నారాయణ మార్కండేయ సంవాదము

మహాద్యుతియు, ప్రకాశుడును, హంసరూపుడు, సంసార రూప అనాది ప్రవాహమయి సదా ప్రవర్తిల్లుచుండువాడు అగు నారాయణుడు పృథివిని నీటితో కప్పివేసి ఇట్లు ఏకార్ణవీ భూతమగు లోకమునందు మహారజోగుణరాశి మధ్యమున మహార్ణవ సరస్సుల (జలముల) యందు శయనించును. అతనినే రజోగుణ రహితుడు మహాబాహుడు (అధిక శక్తిశాలి) నాశరహితుడు అగు పరమాత్ముడని తత్త్వవేత్తలందురు. ఆ ప్రభువు అపుడు అత్మ (స్వ) స్వరూపమయి స్వయంసిద్దమగు ప్రకాశముతోను తమోగుణాత్మకమగు ఆవరణముతో కూడ కప్పబడియుండును. సత్త్వగుణమయమగు మనస్సును సాధనముగా గ్రహించిన (నవారు మాత్రమే) ఆ సత్య తత్త్వము నుపాసించగలరు. బ్రహ్మ తత్త్వమునకు సంబంధించిన యథాతథ పరమజ్ఞానము అరణ్యక రహస్యము అనబడు ఉపనిషత్ నందు (ఉపనిషత్ అనగా రహస్యమని యర్థము) ప్రతిపాదింపబడినది; ఆ తత్త్వమునకే పురుషుడనియు బ్రహ్మమనియు పేరులు; అతని కంటె ఇతరులగు పురుషులు లేరు కావున అతడే పురుషోత్తముడు, యజ్ఞము నిర్వహించు ఋత్విజులును విప్రులును యజ్ఞములును ఇతరములగు దేవతారాధనలు అను ఇజ్యలును ఆ పురుషోత్తముని నుండియే జనించెను.

అతడు తననుండి పదునారు మంది ఋత్విజులను జనింపజేసిన క్రమము: ముఖము నుండి బ్రహ్మను సామవేదజ్ఞుడగు ఉద్గాతను - బాహువుల నుండి హోతను అధ్వర్యుని బ్రహ్మ (హృదయము నుండి) బ్రాహ్మణాచ్ఛంసిని  -  ప్రస్తోతను వీపునుండి మైత్రావరుణుని ప్రతి ప్రస్థాతను -  ఉదరము నుండి పోతను ప్రతిహర్తను - తొడలనుండి అచ్ఛావాకుని నేష్టను - ముంజేతుల నుండి అగ్నీధ్రుని - మోకాళ్ళ నుండి సుబ్రహ్మణ్యుని - పాదముల నుండి గ్రావస్తుత్ ను - ఉన్నేతను  - ఇట్లు సర్వయజ్ఞ ప్రవర్తకులగు ఋత్విజులను సృజించెను. ఈ హేతువుననే ఈ పరమ పురుషునకు వేద మయుడనియు యజ్ఞ పురుషుడనియు నామము. వేదములును వేదాంగములును ఉపనిషత్తులును యాగాది క్రియలును ఈ భగవన్మయములే.

