మత్స్య మహా పురాణము
హిమవత్పర్వత వర్ణనము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, మద్రరాజగు పురూరవుడు రమ్యమగు ఆ ఇరావతీ నదిని చూచుచున్నంతలోనే నదీవాయు స్పర్శచే అతని బడలిక అంతయు తీరెను. అనదివెంట ఎగువకు మరికొంత దూరము పోగా మహాగిరి హిమవంతము కానవచ్చెను. దాని తెల్లని బహు శృంగము లాకాశమును ఒరయుచుండెను. వానిపై పక్షు లనేకములు సంచరించుచు చూడ ముచ్చటయై ఉండెను. ఋషులకు తపోజ్ఞాన సిద్ధిప్రద మాకొండ. మరి వేరుశబ్దముల విననీయని చప్పుడులతో పడు శీతల జలనదీ ప్రపాతములతో అకొండ మనోహరముగ ఉండెను. (మహాబాహువులో యనదగు) నీలములగు దేవదారు వనములతో ఒప్పు ఆ కొండపై కనవచ్చు మేఘములు ఉత్తరీయములుగా ఉండెను. ఆయా తావులందు తెల్లని మేఘములు తలపాగలై చంద్రార్కులు మకుటములై మంచు పొరలును గైరిక ధాతువులును గంధానులేపనములై పలువన్నెల వెలయుచు ఐదు వ్రేళ్ళతో రాచకొనిన చందనరేఖలో యన కనవచ్చుచుండెను. వేసగి యందు చలువలు ఇచ్చు శిలలతో విషమమును ఇరుకునునైన ఆ కొండపయి అప్సరల పాదముల అత్తుక పారాణి ముద్రలును ఆసవపాన ప్రసంగమున జారిపడిన గంధర్వుల అప్సరసల కాలి గుర్తులును కనబడుచుండెను. దాని కొన్ని తావులు రవి కిరణ తప్తము కాగా మరికొన్ని కదుచల్లనై ఉండెను. కొన్ని యెడల నా పర్వతము తన భయంకర గుహలను నోళ్ళతో మహా పరిమాణ జలముల త్రావుచుండెను. కొన్ని తావులు క్రీడించు విద్యాధరగణములతోను కిన్నర గణ ముఖ్యుల ఉపగానములతోను ఒప్పుచుండెను. కొన్ని తావులందు సనానకాది దివ్య (కల్ప) వృక్ష విశేషములు పూచిన పూలును మరికొన్నిట గంధర్వు లనుభవించి విడువగా నలిగిపడిన కుసుమమాలలును మనోరమములై యుండెను.
ఆ కొండ మరియు ఆయా తావులయందు వాయువునే ముందునకు పోనీయని ఎత్తయిన నల్లని పచ్చికల బయళ్ళతోను వివిధ కుసుమములతోను అత్యంత మనోహరమయి వివిధ మృగములయు కరులయు సంచారములతో అద్భుతమయి సింహముల నాదములతోను అవి విని భయమందిన మృగముల భైరవ రవములతోను భయానకమయి యొప్పుచుండెను. ఐనను అచటి గజములు మాత్రము అలయక కలతపడకుండును. ఇంతయేల? ఆ హిమవంత మందలి పొదరిండ్లును ఆట తపమొనర్చు తాపసులతో అంకృతములు కాగా ఆ కొండనుండి ఉత్పన్నములగు రత్న విశేషములతో త్రైలోక్యమును అలంకృతమగుచుండును. ఆ కొండ సదా అహీన (అహి + ఇన-సర్పశ్రేష్ఠములకు) శరణము (వాస స్థానము); అహీన (హీనులుకాని గొప్ప) జనులిద్దాని సేవింతురు. సంపదలతో అహీన (యుక్త)మగు ఆగిరిని ఆహీనుడు మాత్రమే దర్శించును. తాపసు లచట అల్ప తపమొనర్చియు సిద్ధినందుదురు. దాని దర్శన మాత్రమున సర్వకల్మష నాశమగును. తద్గిరి ప్రదేశములు కొన్ని నదీ ప్రపాత సంపాతవశమున వేగముగ పారు జలములనుండి రేగిన వాయువుచే ఆటకటకు కొనిరాబడిన జలముల (బిందువుల)తో సంతృప్తములయి యుండెను. జలరహిత మేఘములతో వెలయు ఉన్నత శృంగములతో ఆగిరి నవ్వుచున్నదో యనునట్లుండెను. దాని శిఖరములు కొన్ని నిరంతర రవికిరణ తప్తములును విషమములును నగుటచే మనస్సుతోనైన చేరనలవి కాకుండెను. దట్టములై నిండిన ప్లక్ష (జువ్వి) దేవదారు మహావృక్షములతోను స్తంభములవలె కననగు వెదుళ్ళతోను వృక్షములతోను ఆగిరి ఉపశోభిల్లుచుండెను. ఆగిరిగుహలు సింహనాదానునాదితములు; శిఖరాగ్రములందలి పగుళ్ళతోను శబ్దము మాత్రమే లభించు జల ప్రదేశములతోను హిమముతో మూతపడిన గుహలతోను ఆగిరి కొన్ని తావుల భయానకమును విషమమును ఆగమ్యమునునై యుండెను. మనోహరమగు నితంబ (పర్వతమందలి చదునైన ఉన్నత) ప్రదేశములతో ఒప్పు ఆ హిమవంతమును చూచుచు పోవుచు మహానుభావుడగు ఆమద్రరాజు పురూరవసుడు తాను వసించి తపమునేయ యోగ్యమగు తావునకై వెదకివెదకి తుదకట్టిది చేరెను.