మత్స్య మహా పురాణము
దేవాలయ, ప్రాసాద విధి కీర్తనము
(“దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః.” అనగా ప్రాణుల దేహమే దేవాలయము అనియు-ఆ దేహమునందలి జీవచైతన్యమే సనాతను (శాశ్వతు)డగు భగవానుడు (పరమాత్ముడు) అనియు ఈ పారంపరిక వచనమునకు ప్రసిద్ధముగా చెప్పుకొను అర్థము. మరియొక విధముగా - దేవాలయము భగవానుని దేహము, ఆలయమునందు ప్రతిష్ఠిత మయియున్న భగవన్మూర్తియే ఆ దేహమునందలి జీవ చైతన్యము అనగా సనాతనుడగు (శాశ్వతుడగు) భగవానుని ప్రతినిధిగా ఆ ఆలయమునందు ఉంచిన దేవతామూర్తి-సాక్షాత్ ఆ పరమాత్మ చైతన్యమే, అనగా సాక్షాత్ భగవానుడే. ఈ యర్థమును అనుసరించి మన ప్రాచీనులు దేవాలయమును నిలువబడియో, కూర్చుండియోయున్న మానవుని దేహమువలె కనబడునట్లు నిర్మించిరి. అందును నాగర సంప్రదాయపు శివాలయమును వారు నిలువబడియున్న మానవాకృతితో పరిపోల్చి భావనచేసి అది చాల ఎత్తుగా ఉండునట్లు నిర్మింపజూచిరి. శ్రీమత్స్య మహాపురాణములో ‘లింగమానతః’ చెప్పిన దేవాలయపు ఎత్తు ‘గర్భమానతః’ చెప్పిన ఆలయపు ఎత్తుకంటే చాల ఎక్కువగా నున్నది.)
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పసాగెను, గడచిన అధ్యాయమున చెప్పిన విధమున ప్రాసాద (దేవాలయ)మునకై నిర్దేశించుకొనిన ప్రదేశమున వాస్తు బలిని జరిపిన తరువాత ఈ చెప్పబోవు విధమున కొలతలతో ప్రాసాద నిర్మాణము జరుపవలయును.
ప్రథమ ప్రకారము: ప్రాసాద (దేవాలయ) నిర్మాణమునకై నిర్దేశించి యుంచుకొనిన మొత్తము ప్రదేశపు వైశాల్యమును పదునారు సమభాగములుగా విభజించవలయును. అట్టి పదునారు భాగములయందలి నాలుగు భాగముల వైశాల్యము కలదియు. ఈ మొత్తము ప్రదేశమునకు నట్టనడుమ నున్నదియు నగు సమచతురస్ర ప్రదేశమున గర్భాలయమును నిర్మించవలయును. ఈ గర్భాలయమునకు నలువైపుల మిగిలియున్న ప్రదేశపు వైశాల్యము మిగిలిన పండ్రెండు భాగములు సరిగా అగునట్లు చూచుకొనవలయును.
ఈ కొలతలకై గ్రహించిన ప్రమాణములు (హస్తములు-మొదలగునవి) నాలుగు ఆలయ భిత్తుల ఎత్తు ఉండవలయును. భిత్తుల ఎత్తునకై గ్రహించిన ప్రమాణములు ఏవి ఎన్నియో అవి అంతకు రెట్టింపు శిఖరపు ఎత్తు ఉండవలయును. శిఖరపు ఎత్తునకు సగములో సగము (నాలుగవ వంతు) ప్రమాణముల కొలతతో గర్భాలయమునకు అన్ని వైపులను ‘ప్రదక్షిణా పథము’ (నేమి) ఉండవలయును. ఆలయమునకు నాలుగు వైపులను (ఈ ప్రదక్షిణ నుండియు ఆలయమునుండియు దిగిపోవుటకు అనువుగా) ‘నిర్గమము’ (గడపల వరుస) ఉండవలయును.