పూర్వ మొక ప్రళయ సమయమున ఏకార్ణవ జలమున ఈ పురుషోత్తముడు నిద్రించుచుండ జరిగిన ఆశ్చర్య కుతూహలకర విషయమును తెలిపెదను వినుడు. బహు సహస్రవత్సర ఆయువుగల మార్కండేయ మహాముని ఆ భగవానునిచే ప్రళయ సమయమున మ్రింగబడి ఆతని కుక్షియందు ఆ దేవుని తేజస్సులోనే వ్యాప్తుడై ఉండెను. అచటనే తీర్థయాత్రా ప్రసంగమున పృథివియందు సంచరించుచు పుణ్యములగు తీర్థములందు ఆశ్రమములందు దేవాలయములందు దేశములందు రాష్ట్రములందు విచిత్రములగు వివిధ పురములందు సంచరించుచు జపహోమ పరుడును శాంతుడునునై ఘోర తపస్సాచరించెను. అతడు మెల్లగా అతని నోటినుండి వెలికి వచ్చుచు ఇది ఈభగవానుని మాయవలననే జరుగుచున్నదని గుర్తించెను. వెలికి వచ్చిన తరువాత అతడు జగమంతయు ఏకార్ణవమయి అంధకారావృతమయి యుండుట చూచెను. అతనికి తీవ్ర భయమును తన జీవితము విషయమున (బ్రదుకుదునా లేదాయను) సంశయమును కలిగెను. అతడు భగవద్దర్శనముచే సంతుష్టుడయ్యెను; మిగుల ఆశ్చర్యమును కూడ పొందెను. అతడట్లు జలమధ్య మందుండియే భయముతో నా చిత్తమునం దిదియేమయిన మోహము కలిగెనా స్వప్నము ననుభవించుచున్నానా? అనుకొనెను. ఒకవేళ ఆ జగత్పదార్థములు ఒక విధముగా ఉండగా మరియొక విధముగా నశించకయున్నను నశించినవని నేనే పొరపడుచున్నానేమో! ఎలయన జగత్తునకు ఇంతటి నేశము సంభవించుట యుక్తము కాదు గదా! చంద్ర రవి వాయువులును పర్వతములును భూతములను నశించిన తరువాత ఈలోకము ఏలోకమని భావించవచ్చును. అనిచింత నందుచుండగనే అతనికి పర్వత మంత పురుషుడు నిద్రించుచు కనబడెను. అతడు మేఘమువలె సముద్రమునందు మునిగిన సగము శరీరముతో నుండెను. తన తేజస్సులతో వేడిమి నిచ్చుచు కిరణయుక్తుడగు భాస్కరుడువలె అతడుండెను. స్వతేజస్సులతో వెలుగుచు రాత్రియందు కూడ మేల్కాంచినవాడువలె నుండెను. జగమంతయు చీకటితో నిండి రాత్రివలె నుండెను. ఆ మహాపురుషుడు మాత్రము మేల్కాంచి యుండెను. “నేను భగవానుని దర్శించుటకు వచ్చితిని; మరి నీ వెవ్వడవు?” అని మార్కండేయు డా పురుషునితో అనుచుండగనే మరల మార్కండేయుడు భగవానుని కుక్షియందు ప్రవేశింప జేయబడెను. మార్కండేయుడట్లు మెల్లగ కుక్షి యందు ప్రవేశించి మిగుల విస్మయపడుచు ఇది యంతయు స్వప్న దర్శనమని భావించుచు మరల ఎప్పటివలె భూ సంచారము చేయుచు ఆ దేవుని కుక్షి యందు పుణ్యతీర్థ జలములను వివిధాశ్రమములను సమగ్రములును శ్రేష్ఠములునునగు దక్షిణలతో యజనము చేయుచున్న యజమానులను వారిచే యజింపజేయబడుచున్న యాజకులను వందల కొలది మంది బ్రాహ్మణులను చూచెను. వారేకాక బ్రాహ్మణాది వర్ణముల వారు సద్వర్తనులయి నేను (మత్స్యుడు) నీకు తెలిపిన ఆయా వర్ణాశ్రమ ధర్మములను లెస్సగ ఆచరించుచు అతనికి కనబడిరి. ఇట్లు ఆ ధీమంతుడగు మార్కండేయుడు సంపూర్ణముగ నూరేండ్లు పృథివీ సంచారము చేసినను భగవానుని కుక్షికి కొన మాత్రము దొరుకలేదు; కాని అట్లు