మత్స్య మహా పురాణము
స్యమంతకోపాఖ్యానము
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, వృష్ణికి గాంధారి, మాద్రి అను ఇద్దరు భార్యలు. అతనికి గాంధారి యందు సుమిత్రుడు, మాద్రియందు యుధాజితుడు, దేవమీఢుడు, అనమిత్రుడు, శిబి అను ఐదుమంది కుమారులు కలిగిరి. అనమిత్రునకు నిఘ్నుడు అతనికి ప్రసేనుడు, శక్తిసేనుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. వీరిలో ప్రసేనుడు రత్న రాజమగు స్యమంతకమణిని సంపాదించెను. అది అతడు హృదయమున ధరించుట చూచి శ్రీకృష్ణుడడిగినను అతడది అతని కీయలేదు. శక్తుడై యుండియు కృష్ణుడు దానిని బలమున హరించలేదు. ఒకమారు ప్రసేనుడు దానిని ధరించి వేటకైపోయి ఒక గుహలో జంతువేదియో చేసిన శబ్దమువిని లోనికి పోగా అచట నతని కొక ఎలుగుబంటి కనబడెను. వారొకరి నొకరు చూచుకొనిరి. ఋక్షము ప్రసేనుని చంపి మణిని హరించెను. మరణించినందున ప్రసేనుడు గుహలోనికి పోయినవాడు తిరిగిరాలేదు. మణికై గోవిందుడే ప్రసేనుని చంపియుండునని శక్తిసేనాదులు శంకించిరి. నా సోదరుడు మణిని ధరించి అడవికి పోవుట చూచి కృష్ణుడును అటకు వెళ్ళి ప్రసేనునిచంపెను అని శక్తి సేనుడనెను. తానుచంపలేదని కృష్ణుడు మారుపలికెను. కొంతకాలము తరువాత యాదృచ్ఛికముగా శ్రీకృష్ణుడు వేటకై పోవుటయు ఋక్షముండెడి బిలముకడకు చేరుటయు జరిగెను. అతనిని చూచి ఋక్షరాజు మహాశబ్దము చేసెను. అదివిని శ్రీకృష్ణుడు ఖడ్గపాణియై గుహలోనికి పోగా అతనికి జాంబవంతుడు కనబడెను. కృష్ణుడు క్రోధముతో కండ్లెర్రచేసి మహాబల సంపన్న శరీరుడగు జాంబవంతుని పట్టుకొనెను. అతని పనులనుబట్టి జాంబవంతుడు కృష్ణుని విష్ణునిగా గుర్తించెను. అందులకు సంతసించి కృష్ణుడు వరము కోరుకొను మన నీ చేతిలో చక్ర ప్రహారముతో నాకు మరణము కావలయునని జాంబవంతుడు కృష్ణుని వరమడిగెను. యుక్త వయస్సువచ్చిన నాకుమార్తెను నీవు భార్యగా గ్రహించుము. ప్రసేనుని చంపి నేను గ్రహించిన ఈమణిని కూడ తీసికొనుము అని అతడు జాంబవతిని, మణిని శ్రీకృష్ణున కర్పించెను. తరువాత ఆ ప్రభువు చక్రముతో జాంబవంతుని సంహరించి జాంబవతిని మణిని గ్రహించెను.
తరువాత శ్రీకృష్ణుడు స్యమంతకమణిని శక్తిసేనునకు (సత్రాజిత్తునకు) సాత్వతుల సభయందు సమర్పించెను. ఇట్లు శ్రీకృష్ణుడు మిథ్యా ప్రవాదము నుండి ముక్తుడయ్యెను. ఇంత వరకును నీవే ప్రసేనుని చంపితివని మేము అనుకొంటిమని యాదవులు అందరును కృష్ణునితోననిరి.
కేకయ రాజు తన పదిమంది కుమార్తెలను సత్రాజిత్తునకు ఇచ్చి పెండ్లి చేసెను. వారికి సర్వలోక ప్రసిద్ధులు మహాసత్వ సంపన్నులు అగు కుమారులు కలిగిరి. వారిలో భంగకారుడు పెద్దవాడు. అతనికి బ్రువతి (వ్రతవతి) అను భార్య యందు సత్యభామ-వ్రతిని-పద్మవతి అను ముగ్గురు కుమార్తెలు కలిగిరి. సత్రాజిత్తు తన ఈ ముగ్గురు కన్యలను శ్రీకృష్ణునికిచ్చి పెండ్లి చేసెను.
వృష్ణి కుమారులలో కనిష్ఠుడగు అనమిత్రునకు శినియను కుమారుడు కలిగెను. అతని కుమారుడు సత్యవంతుడు-అతని కుమారుడు సాత్యకి. అతని కుమారుడు యుయుధానుడు. అతని కుమారుడు అనంగుడు. అతని కుమారుడు ధుని. అతని కుమారుడు అసత్వరుడు. ఇది శిని వంశక్రమము. వృష్ణి కుమారుడగు అనమిత్రుని వంశము నిట్లు వివరించుటయైనది. ఈ అనమిత్రునకే యుధాజితుడు ఋషభుడు క్షత్రుడు జయంతుడు మొదలగు కుమారులుండిరి. కాశి రాజపుత్రి ఋషభుని భార్య యయ్యెను. జయంతునకు జయంతియందు సదాయజ్వా -అతివీరుడు-శ్రుతవాన్-అతితి ప్రియుడు అను కుమారులు కలిగిరి. అతిదక్షిణుడగు సదాయజ్వకు అక్రూరుడు కలిగెను. శైబ్యుని కుమార్తె రత్న అను నామె అక్రూరుని భార్య.
ఆమెయందతనికి మహాబలులగు పదునొకండుమంది కుమారులు కలిగిరి. వారు -ఉపలంభుడు-సదాలంభుడు-ఉత్కలుడు-ఆర్యుడు-సితేతరుడు-సదాపక్షుడు-శత్రుఘ్నుడు-చారుడు-ధర్మధుక్-ధర్ముడు-మౌని-అనువారు. అక్రూరునకు ఉగ్రసేనయందు దేవవాన్-ఉపదేవుడు అనువారును అశ్వినియందు పృథు-విపృథు-అశ్వత్థామ-సుబాహు-సుపార్శ్వ-గవేషణ ధృష్ణు-నేమి-సువర్ణ-ధర్మ-ధర్మాతి-(శర్యాతి) అభూమి-బహూభూమి-శర్మిష్ఠ ఆశ్రవణ అను కుమారులును కలిగిరి.
శ్రీకృష్ణుడు తనకు కలిగిన మిథ్యాపవాదమును పోగొట్టుకొనిన ఈ కథ వినినవానికి ఎవరివలనను మిథ్యాభివాపములు సంభవింపవు.