మత్స్య మహా పురాణము
కార్పాస (దూది) పర్వత దానము
ఈశ్వరుడు నారదునితో ఇట్లు చెప్పెను, ఇదే విధముగ కార్పాసపర్వత దానమును గలదు. దానికై పదికాని, ఐదుకాని శక్తిలేకున్నచో ఒకటికాని బారువల దూదితో శక్తియుండియు వంచన చేయక పర్వతముల నిర్మించవలెను. అన్ని యంశము లందును ధాన్య పర్వతము విషయమున వలెనే చేయవలయును. దాన దినపు ఉదయమున (దానకాలమున) ఈ మంత్రము చెప్పవలయును, కార్పాస పర్వతమా! లోకములకు ఎల్లప్పుడును ఆచ్ఛాదనము చేయు (కప్పెడి) సాధనము నీవేకదా! (వస్త్ర రూపమున దూది ప్రాణుల శరీరమును కప్పుచున్నది) నీకు నమస్కారము; ఇట్టి నీవు నాపాపములను పోగొట్టుము. ఇట్లు చెప్పుచు శివ సన్నిధియందు కార్పాస పర్వత దానము చేయువాడు కల్పమంతకాలము రుద్రలోకమునవసించి మరలకల్పాది సృష్టి యందు రాజై పుట్టును.