గర్భాలయపు కుడి ఎడమలందలి సూత్రములను రెండిటిని ముందునకు పెంచి గర్భాలయపు వెడల్పు పొడవు పరిమాణముతోను ఇట్టి మూడు భాగములంత వెడల్పుతోను ఉండునట్లు ఆయతా (దీర్ఘచతురస్రా) కృతితో గర్భాలయమునకు ముందు మండపము ఉండవలయును.
గర్భాలయము తన కుడి ఎడమలందును వెనుక వైపునను ‘భద్రము’ (భిత్తు-గోడ-లనుండి పెంచి నిర్మించిన అందమగు నిర్మాణములకు ‘భద్రము’ అనియు ‘కపోలము’ అనియు వ్యవహారము)లతో కూడి మిగుల అందముగా చూడముచ్చట గొలుపుచుండ వలయును.
గర్భాలయపు కొలతలకై తీసికొనిన మొత్తము పరిమాణమును విచక్షణుడగు వాస్తు శాస్త్రజ్ఞుడు ఐదు భాగములుగా చేసి అందలి ఒక భాగముతో ‘ప్రగ్రీవము’ (ప్రార్థీవము అనుట సరికాదు)ను నిర్మించవలయును. (గర్బాలయపు ప్రధాన భిత్తులకు పైగా నాలుగు వైపులకు పంచవలెను. ముందునకు ప్రసారితమైయుండు పెంపుదల నిర్మాణ భాగమును ‘ప్రగ్రీవము’ అని అందురు.)
గర్భాలయపు ఉభయ పార్శ్వము (కుడి ఎడమ) లందలి సూత్రములను ఇంకను ముందునకు పెంచి ఈ మండపమును నిర్మించవలయును. ఇది సర్వసామాన్యమగు ప్రాసాద (దేవాలయ) లక్షణము.
అదేవిధముగ లింగ (అర్చామూర్తి) ప్రమాణమును ముందుగా నిర్ణయించుకొని తరువాత దాని పరిమాణముననుసరించి నిర్మించదగు ‘ప్రాసాద’ లక్షణమును తెలిపెదను.
రెండవ విధమగు ప్రాసాదము: విద్వాంసులగు వాస్తుశాస్త్రజ్ఞులు ‘లింగము’నుగాని పూజా మూర్తిని (ఆర్చించుటకు ప్రతిష్ఠించు దేవతామూర్తిని)గాని దృష్టిలో ఉంచుకొని దాని పరిమాణపు ప్రమాణములననుసరించి ‘పీఠికా’ నిర్మాణము చేయవలయును. పీఠికకు గల ఎత్తు అర్ధభాగమును ఒక్కొక్క ప్రమాణ భాగముగా గ్రహించి అట్టి ఒక్క భాగపు ప్రమాణము ఎత్తు ఉండునట్లు గర్భాలయపు బాహ్యభిత్తులు (ప్రధాన బిత్తినుండి వెలువలకు పెంచి నిర్మించు భిత్తు) నిర్మించవలయును. ఈ బాహ్యభిత్తికై గ్రహించిన ఒక భాగము ‘ప్రమాణము’గా గ్రహించి అట్టి భాగముల (కొన్నింటితో-బహుశః నాలుగు ప్రమాణములతో) (అంతర్) భిత్తులను నిర్మించవలయును. ఈ (అంతర్) భిత్తుల మొత్తము ఎత్తునకు రెట్టింపు ఎత్తుతో శిఖరమును నిర్మించవలయును.
శిఖరపు ఎత్తులో చతుర్భాగ ప్రమాణములతో ‘ప్రదక్షిణా’ ఉండవలయును. ‘ప్రదక్షిణా’ ఎంత వెడలువున ఉండునో అంతే పరిమాణము వెడల్పు అగునట్లు గర్భాలయపు రెండు పార్శ్వముల సూత్రములను ముందునకుపెంచి మండపము ఉండవలయును. మండపపు వెడల్పులో సగము వెడల్పుతో దాని ముందుగా ముఖమండపము ఉండవలయును.
