు చదరపు వేదిక గ్రహాదులను లోకపాలురను పూజించుటకై ఉండవలయును. తరువాత అందే పండ్లు మాల్యములు వస్త్రములు మొదలగువానితో బ్రహ్మ విష్ణు రుద్రుల అర్చనము కూడ జరుపవలయును: అందుచే అచట ఆయా లోకేశ్వర గ్రహాదులకు చెప్పిన వర్ణములతో వస్త్రములతో చేసిన పతాక (చిరుజెండా)లును వాని నడుమ చిరుగంటలతో మువ్వలతో కూడిన ధ్వజము (పెద్ద జెండాయు)ను ఉండవలెను; నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములును వానికి మర్రి జువ్వి మొదలగు పాలుగల వనస్పతుల (పూలు పూయకయే కాయలుకాయు వృక్షజాతులు-వనస్పతులు) చివుళ్ళతో చేసిన తోరణములు నాలుగును ప్రతి ద్వారమందును రెండేసి పూర్ణ కుంభములును మాలికలు గంధ ద్రవ్యములును ధూప సామగ్రియు వస్త్రములు ఉండవలయును, ఈ మండప సమీపమున ఏపి, గార, మంచి గంధము, దేవదారు, శ్రీపర్ణి, మారేడు, మామిడి, కడిమి మొదలగు వానితో చేసిన ఐదు మూరల రెండు స్తంభములును తెచ్చి రెండు మూరల లోతుగల గోతిలో ఒకదానికొకటి నాలుగు మూరల దూరములో ఉండునట్లు దృఢముగా పాతవలెను. (అనగా స్తంభదారువు, ఐదును రెండును కలిపి ఏడు మూరలు) వానిపై అడ్డముగా ఒక దారువును అమర్చవలెను (ఉత్తరదారువు అని దానికిచట పేరు వ్యవహరింపబడును, ‘పైగాకట్టిన కొయ్య’ అని అర్థము. ఇదియు ఈ స్తంభములు రెండును ఒకేజాతి దారువుతో చేసినవిగా నుండవలెను. ఈతుల నడుమ బంగారుతో చేసిన పురుషమును (రెండు వైపులను బరువులు సమానముగా ఉన్నవని తెలుపు సన్ననిమొనగల కడ్డీగాని రేకుగాని) నాలుగు మూరల పొడవును పది అంగుళముల మందము (వెడల్పు)ను కల దానిని అమర్చవలెను; ఈ తులకు బంగారు పట్టికలే ఆభరణములుగా ఉండవలెను; ఈ తులకు రెండు కొనలయందును ఇనుప పళ్ళెరములను ఇనుప గొలుసులతో బిగించవలయును, వీనిని బంగారుతో రత్నములతో చేసిన మాలలతో మాల్యములతో విలేపనములతో అలంకరించవలయును; అచట భూమిపై చక్రమును మ్రుగ్గులుగా విభజించి దానిపై తామర పూరేకులును ఇతర పుష్పములును చల్లవలయును; ఈ తులకు పైగా వచ్చునట్లు పుష్ప ఫలోప శోభితమగు ఐదు వన్నెల వితానకము (మేల్కట్టు -చాందినీ) ఏర్పరచవలయును.

ఇవికాక - వేదవిదులును మంచి రూపము వేసము వంశము శీలము కలవారు విధాన మందు సమర్థులు నేర్పు గట్టిదనము గలవారు అనుకూలురు ఆర్యదేశమునందు జన్మించినవారు అగు ఋత్విజులను వేదార్థ విచారణాదక్షుడును ఉత్తమ వంశోత్సన్నుడును మంచి శీలమును వంశమును సౌందర్యమును కలవాడును, పురాణములందును శాస్త్రములందును ఆసక్తి కలవాడును, మహాసమర్థుడును, ప్రసన్నముగాను, గంభీరముగాను మాటలాడువాడును, తెల్లని (శుద్ధ) వస్త్రములు ధరించువాడును, కుండలములను బంగారు హారములను ధరించినవాడును, భుజకీర్తులను కంఠాభరణములను ధరించి అందముగానుండు వాడునగు ఆచార్యుని నియమించుకొనవలయును. మండపము నందు ఉత్తరమున ఋగ్వేద విదులను దక్షిణమున యజుర్వేద విదులను పశ్చిమమున సామవేద విదులను ఉత్తరమున అథర్వణ వేదపారంగతులను ఇద్దరేసి చొప్పున కూర్చుండబెట్టవలయును.

