పూరు వంశము

సూతుడు పూరువంశ వృత్తాంతమును ఋషులకు ఇట్లు చెప్పెను: పూరునకు జనమే జయుడు అతనికి తూర్పుదెస నంతటిని పాలించిన ప్రాచీన్వతుడు అతనికి మనస్యుడు అతనికి వాతాయుధుడు అతనికి శంకుడు అతనికి బహువిదుడు అతనికి సంపాతి అతనికి అహంవాది అతనికి భద్రాశ్వుడు అతనికి ఘృతాచియను అప్సరసయందు ఋచేపు, విలేపు, కక్షేపు, ఘృతేపు, విచేపు, స్థండిలేపు, బలేపు, ధర్మేపు, సంతతేపు, పుణ్యేపులను పదిమంది కుమారులు. వీరిలో ఋచేపునకు తక్షక పుత్రియగు జ్వలనయందు అంతినారుడు అతనికి మనస్విని అను భార్యయందు వీరుడగు అంశుడను నరపతియు ధార్మికుడగు త్రిహనుడును గౌరియను కన్యయు కలిగిరి. ఈ గౌరి మాంధాతృని తల్లి యయ్యెను. అంశునకు ఉపదాన అను పత్ని యందు బ్రహ్మవాదులగు రుష్యంతుడు, దుష్యంతుడు, ప్రవీరుడు, అనఘుడు అను కుమారులు కలిగిరి. అతనికి యుద్ధ విజయియగు భరతుడు అను చక్రవర్తి కలిగెను. ఈతని పేరుననే ఈ వంశము వారికి భారతులను పేరు వచ్చెను. శకుంతల ఈతని తల్లి. (శకుంతలను దుష్యంతుడు తిరస్కరించినపుడు) అశరీర వాణి దుష్యంతుని ఉద్దేశించి ఇట్లనెను: “దుష్యంతా! తల్లి (వస్తువులను దాచు) తోలుతిత్తి వంటిది. కుమారుడు తండ్రికి చెందినవాడు. అతడు తాను ఎవరివలన పుట్టెనో అతడే కాని వేరుకాదు. (కనుక కుమారుని వదలుట తన్ను తాను వదలుకొనుటయే యగును.) కనుక నీవు ఈకుమారుని భరించుము. శకుంతల సత్యమే చెప్పినది. తనకు జన్మకారణముగా రేతస్సును (శుక్రమును-గర్భమును) నిలిపిన తండ్రిని యమలోకము (నందలి బాధల) నుండి సుతుడు కాపాడును. దుష్యంతా! (శకుంతలయందు) గర్బము నిలిపినవాడవు నీవు. ఈ శకుంతలను అవమానించకుము. (ఈతనిని భరించుము అని చెప్పబడినవాడు కనుక భరతుడు.)

పూర్వము భరతుని కుమారులు తమ తల్లి కోపమునకు గురియై ఒకేమారు అందరును నశించగా మరుత్తులు (దేవతలు) బృహస్పతి పుత్రుడగు భరద్వాజుని ఈ భరతునికి పుత్రునిగా సంక్రమింపజేసిరి.