‘ప్రాసాద’ (గర్భాలయ)ము నుండి (ముందు తప్ప మిగిలిన మూడు వైపులకును) వెలుపలకు సాగి వ్యాపించి యుండునట్లు గర్భాలయ ప్రమాణపు నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక వైపునకు రెండేసి చొప్పున కపోలములు భద్ర-ప్రతిభద్రములు ఒకటి పెద్దదిగా- రెండవది దానికంటే కొంత చిన్నదిగా నిర్మించవలయును.
శిఖర భాగములు: (ఇవి నాలుగు విధములగు ప్రాసాద-దేవాలయములకును ఇంచుమించుగా సమానముగానే అన్వయించును.) గర్భాలయమునకు పై భాగమున (అంతర్) భిత్తుల ఉఛ్చ్రయము (ఎత్తు)నకు అనుగుణముగా (అంతే ఎత్తుతో) ‘మంజరీ’ అను శిఖర భాగమును నిర్మించవలయును. గర్భాలయ పరిమాణమును నాలుగు భాగములు చేసి అట్టి ప్రమాణములు ఎనిమిది ఉండునట్లు “శిఖర మంజరీ” మొత్తముఎత్తు ఉండును) శిఖర ‘మంజరీ’ మొత్తము ఎత్తులో సగము ఎత్తుతో ‘శుకనాసా’ అను శిఖర భాగమును -దానికి పైగా- ‘శుకనాసా’ ఎత్తులో సగము ఎత్తుతో ‘వేదీ బంధము’ను మిగిలిన (నాలుగవవంతు) ప్రమాణముతో ‘కంఠము’ ‘అమలసారము’ అను శిఖర భాగమును నిర్మించవలయును. ‘వేదీబంధ’మునకు నలువైపులను ఉండు గ్రుడ్లవంటి గుండ్రని నిర్మాణ చతుష్టయమునకును అండకములు-అని వ్యవహారము.
ఈ విధముగా ఆయా ప్రాసాద (దేవాలయ)పు అంశములను చెప్పిన ఆయా కొలతలతో విభజించి అందముగా ఉండునట్లు నేర్పరియగు వాస్తు శాస్త్రజ్ఞుడు నిర్మించవలెను. ఇదేవిధముగా ఇచ్చట ఈ ప్రసంగమునందే మరియొక విధమగు ‘ప్రాసాదపు’ లక్షణమును కూడ చెప్పెదను.
మూడవ విధమగు ‘ప్రాసాదము’: ద్విజులారా! ముందుగా గర్భాలయపు ప్రమాణమును నిర్ణయించుకొని దాని ననుసరించి ఆలయపు ఇతరాంశముల కొలతలను గ్రహించు విధము తెలిపెదను వినుడు. గర్భాలయమును (3x3 = 9) అగునట్లు తొమ్మిది భాగములుగా (పదములు– గదులుగా) విభజించవలయును. అందు నట్టనడుమనున్న ఒక పదము (అంకణము-గది)నందు లింగమునకుగాని అర్చామూర్తికిగాని నిర్దేశించిన పీఠిక (దానియందు లింగముకాని అర్చా మూర్తి కాని) ఉండవలయును.
దీనికిపోగా దీనికి చుట్టును మిగిలిన ఎనిమిది ‘పదముల’లో (అంతర్) భిత్తులు ఉండవలయును. ఇట్టి ఐదు పదముల ప్రమాణముల ఎత్తుతో ఈ ‘అంతర్’ భిత్తులు ఉండవలయును. దీనికి రెట్టింపు (పది పదముల ప్రమాణముల) ఎత్తు శిఖరమునకు ఉండవలయును.