వినాయకాదులగు దేవతలను గ్రహములను లోకపాలురను అష్టవసువులను ద్వాదశాదిత్యులను మరుత్తులు మొదలగు ఇతర దేవతాగణములను బ్రహ్మ విష్ణు రుద్ర రవులను ఉద్దేశించి ఆయా వనస్పతి సమిధలతో వారివారి మంత్రములతో నాలుగేసి హోమములను జరుపవలయును. వారివారికి శాస్త్రమందు చెప్పబడిన సూక్తములను ఈ దేవతల నందరను ఉద్దేశించి అయా సూక్తములను పఠించవలయును, హోమాంతమునందు ఆచార్యుడు తూర్య నాదములతో బలి పుష్ప ధూపములను ఇచ్చుచు యజమానునితో కూడి చెప్పబోవు మంత్రములతో లోకపాలుర నందరను క్రమమున అవహించవలయును.

1. సర్వ దేవతలచే సిద్ధసాధ్యులచే అభిష్టుతుడవు వజ్రధరుడవు అమరేశుడవు అప్సరోగణముచే వీజనము చేయబడువాడవు అగు భగవన్! నా యజ్ఞమును రక్షించుము, ప్రణవస్వరూడగు ఇంద్రునకు నమస్కారము.

2. సర్వ దేవతలకును హవిస్సును కొనిపోవువాడును ముని ప్రవరులచే అన్ని వైపులను ఆశ్రయించబడువాడును నగు కవీ (విద్వన్!) నీకు వందనము, తేజఃశాలురగు దేవగణముతో కూడి నా అధర్వ (యజ్ఞ)మును రక్షించుము, ప్రణవరూపుడగు అగ్నికి నమస్కారము.

3. వివస్వంతుని (సూర్యుని) కుమారుడు ధర్మరాజు సర్వామర పూజితుడు దివ్యమూర్తి శుభాశుభ ఫలములను ఇచ్చువారగు దేవాదులకు అధీశుడు శివ(శుభ)కరుడునగు దేవా! రారమ్ము, నాజయ్ఞమును రక్షించుము, నీకు నమస్కారము. ప్రణవరూపుడగు యమునకు వందనము.

4. రక్షోగణనాయకుడవు శుభములకు అధినాథుడవు లోకేశుడవు అగు నిరృతీ! భగవన్! నీకు నమస్కారము, సర్వ బేతాళపిశాచ సంఘములతో కూడిరారమ్ము; నా అధ్వరమును రక్షించుము, ప్రణవరూపుడగు నిరృతికి వందనము.

5. జలజంతు గణములతో సముద్రముల గణములతో అప్సరోగణములతో కూడిరారమ్ము, విద్యాధరేంద్రులచే అమరులచే గానము చేయబడు వరుణా! భగవన్! మమ్ము రక్షించుము, నీకు నమస్సు, ప్రణవరూపుడగు వరుణునకు నమస్కారము.

6. ప్రాణములకు అధిపతి కాలరూపుడగు కవి (విద్వాంసుడగు దేవుడు) నీకు తోడుకాగా మృగ (లేడి) వాహన మారోహించి దేవసంఘములతో కూడి నా యజ్ఞమును రక్షించుటకై రారమ్ము, భగవన్! నా పూజ నందుకొనుము, నీకు వందనము, ప్రణవరూపుడగు వాయువునకు నమస్కారము.

7. సోమా! యజ్ఞేశ్వరా! భగవన్! నీకు నమస్కారము, నక్షత్ర గణములతోను సర్వౌషధులతోను పితరులతోను కూడిరారమ్ము, నా పూజనందుకొనుము; నా యజ్ఞరక్ష చేయుము; ప్రణవరూపుడగు సోమునకు నమస్సు.

8. విశ్వేశ్వరా! రారమ్ము, లోకేశా! భూతపతీ! భగవన్! త్రిశూల కపాల ఖట్వాంగ ధారణముతో కూడిరారమ్ము, మా యజ్ఞ(ఫల)ము సిద్ధింపజేయుము, ప్రణవ రూపుడగు ఈశానునకు నమస్కారము.

