మత్స్య మహా పురాణము
అగ్నిష్వాత్తపితరుల చరితము
పురాణములందును, శాస్త్రములందును చెప్పబడిన పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వీరిలో మూడు మూర్తిలేని గణములు. ఆ గణముల పేర్లు 1. వైరాజులు; 2. అగ్నిష్వాత్తులు; 3. బర్హిషదులు; మూర్తి కలవి నాలుగు గణములు. 1. సుకాలినః; 2. హవిష్మంతః 3. ఆజ్యపాః; 4. సోమపాః, వీరిలో మొదటి గణమును విషయము పదుమూడవ అధ్యాయమున చెప్పబడినది. ఈ అధ్యాయమున రెండవ గణమువారి విషయము చెప్పబడును.
సోమ పథములను లోకములు గలవు. వీనియందు మరీచి అను ప్రజాపతికి కుమారులు అగు పితృదేవతలు నివసింతురు. వీరిని దేవతలు ఆరాధింతురు. ఈ పితరులకు అగ్నిష్వాత్తులు అని పేరు. (అగ్నిషు-అత్త=అగ్నులయందు సమగ్రముగా హవిస్సు వేల్చి యజ్ఞములను చేసిన వారు.) వీరందరును యజ్వలు-యజ్ఞములను చేసినవారు.
వారి మానసపుత్త్రి అచ్ఛోదా అనుఆమె. ఆమె నదీరూపురారైనది. పూర్వము పితృ దేవతలు అచ్ఛోదమను సరస్సును సృష్టించిరి. ఆ సరస్తీరమున ఈమె వేయి దివ్య సంవత్సరముల కాలము తపస్సు ఆచరించెను. పితరులు సంతుష్టులై ఆమె కడకు వచ్చిరి. నీకే వరము కావలెనో ఇత్తుము. కోరుకొనుమనిరి. వారందరును దివ్యములగు రూపముల ధరించినవారు. దివ్యములగు మాలికలు పుష్పములు దాల్చినవారు. దివ్య గంధములు పూసికొనినవారు. యువకులు; బల శాలురు; మన్మథుని వంటివారు. వారిలోనుండి ‘మావసుడు’అను పితరుని ఆమె కామపరవశురాలై వరునిగా కోరుకొనెను. ఆ సుందరి ఈ వ్యభిచార దోషముచేత యోగభ్రష్టురాలయ్యెను. అంత వరకును దేవభావమున భూమిని తాకకయున్న ఆమె భూస్థలిపై పడిపోయెను.
కాని మావసుడు ఆ అఛ్చోదను కామించక ధైర్యముతో ఉండెను. అందుచే ఆమె ‘మావస్య’ (మానవునికి ప్రియురాలు) కాలేదు. కనుక ఆమెకు ‘అమావస్య’ అను పేరు వచ్చెను (మావస్య కానిది) తన తపస్సుచే పితరులను మెప్పించినందున ఈ అఛ్చోద లేదా అమావాస్య పితృదేవతలకు ఇష్టురాలు మాత్రమయినది. అందుచే అమావస్య (అమావాస్యా) తిథియందు పితరులకు అర్పించినది అక్షయమగును. అనంతఫలమును ఇచ్చును.
తన తపస్సు తన దోషముచే క్షీణించుట వలన అచ్ఛోద దీనురాలయి ముఖము వంచుకొని సిగ్గుపడుచు తాను మరల తన తపస్సును సమృద్ధి నొందించుకొనుటకై ఉపాయమును తెలుపవలసినదిగా తన తండ్రులగు పితరులను వేడుకొనెను. ఆ మహాభాగులు అనుగ్రహము కలవారైరి. వారు జరుగబోవు విషయములను దేవకార్యమును (తమ ధ్యాన దృష్టితో) దర్శించిరి. శుభమగు వాక్కుతో వారు ఆ తపస్విని (తపోవంతురాలు-జాలిపడదగిన దీనురాలు)తో ఇట్లు పలికిరి: సుందరియగు పుత్రీ; వివేకవంతులగువారు (భూలోక సంబంధి కానటువంటి) దివ్య శరీరముతో చేసిన ఏ కర్మమునకైనను ఫలమును వారు అదే శరీరముతో అనుభవింతురు. మానుష శరీరముతో ఉన్నవారు మాత్రము తాము చేసిన కర్మల ఫలములను (కొన్నిటిని) ఆ దేహమును విడిచిన తరువాత అనుభవింతురు. (నీవు మనుష్య స్త్రీవి కనుక) నీవు తపస్సు ఆచరించినచో దాని ఫలమును నీవు ఈ దేహమును విడిచిన తరువాత (మరియొక జన్నములో కాని దేవలోకమున కాని) అనుభవింతువు.
ఇప్పుడు నీవు నీ తండ్రుల విషయమున వ్యతిక్రమము (నియమము తప్పి కామ బుద్ధిని చూపుట) చేసితివి. కనుక ఇరువది ఎనిమిదవ ద్వాపరయుగమున చేప కడుపున జన్మించి నీచమగు కులమును చేరుకొందువు. ఇది జరుగుటకై నీవు వసుడను రాజునకు కూతురవు అగుదువు. కన్యగా ఉండి (కన్యాత్వము చెడకయే) చివరకు మరల దుర్లభములగు నీలోకములను నీవు చేరెదవు. ఎట్లనగా పరాశరుని వీర్యముతో ఒక కుమారుని కనెదవు. అతడు సాక్షాత్ అచ్యుతు (నారాయణుడే. బదరీవృక్షములు ఎక్కువగా కల ద్వీపమున జనించును. ఆ నీకుమా రుడు ఒకటిగా ఉన్న వేదమును నాలుగుగా విభజించును. సముద్రుని అంశచేత జనించిన పూరు వంశీయుడైన శంతనుని వలన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను కుమారులను ఇద్ద రను కనెదవు. భూలోకమున నీకు సత్యవతి అని పేరు. పితృలోకమున నీకు అష్టకా అనిపేరు. అచట నీవు ప్రౌష్ఠపదీ-అష్టకా-(భాద్రపద శుక్ల పూర్ణిమ గడచిన వెంటనే వచ్చు సప్తమీ తిథి) రూపముతో ఉందువు. నీవు పర (పితృ) లోకమునందుండి ప్రాణులకు ఆయురారోగ్యములను కోరిన ఫలములను ఇత్తువు.
నీవు భూలోకమున నదీ రూపమును పొంది అచ్ఛోద అను పేర పుణ్యజలములుగల నదీ శ్రేష్ఠవై యుందువు.
ఇట్లు పలికి ఆ పితృగణము అచ్చటనే అంతర్ధానమును పొందిరి. ఆ అచ్ఛోదయను పితృ కన్యయును వారిచే ఇంతవరకును చెప్పబడిన సత్కర్మ ఫలమును పొందెను.