శిఖరపు ఎత్తును నాలుగు భాగములు చేసి అందలి రెండు భాగముల ఎత్తులో ఒక భాగపు ఎత్తుతో ‘వేదీ బంధము’ను మిగిలిన నాలుగవ భాగములో ‘కంఠము’ ‘అమలసారము’ అను అంశములను నిర్మించవలయును. రెండు పదముల యంత (లేదా శిఖరమంజరీ పరిమాణములో రెండు నాలుగవ వంతులంత వెడల్పుతో గర్భాలయమునకు మూడు వైపులను ఒక్కొక్క వైపున రెండేసి చొప్పున ఒకటి పెద్దది. ఇంకొకటి చిన్నదిగా) కపోలములు (భద్ర ప్రతిభద్రములు) నిర్మించవలెను. ఆలయమునకు అందము ఇచ్చునట్లు ‘పత్రవల్లులు’ (ఆకులు పూలు-కల తీగలు) అండకములు దీనికి అలంకారముగా నుండవలయును;
ఈవిధముగా మాూడవ విధమగు ప్రాసాదమును నాచే (మత్స్య నారాయణునిచే) నీకు (మనువునకు) తెలుపబడినది.
ద్విజులారా! అదేవిధముగా సామాన్య రూపమగు మరియొక ప్రాసాద భేదపు లక్షణమును చెప్పెదను వినుడు.
దేవతలు ఎచ్చట నుందురో అనగా దేవతా మూర్తులు ఎచట నుండునో ఆ క్షేత్ర ప్రదేశమును అనగా గర్భాలయమును మూడు భాగములుగ విభజించవలయును. అందలి ఒక భాగపు పరిమాణమును ప్రమాణముగా తీసికొని అంత కొలతలతో గర్భాలయమునకు మూడు వైపులను దాని బాహ్యాంతర్భిత్తులనుండి వెలుపలి వైపునకు వచ్చునట్లు ‘రథాంకము’ అను (రథమును వాలిచినట్లు కనబడు) లక్షణ విశేషములను నిర్మించవలయును. అదే తృతీయ భాగపు కొలతతో ఉండునట్లు ప్రాసాదమునకు అన్ని వైపులను నేమి (ప్రదక్షిణా) నిర్మించవలెను.
గర్భాలయపు పరిమాణపు ప్రమాణములను రెట్టింపు చేసిన కొలతలతో భిత్తుల ఎత్తు ఉండవలయును. భిత్తుల ఎత్తునకు ద్విగుణము శిఖరపు ఎత్తు ఉండవలయును.
గర్భాలయ పరిమాణములో ఐదవవంతు కొలతతో ‘ప్రగ్రీవ’మును ‘నిష్కాన’ (నిర్గమ)మును నిర్మించవలయును. గర్భాలయపు పరిమాణపు ప్రమాణములను రెట్టింపు చేసిన కొలతలతో భిత్తుల ఎత్తు ఉండవలయును. భిత్తుల ఎత్తునకు ద్విగుణము శిఖరపు ఎత్తు ఉండవలయును.
గర్భాలయ పరిమాణములో ఐదవవంతు కొలతతో ‘ప్రగ్రీవ’మును ‘నిష్కాన’ (నిర్గమ)మును నిర్మించవలయును. ప్రాకారపు (భిత్తికిగల) ఎత్తులో మూడవవంతు ఎత్తుతో సుషిరము (ద్వారము) ఉండవలయును.
అదే ప్రాకారపు (భిత్తుల) ఎత్తులో ఐదవవంతు పరిమాణ ప్రమాణముతోనైనను ‘ప్రగ్రీవ’మును ‘నిష్కాన’ (నిర్గమ)మును నిర్మించవచ్చును. ఇది విశేష ప్రకారము.
గర్భాలయపు చతురస్రాకృతిలో ఏర్పడు కర్ష పరిమాణములో ఐదవ వంతు పరిమాణపు కొలతతోనైనను ప్రగ్రీవమును నిర్మించవచ్చును.
గర్భాలయపు అంతమున ద్వారమూల ప్రదేశమున కలశ (రూపమగు శిల్పనిర్మాణ)మును నిలుపవలయును.