సూతుడిట్లు చెప్పెను, ఉత(చ)థ్యుడు తనభార్యమమత గర్భవతిగా ఉండగా మరణించెను. అతని తమ్ముడు బృహస్పతి మమతను చూచి “సుందరీ! నీవు చక్కగా అలంకరించుకొని నాతో కలియుటకు సిద్ధవు కమ్ము. నీవు నాకేమియు కట్టుబాటు మాటలు (నీతులు) నేర్పవలదు” అనెను. మమత “ప్రభూ! నేను గర్భవతిని. గర్భము పరిణతమయి (ప్రసవమునకు సిద్ధమయి) యున్నది. ఆశిశువు వేదమును చెప్పుచున్నది. నీవును వ్యర్థముకాని వీర్యముకలవాడవు. ఇటువంటి ధర్మము నిందిత మయినది”అనెను. కాని “నీవు నాకు సత్ప్రవర్తనమును ఉపదేశించ నక్కరలేదు’ ‘అని బృహస్పతి ఆమెను బలవంతముగా లాగి మైథునము నారంభించెను. అంతట గర్భము (శిశువు) బృహస్పతిని మందలించుచు “బృహస్పతీ! నేను ముందుగా ఇక్కడ ప్రవేశించితిని. నీవును అమోఘ రేతస్కుడవు. ఇక్కడ ఇద్దరకు తావులేదు” అనెను. శిశువుతో బృహస్పతి “సర్వభూతములకు (ఆనందకర) హితకరమగు ఇటువంటి సమయమున నన్ను నిషేధించితివి. కావున దీర్ఘమగు తమస్సును (గుడ్డితనమును) ప్రవేశింతువు” అనెను. అంతట అతడు తన కామమును ఆనందమును కూడ మరలించుకొనెను. ఆతని వీర్యము భూమిపై పడి వెంటనే శిశువయ్యెను. సద్యోజాతుడగు (వెంటనే పుట్టిన) ఆ శిశువును చూచి మమత బృహస్పతితో “నేను నా ఇంటికి పోవుచున్నాను. వీనిని భరించుము” అని పోయెను. బృహస్పతియు ఆ శిశువును వదలిపోయెను. ఇట్లు తల్లిదండ్రు లిద్దరును వదలిన శిశువును చూచి మరుత్తులు జాలి చెంది తీసికొనిరి. వాయువులచే భరింపబడినందున అతడు భరద్వాజుడనబడెను. (భరత్-వాయు>భరత్-వాజు>భరద్వాజ) ఆ కాలమునందే భరతుడు పుత్రులను కోరి కామ్యములును నైమిత్తికములు నగు యజ్ఞములతో దేవతల నారాధించెను. కాని అతనికి సంతతి కలుగలేదు. అంతట నతడు ‘మరుత్తోమము’ అను యజ్ఞము నాచరించి మరుత్తులను స్తుతించెను. దానికి ప్రీతులై వారు భరద్వాజుని తెచ్చి భరతునకు పుత్రునిగా ఇచ్చిరి. ఇతడు ఇట్లు వాస్తవమున అంగిరః పుత్రుడగు బృహస్పతికి కుమారుడు.

తనకు పుత్రుడుగా లభించిన భరద్వాజునితో భరతుడు “విభూ! నాకు హితకరుడవగు నీవు లభించుటచే కృతార్థుడనయితిని” అని అతనిని ప్రశంసించెను. తనకు కుమారులు కలుగుట వితథము (వ్యర్థము-అసత్యము) అయి ఉన్నప్పుడు లభించినందున భరతు డీతనికి అవితథుడు (అసత్యము కానివాడు) అని పేరుంచి అతనిని తనరాజ్యమున పట్టాభిషిక్తునిచేసి తాను వనమునకు పోయెను. ద్వ్యాముష్యాయణుడగు ఈ భరద్వాజుని వంశమున పుట్టినవారు కొందరు బ్రాహ్మణు లును మరికొందరు క్షత్రియులు–ఇట్లు రెండు విధములవారు (లేదా ఈ రెండు జాతుల ధర్మముల ననుసరించువారు) జనించిరి.