సంచరించుచునే ఒకానొకప్పుడతడు ఆ కుక్షినుండి వెలికి వచ్చెను. అతనికీమారు మర్రికొమ్మపై నిద్రించుచున్న బాలు డొకడు కనబడెను. అతడట్లే ఏకార్ణవ జలమున మంచుతో కప్పబడిన అంతరిక్షము నడుమ ఏ ప్రాణియునులేని లోకమున అవ్యక్తరూపుడై ఆనందించుచుండెను. ఆ ముని విస్మయావిష్ణుడును కుతూహలవంతుడును నయ్యెను. కాని సూర్య సమానుడగు ఆ బాలుని మాత్రము సమగ్రముగా పరిశీలించి చూడజాలకపోయెను. అతడపుడు ఏకాంతమందు జల - సన్నిధియందు (స్థానమందు) నిలిచియుండి ఎంతయో ఆలోచించెను. ఇది ఏమని ఆలోచించుచునే ఇది నేను ఇదివరకు చూచినదేయని అతడనుకొనెను. ఆ దేవుని మాయతో భయపడెను. మిగుల ఆశ్చర్యముతో అతడు ఆ అగాధ సలిలమందు తేలుచు ఈదులాడుచు మిగుల శ్రమ చెందుచు భయగ్రస్త లోచనుడయ్యెను భగవానుడగు ఆయోగి బాలుడు అతనికి స్వాగతము పలికెను. ఆ పురుషోత్తముడు మేఘసమాన ధ్వనితో “నాయనా! మార్కండేయా! భయపడకుము. నాదగ్గరకు రమ్ము” అనెను. “నా తపమునకు పరాభవము కలిగించుచు దివ్యవర్ష సహస్రముల పరిమాణము గల నా వయస్సును అలక్ష్యము చేయుచు నన్ను పేరుతో పిలుచుచున్న ఈతడెవ్వడు? ఈ నీ తక్కువపరచు నడువడి దేవతలయందు కూడ నేను అలవాటుగా చూచియుండలేదు. దేవేశుడగు బ్రహ్మకూడ నన్ను “దీర్ఘాయూ!” అని పలుకరించును. ఇట్టి నన్ను తాను ఘోరాంధకార మందుండియు జీవిత త్యాగమునకును సిద్ధపడి మార్కండేయా! అని నన్ను పిలిచి మృత్యువును దర్శింప గోరుచున్న ఈతడెవ్వడు?” అని మార్కండేయ మహాముని పలికినంత భగవానుడును మధుసూదనుడు అగు బాలుడు మరల అట్లే మేఘ గంభీరధ్వనితో ఇట్లు పలికెను.

నాయనా! నేను నీ తండ్రిని; హృషీకేశుడను; (హృషీకములకు - విషయేంద్రియములకు -  ఈశుడను) మహాగురుడను (గురువులకును గురుడను.) నీకు సులోకమందలి ప్రాణులకును ఆయువును ఇచ్చువాడును, పురాణ తత్త్వమను నేనే; నీవు నాకడకు రాకున్నావేల? మొదట పూర్వకాలమున నీ తండ్రియగు ఆంగిరస (అంగిరో వంశజుడగు) మృకండుముని పుత్రుల కోరి తీవ్ర తప మాశ్రయించి తత్సాధనమున నన్ను మెప్పించెను; అమిత శక్తివంతుడవగు నీవు కుమారుడుగా కావలెనని వరము అడిగెను. ఆత్మనిష్ఠుడు అమితౌజః శాలియగు ఆతని కోరికకు నేను సరే యంటిని. సర్వ భూతాత్ముడగు అట్టి మహర్షి కుమారుడు కాక మరెవ్వరు ఏకార్ణవగతుడయి యోగమాయతో క్రీడించు నన్ను చూడగలడు ? అనగా దీర్ఘాయుష్కుడు లోకపూజితుడు మహా తపస్కుడగు మార్కండేయుడు హర్ష పూర్ణ హృదయముతో ఆశ్చర్యమున విప్పారిన కన్నులతో తలపై నిలిపిన దోసిలితో తన పేరును గోత్రమును పేర్కొని నారాయణునికి నమస్కరించెను. పూజ్య భగవన్! నీవు బాలరూపుడవై ఏకార్ణవమందున్న హేతువును నీ మాయకు గల వాస్తవ రూపమును తెలియ గోరుచున్నాను. ప్రభూ! భగవన్! నీవు ఏ నామముతో లోకమున వ్యవహరింప బడుదువు? నీవు పరమాత్ముడు అని ఊహించుచున్నాను. కానిచో మరి ఎవ్వరు ఈ ఏకార్ణవ జలమున ఉండగలరు? అనెను.

