దేవతలు మహేశుని స్తుతించుట

అంతవరకును సుశీలురుగా నుండిన త్రిపుర దుర్గస్థులగు దైత్యులు దానవులు ఇట్లు దుష్టులును దురాత్ములు నయిరి. వారు లోకములను నాశము చేయసాగిరి. తపోధనుల తపోవన ములను పెకలింపసాగిరి. దైత్యుల సింహనాదముతో ప్రాణులు భయభీతములు కాసాగెను. త్రైలోక్యమును భయముతో సమ్మోహితమై చీకటిలో కన్నులు కనబడనట్లయ్యెను. అంతట ఆదిత్యులు వసువులు సాధ్యులు పితరులు మరుద్గణములు భీతులయి లోకప్రపితామహుడగు బ్రహ్మను శరణు వేడబోయిరి. వారు సువర్ణ కమల పీఠమున ఆసీనుడయి యున్న ప్రపితామహుని సమీపించి దర్శించి అందరు నొక్కటిగ నమస్కరించి ఇట్లుపలికిరి: దేవా! నీ వరములచే దర్పించి ఈ త్రిపుర దుర్గావాసులగు దానవులు ప్రభువులు తమ సేవకులను బాధించినట్లు మమ్ముల బాధించుచున్నారు. వారి భయమున మేము సింహములకు భయపడు మృగములవలె పృథివి యందంతట తిరుగుచున్నాము. వారి భయముతో తిరుగు మాకు మాపత్నీ పుత్రుల పేరులు కూడ జ్ఞప్తిలో లేకుండపోయినవి. దానవుల ఉపద్రవముల నుండి నీవు మమ్ము కాపాడనిచో త్వరలోనే జగమున దేవతలు కాని మానవులు కాని ఒక్కడును లేకపోవుట నీవే చూడగలవు.

ఇట్లు పలికిన చంద్రుని వంటి ముఖకాంతులుగల దేవతల వచనములు విని పద్మ భవుడగు బ్రహ్మ వారితో ఇట్లనెను: దేవతలారా! మీరును గొప్ప బుద్ధిమంతులు కదా! ఆలోచింపుడు. నేను వారితో వరప్రదాన సమయమున పలికినట్లు వారి నాశమునకు ద్వార భూతమగు సమ యము దగ్గరకు వచ్చినది. కాని నేననినట్లు వారి త్రిపుర దుర్గమును ఒకే బాణముతో కొట్టగలవారు పరమేశ్వ రుడు తప్ప మీలో నొక్కరును నున్నట్లు నాకు కనబడుట లేదు. జగత్పతియు మహే శ్వరుడు మహాదేవుడగు శివునకు తప్ప ఇతరులకు ఈ త్రిపుర దుర్గమును ఒకే బాణముతో ఒకే మారు ఆత్మ వీర్యముతో పడగొట్టుట శక్యమా?

కనుక మీరందరు సరే అనినచో మన మందరమును పోయి క్రతు విధ్వంసియగు హరుని వేడుకొందము. అతడు త్రిపుర దుర్గమును నశింపజేయును. ఆ మయుడు త్రిపురములను తను ఒకే ప్రహారముతో కొట్టుట శక్యము కాకుండునట్లు ఒక్కొక్క పురపు విష్కంభముగాని ఒక పురమునకు మరియొక పురమునకు అంతరముకాని నూరేసి యోజనములుండునట్లు వానిని నిర్మించినాడు. వాడు వానిని పుష్యయోగమున నిర్మించెను. త్రిలోచనుడగు శివుడైనచో ఒకే బాణమున పుష్యయోగమునందే అన్నిటి నాకేమారు క్షణమున దహించగలడు. (విష్కంభము= నడిమి కొలత)

