ధర్మ నామక ఋషి వంశ వివరణము

మత్స్య జనార్దనుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఈ వైవస్వత మన్వంతరము వచ్చిన మీదట ధర్ముడను అతనికి దక్షపుత్రికల యందు సకల దైవత వంశమును ఉత్పన్నమయ్యెను. వారిలో ఆరుంధతి యందు 1. సకల పర్వతాదిమహాదుర్గ ప్రదేశముల దేవతాత్మ తత్త్వములును జనించెను. సోమ పాయులు (సోమ పానము చేయు యోగ్యతకల) వసువులు ఎనిమిదిమంది; 2. వసువను నామె యందు జనించిరి. వారు ధ్రువుడు, ధరుడు, సోముడు, ఆపుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు; ధరునకు, ద్రవిణుడు, ధ్రువునకు, కాలుడు, సుతులు, కాలావయవ శరీరములన్నియు మూర్తి మంతములై కాలునకు జనించెను. సోమునకు వర్చుడు ఆపునకు శ్రీమాన్ అనలునకు (శివుని నుండి గంగనుండి శరస్తంబము నుండి కృత్తికల నుండి) అనేక జన్మముల తరువాత పుట్టిన కుమారస్వామి అనిలునకు పురోజవుడు ప్రత్యూషునకు దేవలుడు ప్రభాసునకు దేవతల వడ్లంగియగు విశ్వకర్మ జనించిరి; 3. యమి అను నామెయందు నాగవీథి మొదలగునవి జనించెను. వీరు గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణముల శ్రేణులు; 4. లంబ అనునామె యందు ఘోషులు అనువారు కలిగిరి; 5. భానువను నామెయందు భానువులు కలిగిరి; 6. మరుత్వతియందు మరుత్వంతులనువారు కలిగిరి; 7. సంకల్పయందు సంకల్పులు; 8. ముహూర్త యందు ముహూర్తములు; 9. సాధ్యయందు మనుడు, మనువు, ప్రాణుడు, నరుడు, జాతుడు, వీర్యవంతుడు, చిత్తహార్యుడు, అయనుడు, హంసుడు, నారాయణుడు, విభువు, ప్రభువు అను పండ్రెండు మంది సాధ్యులు కలిగిరి, 10. విశ్వ అను ధర్ముని పత్నియందు క్రతువు, ధక్షుడు, వసుడు, సత్యుడు, కాలుడు, కాముడు, అతిథి, కురజుడు, మనుజుడు, విశ్వుడు, రోచమానుడు అను పదిమంది విశ్వేదేవులు కలిగిరి. రాజముఖ్యా! నీకిట్లు ధర్ముని వంశమును సంక్షేపముగా తెలిపితిని. విస్తరించి చెప్పుట అనేక శతవర్షముల కాలమునతప్ప శక్యము కాదు.