ఈ విధముగా ఆలయ నిర్మాణమును జ్యేష్ఠ - మధ్యమ -కనిష్ఠ పరిమాణములలోను లింగపు పరిమాణమునో అర్చామూర్తి పరిమాణమునో ఆధారముగా అవలంబించియు రూప భేదకల్పనను అవలంబముగా చేసికొనియు జరుపవలయును.
ఇట్లు సంక్షేపముగా ప్రాసాద సామాన్యముల లక్షణములు చెప్పబడినవి. ఇక -ద్విజులారా! - ప్రాసాద విభాగ- విశేషములను-వాని లక్షణములను చెప్పెదను వినుడు.
1. మేరువు, 2. మందరము, 3. కైలాసము, 4. కుంభము, 5. సింహము, 6. గజము, 7. విమానచ్ఛందకము, 8. చతురస్రము (రుచకము - శ్రీవత్సకము -శ్రీవృక్షకము), 9. అష్టాస్రము (వజ్రము), 10. షోడశాస్రము (ద్వివజ్రము), 11. వర్తులము (మండలము), 12. సర్వ భద్రకము (సర్వతోభద్రము), 13. సింహాన్యము, 14. నందనము, 15. నంది వర్ధనకము, 16. హంసము, 17. వృషము, 18. సువర్ణము, 19. పద్మకము, 20. సముద్గకము అని ఇట్లు ప్రాసాద విశేషములు నామగ్రహణముతో చెప్పబడినవి; వీని విభాగ లక్షణములను చెప్పెదను వినుడు.
మేరు ప్రాసాదము: ఇది నూరు నానావిచిత్రి శిఖరములు నాలుగు ద్వారములు పదునారు. భూమికల (అంతస్తుల) ఎత్తుకలది. మందర ప్రాసాదము: ఇది ద్వాదశ భూమికలు కలది. కైలాస ప్రాసాదము: ఇది నవభూమికలు కలది. విమానచ్ఛందకము: ఇది ఎనిమిది భూమికలుకలది. నందివర్ధనము: ఇది సప్త భూమికలుకలది. నందనము: ఇది ఒకే శిఖరము కలది; బహుశః దీనికి షడ్ భూమికలు; సర్వతోభద్రము, ఇది షోడశాస్రపు ఆకృతియు నానారూప విశేషములును అనేక శిఖరములును కలది. మవలభీచ్ఛందకము: ఇది చిత్రశాలలును-మూడు శుకనానలును ఐదు భూమికలును కలది;
మండలము (వర్తులము): ఇది ఎత్తు విషయమున వృషప్రాసాదముతో సమానము, అశ్రులు (కోణములు) లేనిది; (అశ్రి=కోణము); సింహ(ప్రాసాద)ము: ఇది సింహముతో సమానమయిన (అకృతి కల)ది; గజప్రాసాదము: ఇది గజముతో సమానమైన (ఆకృతి కల)ది; కుంభప్రాసాదము: ఇది కుంభాకృతికలది, తొమ్మిది భూమికల ఎత్తు అంగుళీపుట (యక) ము వంటి అమరికయు పంచాండకములును కలది; సముద్గకము: ఇది షోడశాస్త్రములు (16 కోణములును భుజములును) కలది; రెండు పార్శ్వములందును రెండు చంద్రశాలలును రెండు భూమికల ఎత్తును కలది; పద్మకము: ఇది పై దానివలెనే యుండి మూడు భూమికల ఎత్తు కలది; మృగరాజ (సింహ) ప్రాసాదము: ఇది షోడశాస్రములును విచిత్ర శిఖరములును కలది; శుభ(మనోహర)మైనది; చంద్రశాలలు కలది; గజప్రాసాదము: ఇది విశాలము అగు ప్రగ్రీవము ఆరు భూమికల ఎత్తు అనేక చంద్రశాలలు కలది; గరుడ (ప్రాసాద)ము: ఇది ఏడు భూమికల ఎత్తు మూడు