బ్రాహ్మణశ్రేష్ఠా! నారాయణుడు, సర్వకారణుడు, సర్వపోషకుడు  -  సర్వ స్థితికర్త, సర్వనాశకుడు, సహస్ర శీర్షాది పదములతో వ్యవహరింపబడువాడు, ఆదిత్యవర్ణుడగు పురుషుడు, యజ్ఞమందు ఆరాధింపబడు బ్రహ్మ(వేద) మయ పురుషుడు, యజ్ఞము హవిస్సును వహించు అగ్ని, జలచరప్రాణుల కధిపతియగు సముద్రాధి దేవత (వరుణుడు), అవ్యయ (ఏ మార్పును లేని) తత్త్వము, ఇంద్రుని నామములలో శక్రపదముచే వ్యవహరింపబడుతత్వము, వర్షములలో పరివత్సరము (అనెడు వర్షము), యోగి, యుగాది యుగాంతము, వర్షము, సర్వరత్నములు, సర్వ దేవతలు, సర్పములలో శేషుడు, సర్వపక్షులలో గరుత్మంతుడు, సర్వ భూతములందు కాలసమానుడగు యముడు, ఆయా ఆశ్రమ ధర్మములందుండువారి ధర్మ తపస్సులు దేవనదియగు గంగ, క్షీర సాగరము, పరమ సత్యము, ప్రథమ ప్రజాపతి, సాంఖ్యము, యోగము, పరమపదము, దేవతారాధన (ఇజ్యా) క్రియా విద్యాధిపతి, అగ్ని వాయు పృథివ్యాకాశ జలములను పంచ భూతములు, సముద్రములు, నక్షత్రములు, దశ దిశలు నేనే.

వర్షము సోముడు (ఓషధులకు పుష్టి నిచ్చు దేవత) పర్జన్యుడు (మేఘాధిష్ఠానదేవత) రవి, క్షీరసాగరము, సముద్రమందలి బడబాగ్ని సంవర్తకాగ్ని అయి ప్రళయమున జలము హవిస్సును త్రావు అగ్ని - పురాణ (అతి ప్రాచీన) తత్త్వము పరాయణము, భూత భవిష్యత్ వర్తమానములకు ఆదికారణము - విప్రా ! నీవు చూచునది వినునది అనుభవించునది అంతయు నేనే అని తెలియుము. పూర్వము సృజించునది ఇపుడు సృజింపబడనున్నది అంతయు నేనే. యుగ యుగమునందును నేనే అఖిల జగమును సృజింతును. నీవును నా కుక్షియందు సుఖముగా సంచరించుచు నేను వ్యవస్థ చేసిన ధర్మములను ఎరుగుచు ఉండుము. బ్రహ్మయు దేవతలతో ఋషులతోకూడి నాశరీరమందే యున్నాడు. వ్యక్తము అవ్యక్తము అగు తత్త్వములును అసుర నాశకుడును ఏకాక్షర మంత్రమగు ఆకారము త్ర్యక్షరమగు తారక (సంసారము నుండి తరింపజేయు ప్రణవ) మంత్రము నేనే; ధర్మార్థ కామము లనెడు మూడు పురుషార్థములను (వేదరూపమున) నిరూపించుచు ఈ త్రివర్గముకంటె ఆవల నున్న తత్త్వమును నిరూపించు ఓంకారమును నేనే; అని ఈ మొదలగునవి చెప్పుచునే మహామతిశాలియు పురాణుడును అగు ఈశ్వరుడు నారాయణుడు మార్కండేయ మహామునిని తన నోటిలోనికి తెచ్చుకొనెను. అంతట ఆ మునిసత్తముడును భగవానుని కుక్షియందు ప్రవేశించి ఏకాంతమున అవ్యయుడు హంసరూపుడును అగు భగవానుని సేవించుచుండెను. వివిధ తనువుల ధరించి లోకముల ప్రవర్తింపజేసి చంద్ర సూర్యులును లేని మహైకార్ణవమున ఈ వివిధ రూపములతో మెల్లగా సంచరించుచు మరల కాలము వచ్చినపుడు తత్పరిణామానుసారము జగములను సృజించుచు విహరించు హంసరూప భగవానుని స్వరూపము ఇది.