మత్స్య మహా పురాణము
శర్మిష్ఠా దేవయానీ విరోధకారణము
శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను, కచుడు శుక్రుని వలన విద్యను సంపాదించి కొనిరాగా దేవతలు మిగుల సంతోషించి ఆ విద్యను కచునినుండి అధ్యయనము చేసి కృతార్థులయిరి. తరువాత వారు అందరును ఇంద్రుని కడకు పోయి-ఇది మనము విక్రమము చూపదగిన సమయము. శత్రువులను చంపుదము-అనిరి. వారి మాటను వినుచునే క్రోధముతో చూచిన ఇంద్రునకు విజన ప్రదేశమున కుబేరుని చైత్రరథమువంటి వనమున జలమున క్రీడించుచున్న రాక్షస కన్యలు కనబడిరి. అతడు వాయువుగా నయి వారి వస్త్రములను అన్నిటిని కలిపివేసెను. కొంతసేపటికి నీటినుండి పైకివచ్చిన ఆకన్యలు అందరును చాల వరకు ఒకరిది మరియొకరికి రాకుండునట్లు వస్త్రములను తీసికొని ధరించిరి. వారిలో వృషపర్వుని కూతురు శర్మిష్ఠ వస్త్రముల మార్పిడి గుర్తించలేక తాను దేవయాని వస్త్రమును తీసికొని ధరించెను. అంతట దాని నిమిత్తమై శర్మిష్ఠా దేవయానులకు విరోధము ఏర్పడెను.
దేవయాని: “నీవు రాక్షస కన్యవు నాకు శిష్యురాలవు అయిఉండి నా వస్త్రమును ధరించితివి. కనుక నీకు శ్రేయస్సు కలుగకుండుగాక!
శర్మిష్ఠ: మా నాయన ఉన్నత స్థానమున కూర్చున్నప్పుడును ఆయనను మీ నాయన తాను క్రింద నిలువబడి మాటిమాటికి వినీతుడై స్తుతించుచు యాచించుచు ఉండును. నీవు పొగడెడి-అడుగుకొనెడి-వాని కూతురవు. నేనో-పొగడబడెడి-యాచింపబడెడి-వాని కూతురను. నీవు నిరాయుధవు. నేను సాయుధను. బిచ్చగత్తెవు నీవు నాపై ఏమి కోపింతువు? నీకు సాటియగు ప్రతియోద్ధ (ఎదిరించి యుద్ధము చేయువాడు) లభించును లెమ్ము. నేను మాత్రము నిన్ను నా సరిదానిగా లెక్కింపను.”
జరిగిన దానికి ఆశ్చర్యపడుచు దేవయాని వంగి తన వస్త్రమునకై పట్టుదలతో నుండెను. ఆమెను బావిలో త్రోసి శర్మిష్ఠ తన పురమునకు పోయెను. పాపసంకల్పము గలదియై ఆ శర్మిష్ఠ, దేవయాని మరణించియుండునని తలంచుచు క్రోధవేగవశురాలయి తిరిగియైన చూడక అక్కడి నుండి వెడలిపోయెను.
అంతలో నహుష పుత్రుడగు యయాతి వేటకై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు మృగముల వెంట నంటి పోగాపోగా అతని రథపు గుర్రములును తానును అలసిపోయెను. దప్పిగొనెను. అతడు నీటికై వెదకుచు దగ్గరలో నీటితొట్టి ఉండియు నీరులేని గోతిలో ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలవలె ఉన్న కన్యను దేవయానిని చూచెను. ఆ నరశ్రేష్ఠుడు మహా మనోహరమగు మాటలతో ఆమెను ఓదార్చుచు దేవకన్యవంటి ఆదేవయానిని ఇట్లు ప్రశ్నించెను: ”మనోహర ముఖము చక్కని దేహచ్ఛాయ చక్కగా మెరుగుదీర్చిన మణికుండలములు కలిగి ప్రకాశించుచున్న నీవు ఎవరవు? ఏలచింతించుచు ఆతురురాలవయి శోకించుచున్నావు? తీగలతో గడ్డితో కప్పబడి ఉన్న ఈగోతిలో ఎటుపడితివి? నీవుఎవ్వరి కూతురవు? అంతయు నాకు విశదముగా చెప్పుము.”