ఈ అవితథుని కుమారుడు భవమన్యుడు. అతనికి వాయ్వది మహాభూతములతో తుల్యులగు నలుగురు కుమారులు బృహత్ప్రత్రుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అనువారు కలిగిరి. నరునకు సంకృతి అతనికి గరుడు రంతిదేవుడు కుమారులు. గల్గుని కుమారుడు విద్వాంసుడగు శిబి. ఇతని కుమారులు శైబ్యులు, గార్గ్యులు అను పేరున క్షత్రియ ధర్మము పాటించు బ్రాహ్మణులయిరి. వీరిలో ఆహార్యునికి తరక్షుకుడు ఆతనికి విశాల అను భార్యయందు త్ర్యూషణుడు పుష్కరుడు కవి అనువారు కలిగి బ్రాహ్మణులయిరి. కావ్యులు అను పేర ప్రసిద్ధులలో ఈ మువ్వురును మహర్షులయిరి. గర్గులు, సంకృతులు, కావ్యులు వీరందరును క్షత్రధర్మముతో వర్తించు బ్రాహ్మణులు. వీరిలో సంవృతాంగిరుడు అను నతని కుమారుడు బృహత్క్షత్రుడు. అతని కుమారుడు హస్తి. అతని పేరుతోనే హస్తినాపురము నిర్మితమయ్యెను. ఇతనికి అజామీఢుడు ప్యుమీఢుడు పురుమీఢుడు అను ముగ్గురు కుమారులు. అతనికి వంశోద్ధారికలగు నీలిని ధూమిని కేశిని అను ముగ్గురుభార్యలు. అతడు మహాతపస్సుచేసి తన వార్ధకమున భరద్వాజుని అనుగ్రహ మున దేవవర్చసులగు ముగ్గురు కుమారులను పొందెను.

వీరివంశ విస్తరమును చెప్పెదను వినుడు, అజమీఢునకు కేశినియందు కణ్వుడు అతనికి మేధాతిథి కుమారులయిరి. వీరికి కాణ్వాయనులని వ్యవహారము. ఈ ఆజమీఢునకు ధూమినియందు బృహద్వాన్ అతనికి బృహత్ అతనికి బృహన్మనసుడు అతనికి బృహద్దనువు అతనికి బృహదిషుడు అతనికి జయద్రధుడు అతనికి అశ్వజిత్ అతనికి సేనజిత్ అతనికి రుచిరాశ్వుడు, కావ్యుడు, దృఢరథుడు అవన్తి జనపద రాజగు వక్రుడు అను నలుగురు కుమారులయిరి. రుచిరాశ్వునకు పృథుసేనుడు అతనికి పారుడు అతనికి నీపుడు అతనికి నూటొక్కమంది కుమారులు కలిగిరి. వీరిలో సమరుడు అను నతడు నీపుల వంశమును కీర్తిని వృద్ధి చేయు వాడయ్యెను. అతనికి చరుడు, భానుడు, సుదర్శుడు కలిగిరి. పారునకు పృథుడు అతనికి సువ్రతుడు అతనికి విభ్రాజుడు అతనికి శుకుని అల్లుడును కృత్వా అను నామెకు భర్తయగు అణుహుడు అతనికి బ్రహ్మదత్తుడు అతనికి యుగదత్తుడు అతనికి విష్వక్సేనుడు కలిగిరి. ఇతడు సుకృతవశమున మరల జన్మించిన విభ్రాజుడు అని కీర్తి పొందెను. విష్వక్సేనునకు ఉదక్సేనుడు అతనికి పాల్యాయనుడు అతనికి జనమేజయుడు కలిగెను. ఇతని నిమిత్తమయి ఉగ్రాయుధుడు అను నతడు నీపులనందరను నశింపజేసెను.

ఋషులు ఇట్లడిగిరి, “ఉగ్రాయుధుడు ఏ వంశమున ఎవరి కుమారుడై జన్మించెను? ఏల అతడు నీపుల నందరను నశింపజేసెను?”