9. పాతాళధరను (భూమిని) ధరించువారిలో ఇంద్రా! (శ్రేష్ఠా!) నాగాంగనలచే కిన్నరులచే గానము చేయబడువాడా! యక్షనాగదేవతాగణములచే పూజింపబడువాడా! అనంతా! మా యజ్ఞమును రక్షించుము. ప్రణవరూపుడగు అనంతునకు నమస్కారము.

10. సర్వ విశ్వమునకును సృష్టికర్తవై విశ్వాధిపతివగు చతుర్ముఖా! మునీంద్రులతో పితృ దేవతలతో కూడి రారమ్ము; అమిత ప్రభ(భా) వా! భగవన్! నీకు నమస్కారము; మా యజ్ఞమును రక్షించుము; ప్రణవరూపుడగు బ్రహ్మకు నమస్కారము.

త్రైలోక్యమునందును గల స్థిరచర భూతములును బ్రహ్మ, విష్ణు, రుద్రులును సదా నన్ను రక్షింతురుగాక! దేవదానవ గంధర్వ యక్షరాక్షస నాగ ఋషి మనుజ దేవ మాతృదేవత లందరును మోదముతో కూడి నా యజ్ఞమును రక్ష సేయుదురు గాక!

ఇట్లు దేవతల నావాహనము చేసిన తరువాత ఋత్విజులకు సువర్ణాభరణములను స్వర్నకుండలకటక సూత్రాంగుళీయపవిత్రములను, వస్త్రశయనాదులను ఈయవలెను. ఋత్విజున కిచ్చిన దానికి రెట్టింపు దక్షిణ నాచార్యున కీయవలయును. అతనికి భూషణ వస్త్రాదిక మధికముగా ఈయవలయును, ఈ సమయములందు దేవతాధివాసనము జరుగునది జరుగుచుండ అన్ని దిశలయందు ఉండు జాపకులు ఉపవాసముతో నుండి శాన్తికాధ్యాయములను పఠించుచుందురు, అది మధ్యావసానముల యందు బ్రాహ్మణులు స్వస్తి వాచనములు జరుపుచుండవలయును.

తరువాత యజమానుడు మంగళవాద్యాది ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించబడి శుక్ల వస్త్ర పుష్పధారియై వారిని దేవతలను తులను కూడ ముమ్మారు ప్రదక్షిణించి దోసిట కుసుమములను పట్టుకొని ఈ మంత్రముతో ‘తుల’ను అభిమంత్రించవలయును.

తులా! నీకు నమస్కారము; నీవు సర్వదేవతా శక్తిరూపురాలవు; సత్యము నాశ్రయించిన దానవు, లోకసాక్షి భూతవు; లోకధాత్రివి (లోకములను తమతమ స్థితియందు నిలుపుదానవు;) నిన్ను విశ్వయోని (జగత్కారణుడు) అగు నారాయణుడే నిర్మించెను; నీయందు సర్వ సత్యములును ఒకవైపున అన్ని అసత్యములును ఒకవైపున ఉండును; లోక హితకారిణీ! ధర్మాధర్మముల నాచరించు మానవుల నడుమ వానిని తూకము చేయుటకై భగవానుడు వారి నడుమ నిన్నుంచినాడు, తులా! నీవు సర్వభూతములకును ప్రమాణమని కీర్తింపబడుచున్నావు, నన్నును, నీవు తూకము చేసి, సంసారమునుండి ఉద్ధరించుము. నీకు నమస్కారము. దేవీ! చతుర్వింశతి తత్త్వములకును అధిపతియగు పంచవింశక (ఇరువది యైదవ తత్త్వమగు) ఏ పురుషుడు కలడో ఆ ఈ పరమ పురుషుడును నీయందధిష్టించియున్నాడు; కావున నీకు పునః పునర్నమస్కారము, తులా పురుష నామము గల గోవిందా! నీకు నమస్కారము! నమస్కారము; హరీ! నీవు మమ్ములను జన్మ సంసారసాగరము నుండి తరింపజేయుము, ఇట్లు దేవతాదివాసన కార్యమంతయునైన తరువాత వివేకియగు యజమానుడు పుణ్య సమయము రాగానే ఖడ్గము చర్మము (డాలు) కవచము ధరించి సర్వాభరణ భూషితుడై మరల తులను ప్రదక్షిణించి దాని నారోహించవలయును, అనంతరము బంగారు దారముతో (హారముతో) కూడిన ధర్మరాజును పిడికిళ్ళు గట్టిగా బిగించి పట్టుకొన్న చేతులతో పట్టుకొని హరి ముఖమును చూచుచు ఉండవలెను; తరువాత బ్రాహ్మణ శ్రేష్ఠులు రెండవ తులా భాగమందు (సిబ్బెయందు) యజమానుని బరువుతో సమమగు దానికంటె అధిక భారముగల అతి నిర్మలమగు బంగారము నుంచవలయును. పుష్టి (వృద్ధి) కాముడగు రాజు ఆ అపరతులాభాగమును అబంగారు బరువుతో ఆ సిబ్బె నేలను తాకునట్లు చేయవలయును, క్షణమాత్రము అట్లేయుండి అపుడు ఈమంత్రము ఉచ్చరించవలయును.