దైత్యభయ దుఃఖితులగు దేవతలును ‘అట్లే పోదము’ అనగా బ్రహ్మయు వారితో కలిసి శివుని కొలువునకు పోయెను. వారచట శివునిదర్శించిరి. ఆ దేవుడు భూతభవేశ్యుడు; జగత్సంహార కర్త; ఉమతో నందితో కూడి అగ్ని వర్ణమయ దేహముతో అగ్నిరాశి సమాన నయనములతో అగ్నివర్ష విభూషణములతో వేలకొలది అగ్నులవలె సూర్యులవలె ప్రకాశించుచు చంద్రుని అవయవ లక్షణములు చంద్రునివలె సౌమ్యమగు ముఖము కలిగియుండెను. అతడు అగమ్యుడు అజుడు ప్రకాశమానుడు మదన శత్రువు త్రినేత్రుడు ఎల్లరకు ఎల్ల కోరికలు తీర్చువాడు సుఖకరుడు సర్వలోక పతి పార్వతీపతి.

ఇట్టి శివుని దర్వించి దేవత లాదేవు నిట్లు స్తుతించిరి. (ఇది మాతృకా సంఖ్యతో ఏకపంచా శన్నా మాత్మకమగు స్తోత్రము) భక్తులకు శుభకరుడు పాపులకు హింసకుడు బాధలు తొలగించు వాడు వరము లొసగువాడు, జీవుల కధిపతి, భయంకరుడు, జటాజూటధారి మహాదేవుడు దుష్టులకు భయంకరుడు త్రినేత్రుడు ప్రజాధిపతి ఈశ్వరుడు భగుడను ఆదిత్యుని కొట్టినవాడు, అంధకుని చంపినవాడు, నీలకంఠుడు సూర్యాదులచేకూడ భయముతో పనులు చేయించువాడు లోకకర్తల కును కర్తలకును అధిపతి కుమారస్వామికి శత్రువులగువారి నశింప జేయువాడు కుమారస్వామికి తండ్రి విశేషముగా జటాజూటమున ఎర్రని వాడు ధూమ్ర వర్ణుడు లోకముల ధరించువాడు పాపుల నరకువాడు నీలకేశుడు శూలధారి దివ్యశయనుడు ఉరగ భూషణుడు సునేత్రుడు హిరణ్యము వసువు రేతస్సుగాగల అగ్నిస్వరూపుడు అచింత్యుడు అంబికా భర్త సర్వదేవస్తుతుడు వృషభధ్వజుడు దుష్టుల విషయమున కోపి జటాధారి బ్రహ్మచారి జలము లందుండి తపమాచరించుచుండువాడు బ్రహ్మతత్త్వవేత్త ఆ జితుడు విశ్వ స్వరూపుడు విశ్వస్రష్ట విశ్వమందావరించి యుండువాడు దివ్యుల సేవలందుకొనువాడు సర్వసంపదలకు ప్రభువు ఆశ్రయింపదగినవాడు కోరికలు వేడదగినవాడు ఎల్లపుడు పనిలో మునిగియుండువాడు భక్తాను కంపి జన్మమునకు తగిన ఉత్తమగతి నిచ్చువాడు నగు దేవా నీకు నమస్కారము.

ఇందు దేవతాకృతశివస్తుతి మాతృకా (ఏకపంచాశత్) సంఖ్యాకముగానున్నది. ఇందలి మూల భూత భావనను ఇట్లు ఊహించవచ్చును : వాఙ్మయ మంతయు ఏకపంచాశన్మాత్రకా (వర్ణసమామ్నాయ) మయము. అ-నుండి అః వరకు పదునారు; క నుండి-మ-వరకు ఇరువది యైదు; య-ర-ల-వ-శ-ష-స-హ-ళ-క్ష-పది; మొత్తము ఏబదియొకటి. కావుననే శబ్దబ్రహ్మరూపయగు శ్రీదేవిని మాతృకారూపనుగా ఉపాసింతురు. కావున ఇట్లు మాతృకా సంఖ్యాకనామములతో స్తుతించుట సమస్త వాఙ్మయముతో స్తుతించుటయు శబ్ద రూపయగు పరమేశ్వరికిని పరమేశ్వరునకును అర్థ (సమస్త జగద్) రూపుడగు అభేదమును భావనచేసి సకల బ్రహ్మతత్త్వము నుపాసించుటయునగును. ఇది సాధకులకు సకలార్థ సాధకము.