చంద్రశాలలు తనకు రెండు వైపులను మృగరాజ ప్రాసాద(రూప)ములు కలది, ఇంకొకవిధమగు గరుడ ప్రాసాదము: ఇది ఆరు భూమికల ఎత్తు కలది; ఇది వెలుపలి వైపున అన్ని వైపులను కలిసి అశీతి (ఎనుబది) హస్తములు (చుట్టుకొలత) కలది, మరియొక గరుడ ప్రాసాదము: ఇదిపది భూమికల ఎత్తుకలది; పద్మకము: ఇది షోడశాస్రమయి పండ్రెండు భూమికల ఎత్తు కలది; శ్రీవృక్షకము (చతురస్రము): ఇది ప్రమాణమునందు (కొలతలో) పద్మకముతో సమానమయి చతురస్రాకృతి కలది; వృషప్రాసాదము: ఇది పంచాండకములు రెండు భూమికల ఎత్తు నాలుగు హస్తముల భుజముగల గర్భాలయము కలది; ఇది సార్వకామికము (అన్ని కోరికలను-ఆవశ్యకతలను -తీర్చునది); సింహాస్యము: నాచేత చెప్పబడినవానిలో సప్త భూమికల -పంచభూమికల-ఎత్తు కలవి-అట్టివానికి చెప్పిన ఆయా ప్రమాణములు కలవి- చంద్రశాలలు ప్రగ్రీవములు కలవి-ఏవి కలవో అవి అన్నియు ‘సింహాస్యములు’ అనబడును. (భూమిక=అతస్తు)
ఇవి అన్నియు ఇటుకలతోనో శిలలతోనో దారువుతోనో నిర్మింపబడి ద్వార తోరణముల (పెద్ద ద్వారముల)తో కూడి యుండును.
ఆయా ప్రాసాదములకు కల ప్రదేశమునకు తీసికొనవలసిన భుజముల (విష్కంభముల) ప్రమాణములు: మేరువు-50; మందరము-45; కైలాసము-40; విమానచ్ఛందకము-34; నందివర్ధనకము-32; నందనము-సర్వతోభద్రము-30; వర్తులము (మండలము) పద్మకము- 20. సింహము, గజము, కుంభము, వలభీచ్ఛందకము-16; ఇవి దేవతలకు ప్రీతికరమయినవి; విహితా(మహా)త్ములగు ఈ దేవతలకు ప్రీతికరములగు కైలాసము, సింహము, విమానచ్ఛందకము-12; గరుడము-8; హంసము-10; ఇట్టి హస్త ప్రమాణక విష్కంభములతో శుభలక్షణములతో ప్రాసాదములను నిర్మించవలయును. యక్ష, రాక్షస, నాగులకుగాను నిర్మించు ప్రాసాదములు మాతృ(సప్త) హస్తముల ప్రమాణములతో నుండునవి ప్రశస్తములు.
ఈ చెప్పినవానిలో మేరువు మొదలగు ఏడు ప్రాసాదములును జ్యేష్ఠపరిమాణక లింగమును (అర్చామూర్తిని) ప్రతిష్టించుటకు-శ్రీవృక్షకము (రుచకము-చతురస్రము) మొదలగు ఎనిమిదియు మధ్యమలింగమును (అర్చామూర్తిని) ప్రతిష్ఠించుటకు హంసము మొదలగు ఐదును కనిష్ఠ లింగమును (ఆర్చామూర్తిని) ప్రతిష్ఠించుటకు శుభావహములు.
వలభీచ్ఛందక ప్రాసాదమున, గౌరిని, జటా-ముకుటములను ధరించి వరదాభయ ముద్రలు అక్షమాల-కమండలుపు నాలుగు హస్తములందును ధరించిన తపోవనస్థమూర్తితో గాని - రక్త ముకుటము కలిగి ఉత్పలము అంకుశము వరదాభయ ముద్రలుకల నాలుగు హస్తములతో భర్తతో వినాయకునితో కూడి గృహస్థితమూర్తితోగాని -ఉన్న రూపముతో అర్చించవలయును.