“సర్వభూత సాక్షీభూతా! సనాతనీ! నీకు నమస్కారము; దేవీ! నీవు పరమేష్ఠియగు పితామహుని (బ్రహ్మ)చే నిర్మింపబడినదానవు; స్థావరజంగమాత్మకమగు జగమంతయు నీచేతనే ధరించబడుచున్నది, సర్వభూతములకు ఆత్మభూతురాలవై వాటియందుండు భూతధారిణీ! నీకు నమస్కారము.”

తరువాత తులనుండిదిగి (తూచిన ధనమును) సగము ఆచార్యునకును అనంతరము మిగిలిన సగమును ఋత్విజులకును ఉదక పూర్వకముగా ప్రదాన మొనరించవలయును, గురునకును ఋత్విజులకును గ్రామములను రత్నములను ఈయవలెను. అంతేకాదు; వారి అనుమతి నంది అట్లే ధనమును ఇతరులకును ఇప్పించవలయును, బ్రాహ్మణులను దీన అనాధులను కూడ పూజించవలయును, ప్రోక్షితమగు (దానమునకై నీరు చల్లబడిన) స్వర్ణమును వివేకియగు దాత ఎక్కువకాలము ఇంటియందు ఉంచుకొనరాదు, ఉన్నచో అది మానవులకు భయావహమును శోక వ్యాధికరమును అగును. అది ఎంత శీఘ్రముగా పరులు స్వీకరించినచో దాతయగు నరునకంత అధిక శ్రేయము కలుగును.

ఈచెప్పిన విధానమున నెవడు ‘తులాపురుష’ దాన మాచరించునో అతడు ఒక్కొక్కలోకాధి పతి లోకము నందు ఒక్కొక్క మన్వంతర ముండును, అనంతరము అప్సరః పూజితుడగుచు రవి సమాన వర్ణమును చిరుమువ్వల గుముల మాలలతో అలంకృతమునగు విమానముపై విష్ణు లోకమునకు ఏగును; శతకోటి కల్పములు సమగ్రముగా ఆ లోకమునందు పూజితుడగుచు సుఖించును; పుణ్యకర్మ ఫలక్షయము కాగా ఇహలోకమునందు మరల రాజరాజయి జన్మించును; భూపాలుర కిరీటములందలి మణులచే రంజితమగు పాదపీఠము కల చక్రవర్తియై శ్రద్ధాయుక్తతతో యజ్ఞ సహస్రములతో దేవతలను యజం(ఆరాధిం)చి మిగులదీపించు తన ప్రతాపముచే సర్వనాక లోకమును జయించినవాడగును. భక్తియుక్తుడై ఎవడు ఈ తులాపురుష దానము ఈయబడుచుండగా చూచునో కాలాంతర మందెపుడైన తాను చూచిన ఈ విషయమును స్మరణకు తెచ్చు కొనునో ఈ విషయమును బ్రాహ్మణాదులచే చదివించు (కొను)నో, వినునో, చదువునో, అతడును ఇంద్ర సమానరూపుడును వందల కొలది యానందములతో కూడ ఇంద్రసమానుడును అగుచు ఇంద్రాది దేవతలకు ఆశ్రయమయి వారనుభవించు స్వర్గలోకమును పొంది సుఖించును.