సూతుడు ఇట్లు చెప్పెను, ఉగ్రాయుధుడు సూర్యవంశజుడు. అతడు ఉత్తమమగు ఆశ్రమ మున స్థాణుభూతుడై (కొయ్యవలె కదలక) వేయిఏండ్లు తపస్సు చేసెను. నీపవంశీయుడగు జనమేజయుడు ఇతనిని తనకు కుమారుడగునట్లు వేడుకొని తన నీపవంశ రాజ్యము నతని కిత్తునని వాగ్దానము చేసెను. ఇందులకు ప్రతికూలత చూపవలదని అతడు నీపులను మంచి మాటలతో బ్రతిమాలి తాను వనమునకు పోయెను. కాని నీపులు ఊరకుండక, ఈ ఉగ్రాయుధ జనమేజయులు నిద్దరను చంపవచ్చిరి-కొట్టసాగిరి. అప్పుడు ఉగ్రాయుధుడు వారితో “మీరు అకారణముగా మమ్ములను చంపుచున్నారు. ఈ జనమేజయుడు నన్ను ఆశ్రయించిన వాడు. అతనిని కాపాడదలచి చెప్పుచున్న నా మాట విని ఇతనిని జనమేజయుని-విడువుడు” అనెను. వారది వినలేదు. అంతట అతడు “మీరు నామాట వినుటలేదు. కావున మిమ్ములను శపించు చున్నాను. నేను చేసిన తపఃఫలము ఏమయిన ఉన్నచో యముడు మిమ్ములనందర నశింపజేయు గాక!” అనెను. వెంటనే వారినందరను యముడుముందునకు లాగికొనిపోసాగెను. అది చూచి జాలిపడి ఉగ్రాయుధుడు “వీరు తెలియనివారు. ఈ వీరులు నావారుగా భావించి వీరిని రక్షింప వేడుచున్నాను” అని జనమేజయునితో పలికెను. వెంటనే జనమేజయుడు యమ కింకరులతో  “పాపులగు దురాచారులారా! మీరు ఈ ఉగ్రాయుధునకు కింకరులు కండు” అని చెప్పి కింకరు లగు వ్యాధులు నారకీయులగు పాపులు మొదలగు వారితోపాటుగా యమునితో పోరాడి వారి నందరను జయించి ఉగ్రాయుధునకు అప్పగించెను. అది చాల ఆశ్చర్యకరమగు విషయము అయ్యెను. జనమేజయుని శక్తికి మెచ్చి యముడు అతనికి ముక్తిజ్ఞానమును వరముగా నిచ్చెను. తత్ఫలితముగా అందరును తగినట్లు ధ్యానమును పూని అవ్యయుడగు కృష్ణుని చేరిరి. (మోక్షమును పొందిరి.)

ఈ ఉగ్రాయుధ జనమేజయ నీపుల అఖ్యానమును గ్రహించినవారు అపమృత్యువు పాలుగారు. ఇహపరసుఖముల నందుదురు.

అజామీఢునకు నీలినియందు యవీనరుడు అతనికి ధృతిమాన్ అతనికి సత్యధృతి అతనికి దృఢనేమి అతనికి సుదర్శన్ అతనికి సార్వభౌముడు (ఇది ఇతని బిరుదనామము) అతని వంశమున మహాపౌరవుడు (ఇది ఇతని బిరుదనామము) అతనికి రుక్మరథుడు అతనికి సుపార్శ్వుడు అతనికి సుమతి అతనికి సన్నతిమాన్ అతనికి కృతుడు కలిగిరి. ఇతడు కోసల దేశీయుడు మహాత్ముడు నగు హిరణ్యనాభిన్ అను మునికి శిష్యుడై సామసంహితలను ఇరువది నాలుగు శాఖాభేదములతో ప్రవచించెను. అతని కుమారులకు ‘ప్రాచ్యసామన్’లు అని ప్రసిద్ధి. వారిలో కార్తి అను నాతడు ప్రసిద్ధుడు. అతనికి ఉగ్రాయుధుడు. ఈతనికి మహాపౌరవర్ధనుడు అని బిరుదనామము-(పూరువంశము వృద్ధి చేయువారిలో చాలగొప్పవాడు అని అర్థము.) ఈతడు తన విక్రమముతో పాంచాలాధిపతియు బలశాలియు వృషస్తుడు అను ప్రసిద్ధ రాజునకు పితామహుడునగు నీలుడు అను నతనిని ఓడించి ఈ బిరుదము నందెను. ఇతనికి క్షేమ్యుడు ఇతనికి సునీథుడు అతనికి నృపంజయుడు కలిగెను. ఇతని వంశీయులకు నృపంజయులు అనియు వీరథులు అనియు ప్రసిద్ది. ఇది పౌరవ వంశము.