ఆదిత్యవార నక్త వ్రతము

నందీశ్వరా! మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లువచించెను. విశ్వాత్మకమును సనాతనమునునగు పరబ్రహ్మ తత్త్వపు తేజము జగమున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నారాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకై ఆదిత్య వారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాత్రియందు)భుజించవలెను. ఎట్లన-ఆదిత్య వారముతో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు-శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తముచేసి విమత్సరుడై యుండి ఆదిత్యవారమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమునుకలిసిన రక్తపుష్పోదకముతో రవికి అర్ఘ్యమీయవలెను. (మంత్రార్థము) దివాకరా! నీవు కాలాత్ముడవు, సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు; అగ్నీంద్ర రూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశ యందు నమస్కారము. ‘అగ్ని మీళే’ ఇత్యాది ఋక్కుతో నీకు నమస్కారము. ‘ఇషేత్వోర్జేత్వా’ ఇత్యాది మంత్రముతోను ‘అగ్న ఆయాహి’ ఇత్యాది మంత్రముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకు నమస్సు. అనుచు రవి కర్ఘ్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆ రాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక వ్రతములను దానములను ఆచరించినవాడు అంగవైకల్యము లేనివాడు, జితేంద్రియుడు, కుటుంబి, పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్రమాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశక్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించునదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియగు పాడియావును దానమీయవలెను. (దానమంత్రము): “పాపవినాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సామ వేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము.”

ఈ విధానమున సంవత్సరకాల మాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతలు తను సేవింప సూర్య పదము నందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు అమితాయువునై ఊర్ధ్వ సప్తలోకములను చేరి సుఖించును.

స్త్రీయైనను భర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్యవార నక్తవ్రతమును ఇట్లాచరించినచో ఆమెయు దేవగణపూజితమగు ఉత్తమలోకము నందును సందియము లేదు. ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అనుమోదిం (ప్రశంసిం) చినను అట్టివాడును నూర్లకోట్ల సంవత్సరముల పాటు దేవ పూజితుడై ఇంద్ర భవనమున సుఖించును.