దేవయాని: “యుద్ధమున మరణించిన దానవులను తన విద్యతో బ్రతికించెడి శుక్రుని ఎరుగుదువు కదా! నే నాతని కూతురను. కాని ఆయన నన్ను లెక్క పెట్టుచున్నట్లు లేదు. నీవు ఉన్నత వంశమున జన్మించిన వాడవని నాకు తెలియును. నీవు వీర్యవంతుడవును యశోవంతుడవును అని అందరును నిన్ను గురించి చెప్పుచున్నారు. కావున నీవు నన్ను అంటినను దోషము లేదు. ఇదుగో! ఎర్రని గోళ్లును వ్రేళ్లును కలిగి ప్రకాశించు నాకుడిచేయి. దీనినిగ్రహించి బావిలో నుండి నన్ను పైకి తీయుము.”
యయాతి ఆమె బ్రాహ్మణ స్త్రీయని ఎరిగి ఆమె కుడిచేతిని పట్టి ఆ గోతినుండి ఆమెను పైకి తీసెను. తరువాత ఆమె దగ్గర సెలవు తీసికొని అతడు తన పురమునకు పోయెను.
తరువాత ఆ దేవయాని చూర్ణికయను తనచెలిని చూచి నేను ఇక వృషపర్వుని పురము ప్రవేశించను. ఈ విషయమును నీవుపోయి మాతండ్రికి చెప్పుము అనెను. చూర్ణికయును త్వరితముగా పోయి వృషపర్వుని భవనమున శుక్రుని దర్శించి, తెలివి తప్పి వణకుచు “ఓ మహాప్రజ్ఞా! మహాభాగురాలగు దేవయానిని వృషపర్వుని కూతురగు శర్మిష్ఠ కొట్టినది” అని చెప్పెను. అది విని శుక్రుడు దుఃఖముతో ఆమెను వెదకుచు అడవికి పోయెను. అడవిలో ఆమె కనపడగానే అతడామెను కౌగిలించుకొని దుఃఖముతో ఇట్లు పలికెను: “ఎల్ల ప్రాణులును తమ దోషముల (కర్మముల) ఫలముగానే దుఃఖమునుగాని సుఖమునుగాని పొందుచుందురు. నీవు ఏదోదుష్కర్మమును చేసియుందువు. దానికి ఇది ప్రాయశ్చిత్తము అయి యుండును.” అనగా ”ఇది ప్రాయశ్చిత్తము కావచ్చును. కాకపోవచ్చును. నా మాట సావధానముగా వినుడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నేను తనకంటే హీనురాలనే కాని అధికురాలను కాదు అనినది. ఈ మాట నిజమే అగునా? ఆమె తన కన్నులను క్రోధముతో మిగుల ఎర్రజేసి తీక్ష్ణముగను పరుషముగను మాటలాడినది. నీవు స్తుతించుచు యాచించుచు దానములు అందుకొనెడి వాని కూతురవు. నేను స్తోత్రములు అందుకొనుచు యాచింపబడుచు దానములు పట్టక ఉండెడి వాని కూతురను అని శర్మిష్ఠ నన్ను తూలనాడినది. ఈమాటలు పలుకునప్పుడు ఆమె మొగము ఎంత దర్పముతో నిండి యున్నదనుకొనుచున్నావు! నేను నిజముగ స్తుతించుచు యాచించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతురనేమో నీవే చెప్పుము. అట్లయినచో నేనామెను వేడికొని అనుగ్రహింప జేసికొందును” అని దేవయాని పలికెను. అదివిని శుక్రుడు ఇట్లనెను: “ప్రియపుత్రీ! నీవు స్తుతించుచు దానములు ప్రతి గ్రహించుచు ఉండువాని కూతురవుకావు. స్తుతింపబడువాని కూతురగు దేవయానివి నీవు. ఈ విషయము వృషపర్వునికే తెలియును. యయాతికిని తెలియును. ఊహింప అలవికానిదియు ఉత్పత్తి నాశములు అనెడి ద్వంద్వము లేక నిత్యమును ఈశ్వర సంబంధియునగు బ్రహ్మము (వేదము) నాకు గల బలము”