మత్స్య మహా పురాణము
బ్రహ్మాండ దాన విధానము
శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను, ఇప్పుడిక ఉత్తమమగు బ్రహ్మాండ దానమును తెలిపెదను; వినుము; ఇది సర్వదానములలో శ్రేష్ఠమును మహాపాతక నాశనమును అయినట్టిది. పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను వస్త్ర భూషణాదికమును ఏర్పరచుకొనవలెను; అట్లే లోకపాల ఆవాహనమును దేవతాధివాసన మును జరుపవలయును, ఇరువది పలములకు తక్కువ కాకుండ వేయి పలముల వరకుగల తూకముగల బంగారుతో రెండు కలవములను బ్రహ్మాండమును చేయించవలయును, అందు అష్ట దిగ్గజములు చతుర్వేద షడ్వేదాంగ లోక పాలాష్టక చతుర్ముఖ శివ, విష్ణు, రవి ప్రముఖులును పార్వతీ, లక్ష్మీ దేవులును అష్ట వసువులును ద్వాదశాదిత్యులును సప్తమరుత్తులును మహారత్నములును ఉండవలయును, పండ్రెండు మొదలుగా నూరువరకు అంగుళముల పొడవు వెడల్పులుగల పట్టు వస్త్రమును పరచి దానిపై తిలద్రోణము నుండి దానిపై ఈ బ్రహ్మాండాదులను ఉంచవలయును, దాని చుట్టును పదునెనిమిది ధాన్యములు ఉంచవలెను; తూర్పున అనంత శయనుడగు నారాయణుని ఆగ్నేయమున ప్రద్యుమ్నుని దక్షిణమున ప్రకృతి దేవిని నైరృతమున సంకర్పణుని పశ్చిమమున నాల్గు వేదములను వాయవ్యమున అనిరుద్ధుని ఉత్తరమున అగ్నిని ఈశాన్యము నందు వాసుదేవుని బంగారు ప్రతిమలుగా గుడ పీఠములయందు నిలిపి పూజించవలెను; నూతన వస్త్రము చుట్టిన పూర్ణ కుంభములు పది అటనుంచవలెను.
ఈ పది పాడి ఆవులను బంగరుసరిగ (జరీ) వస్త్రములను, పాలు పిదుకు పాత్రలను పాదుకలను, పాదరక్షలను, ఛత్ర చామరాసన దర్పణములను భక్ష్య భోజ్యాన్న దీపేక్షు ఫలపుష్ప సుగంధాను లేపనములను ఈయవలయును, హోమమును దేవతాధి వాసనమును ముగిసిన తరువాత, వేదవిదులగు విప్రపుంగవుల మంత్రములతో వారిచే స్నానము చేయించబడి యజమానుడు వారిని దేవతలను ముమ్మారు ప్రదక్షిణించి ఈ మంత్ర ముచ్చరించవలయును. “విశ్వేశ్వరా! విశ్వధామన్! విశ్వేశ్వరులకు ఆధారమా! జగత్సృష్టి కర్తా! సప్తర్షులకును లోకములకును అమరులకును ఈశా! ఈ హిరణ్మయ గర్భముతో కూడిన నీవు మాకు అభి (సర్వ విధములగు) రక్షను దయచేయుము. చరాచర ప్రాణుల పాపములు తొలగిపోవును గాక! నీ దానమనెడు శస్త్రములతో మా పాతకములు దెబ్బలుతిని బ్రహ్మాండ మందలి దోషములన్నియు నాశమందుగాక!”
ఇట్లు అమర విశ్వగర్భుడగు బ్రహ్మాండాధిపతిని నమస్కరించి ఈ ద్రవ్యమంతయు పది భాగములుగా విభజించి బ్రాహ్మణుల కీయవలయును, అందు రెండు భాగములు గురునకును మిగిలిన ఎనిమిది భాగములును ఋత్విజులకు సమానముగాను అనుక్రమముగా పంచవలయును, హోమమును అల్పముగానే ఏకాగ్నివిధానమున జరిపినపుడు గురుడు ఒక్కడే యుండును గాన అతనినే పూజ్యతమునిగా గ్రహించి యథోక్త వస్త్రాభరణాధికముతో అతని నర్చించ వలయును.
ఈ విధమగు విధాన ప్రక్రియతో బ్రహ్మాండ దానమును చేసిన పురుషుడు మహా విమానమును ఆశ్రయముగా చేసికొని పాపములు కడిగి వేయబడగా నిర్మలతనుమానసుడై అప్సరసలతో కూడి ఆనందకరమగు మురారి లోకమునంది, అందు సుఖములందును, అతడు పితృ పితామహ పుత్ర పౌత్ర బంధుప్రియాతిథి కళత్రాదులగు నూట ఎనిమిది మందిని కూడ సంసారము నుండియు నరకము నుండియు తరింపజేయును; తన తల్లి మాత్రమే కాదు తన అశేష కులము కూడ ఈ బ్రహ్మాండ దానముచే తన పాతకములు నశించగా తరించి ఆనందము నందును; దీనిని పఠించినను వినినను సురభవనములందు సుఖించును, ధార్మికుల గృహముల యందు జనించి ధర్మపరుడై జీవించును, జనులకు ఉత్తమగతి నందించి తాను అప్సరలతో కూడి అమరేంద్ర భవనమున ఆనందమందును.