బ్రహ్మకు స్వపుత్రీ గమన దోష పరిహారము

మనువు మత్స్యభగవానునితో ప్రభూ! బ్రహ్మ తన కుమార్తెను పొందెను అంటిరి. ఛీ! ఇది ఎంత నీచమయిన పని! అతడు మరల ఏ ప్రాయశ్చిత కర్మము నాచరించి లోకములకు ద్వేషించరానివాడు అయ్యెను? అతని కుమారులు ఒకరికి ఇంకొకరు సగోత్రులగుదురు. వారిలో వారికి వైవాహిక సంబంధము జరుగుట ఎట్లు? ఈ సంశయమును నివారించుడు అని ప్రశ్నించెను. మత్స్య భగవానుడు ఇట్లు పలికెను, నేను చేసిన అది సృష్టి రజోగుణముచే ఉద్భవించినది. దివ్యమయినది. లోకసాధారణమయినది కాదు. అతీంద్రియము. ఇంద్రియములకు అందనిది. ఇంద్రియములకు గోచరించని శరీరము కలది. దివ్య తేజోమయము. దాని రూపము దివ్యమయి నది. ఉత్తమమగు జ్ఞానముచే ఉత్పత్తి చెందినది. మర్త్యులు తమ మాంసపు కన్నులతో దానిని తుదవరకు (సంపూర్ణముగా) చూడజాలరు. సర్పములు ఆకాశమున సంచరించు వివిధ పక్షుల మార్గమును చూడజాలవు. అట్లే దివ్యులగు వారి మార్గమును వేదములేకాని మానవులు తెలిసికొనజాలరు. అందువలన వారి తత్త్వమును విచారణచేయుటయే, మానవులకు శుభకరము.