ఫలత్యాగ వ్రతము

నందికేశ్వరుడు నారదునకు ఇంకను ఇట్లు చెప్పను, నారదా! ఇట్టిచేయగు సర్వఫలత్యాగ (పండ్లుతినక) వ్రత మాహాత్మ్యమును వినుము. ఇది (ఇహపర) లోకములందు అక్షయమును-సర్వకామ ఫల ప్రదమును శుభమునగునది. మార్గశీర్షమాసము నందుకాని పుణ్యములగు ఇతర మాసములలో వేనియందుకాని శుక్లపక్షమున తదియ-అష్టమి-ద్వాదశి-చతుర్దశి-వీనిలో నేదైన తిథినాడు బ్రాహ్మణులచే స్వస్తివాచనము జరిపించి ఈవ్రతము నారంభించవలెను. ఆనాడు బ్రాహ్మణులకు పాయన సహితముగా భోజనము పెట్టించి ఈ వ్రతము నారంభించవలెను. అనాడు బ్రాహ్మణులకు పాయస సహితముగా భోజనము పెట్టించి దక్షిణనీయవలెను. ఔషధ (ఆరోగ్య) కారణము లేకుండగనే సంవత్సరముపాటు పదునెనిమిది విధములగు ధాన్యములు తప్ప మిగిలిన ఫలములు (కూరగాయలు కూడ) దుంపలు వేళ్ళు ఏవియు తినక వదలవలయును.

పిమ్మట (వ్రతపూర్తికై) బంగారుతో ఎద్దును రుద్రుని ధర్మరాజును చేయించవలయును. బూడిద గుమ్మడికాయ మాదీఫలము పందిరివంగ కాయ పనస మామిడిపండ్లు అమాత్రపు ఫలము (అంబాళము-దీనిరసము మామిడిపండ్లు ఆమాత్రపు ఫలము (అంబాళము-దీని రసము మామిడిపండు రసమువలె నుండును) వెలగపండు కళింగము అనెడు (విష్ణు ప్రీతికరమగు) పండు, ఖర్బూజా, దోస పండు, మారేడుపండు, రావికాయ, రేగుపండు, నిమ్మపండు, అరటి పండు, గుమ్ముడు దుంప, దానిమ్మపండు ఇవి పదునారును తన శక్తికి తగినట్లు బంగారుతో చేయించవలెను. ముల్లంగి ఉసిరిగ నేరేడు చింతకాయ కలివెపండు తక్కోల ఫలము ఏలకికాయ నిమ్మపండు, వెదురు, మొలక కొడిసెకాయ, జమ్మికాయ, మేడియాక, టెంకాయ, ద్రాక్షపండు చిన్న పందిరి వంగకాయ వాకుడుకాయ ఈ పదునారును వెండితో చేయించవలెను. తాటిపండు అవిసికాయ పొగడపండు కపిల ద్రాక్ష పండు కందదుంప చిలగడదుంప మొగలిపూవు (కాయ) చిద్భటము (ఒకకాయ) మంజిష్ట (తీగకు కాచిన)కాయ, కొండ బూరుగుకాయ గంధపు కాయ బొబ్బరకాయ ఇప్పకాయ మర్రికాయ గారకాయ పొట్లకాయ-ఇవి పదునారును రాగితో చేయించవలెను.

రెండు నీటిపాత్రలు చేయించవలెను. వీటిని ధాన్యముపై పరచిన నూతన వస్త్రముపై ఉంచవలెను. మంచము-దానిపైకి పరుపులు మొదలగునవియు దుప్పటియు రెండు రాగిపాత్రలు (పళ్లెరములు) యమ రుద్ర వృషభముల ప్రతిమలు ధేను ప్రతిమ ఇవి అన్నియు శాంతుడు కుటుంబి సపత్నీకుడు అగు బ్రాహ్మణునకు శుభ దినమున అతనిని (దంపతులను) పూజించి ఈయవలెను.

సర్వఫలముల యందును దేవతలు అందరును నివసింతురు. కావున ఈ సర్వఫలత్యాగ వ్రత మాహాత్మ్యమున నాకుశివునియందు భక్తిసిద్ధించుగాక! శివుడును ధర్మదేవుడును సదా అనంత ఫలప్రదులు. కావున వారి (ప్రతిమల)తో కూడ చేసెడి ఫలదానము వలన వారును అనంత ఫలప్రదులగుదురుగాక! శివ భక్తులయందు (వలన) సదా అనంతఫలములు నిలిచి (కలుగుచు) ఉండును. కావున నాకును జన్మజన్మమునందును అనంత ఫలసిద్ధి యగుగాక! శివునికి-విష్ణు రవి బ్రహ్మలకు-నడుమ నేను భేదమును భావన చేయను. కావున విశ్వాత్ముడగు శంకరుడు సదా నాకు శంకరుడు (శుభము కలిగించువా)డగుగాక!” అను అర్థమునిచ్చు మంత్రముతో వారిని అలంకరించి ఆ విప్ర దంపతులకు ఇవి అన్నియు దానమీయవలెను. ఉన్నచో సర్వోపస్కరములతో కూడ మంచమును ఈయవలెను. శక్తిలేనిచో ఈ చెప్పిన ఫలములను మాత్రము యథా విధానముగ ఈయవలెను. ఉదకుంభములను రెంటిని శివుని ధర్ముని ప్రతి మలను తప్పక ఈయవలెను. పిమ్మట ఆ బ్రాహ్మణుని-శక్తియున్నచో ఇంకను చాలమంది బ్రాహ్మణులను కూడ భుజింపజేసి తానును పండ్లు ఏవియు లేకుండ భుజించవలెను.

వేదతత్త్వవేత్తలును ప్రశంసించెడు ఈ సర్వఫల త్యాగ వ్రతము శివ విష్ణు భక్తులగు వారికిని యోగులకును స్త్రీలకును గూడ కర్తవ్యము. ఇహపరముల రెంటియందును అనంత ఫలముల నీయగల వ్రతము దీనిని మించినది మరియొకటిలేదు. ఈ వ్రతమున పూజింపబడు ఫల ప్రతిమల కుపయోగించిన సువర్ణ రజత తామ్రములందు ఎన్ని పరమాణువులు కలవో అన్ని వేల యుగములపాటు రుద్ర లోకమునందు ఈ వ్రత కర్త పూజితుడయి సుఖించును.

ఈవ్రతము దాని నాచరించిన నరుల సమస్త కలుషములనుహరించును. ఇహలోకమున సంజీవనమయి సర్వదా సుఖింపజేయును. జన్మాంతరముల యందును అట్టివారికి పుత్రవియోగ దుఃఖము కలుగదు; ఇంద్రాది దేవతలనుభవించెడి స్వర్గసుఖములు లభించును. దీని నాచరించుటకు శక్తిలేనివారు పుణ్యకరమగు ఈ వ్రతవిధానమును ధార్మికులెవరైన దేవాలయములందో భవనములందో చెప్పుచుండగ వినినను తామే చదివినను పాప విముక్తులై ఇహ లోకమున సుఖించి పరమున విష్ణుస్థానమును పిమ్మట ఆనందప్రదమగు శివస్థానమును పొందుదురు.