స్కంద సనకాది సంవాదము

సూతుడు ఋషుల కిట్లు చెప్పెను, తపోధనులగు సనకాది సర్వఋషులును భక్తులగు సర్వ మహర్షులును కైలాస పర్వతపు నెత్తమున కూర్చున్నవాడును బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునగు స్కందుని ఇట్లడిగిరి. స్కందా! మహాత్ముడు సర్వ భూతములకు ఆత్మభూతుడు దేవదేవుడు సనాతనుడు ప్రభుడునగు భవుడు (శివుడు) దేవదానవులకును దుష్కరమగు ఘోరరూపమును ధరించి స్థాణు భూతుడై భూత ప్రళయము వరకును భూలోక మందెచ్చట నిరంతరము ఉండునో అట్టి గుహ్యము (రహస్యము)లలో పరమ గుహ్యమగు క్షేత్రము అవిముక్తమని పెద్దలందురు. ఇచట నిత్యమును భవుడుండుటచే ఇది సదా సిద్ధిప్రదము; ఈశ్వరుడు చెప్పినట్లు ఈ క్షేత్ర మాహాత్మ్యము ఇది; ఇది పరమ పవిత్ర స్థానము; ఇది తీర్థమును క్షేత్రమును; ఇచట శ్మశానమందే శివుని గృహము (శివాలయము) దివ్యమైనది. అంతర్హితమయి భూలోకముతో అంటక అంత రిక్షము నందున్నది; దీనిని యోగ సంస్కృతమగు చిత్తము కలవారు బ్రహ్మచర్య వ్రతములతో శాంతులయిన వేదాంత కోవిదులగు సిద్ధులు చూడగలరు; ఇతరులు చూడజాలరు; దేహపాతము అగు వరకును ఈ క్షేత్రమును విడువక నివసించుట-లెస్సగా బ్రహ్మచర్య వ్రతముల ననుష్టించుట తోను చక్కగ యజ్ఞము లాచరించుటతోను సమానము; పాప రహితులయి ఉత్తమ కర్మానుష్ఠానము చేసిన వారును పుణ్యమయిన యోగ సాధన చేసినవారును పొందు ఉత్తమగతి ఆ మరణాంతము ఈ క్షేత్రమున నివసించుటచే లభించును. ఏలయన దివ్యయోగ సాధనచే ఉత్తమ గతియును జన్మశతములచే కూడ లభించకపోవచ్చును. అది ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున సులభమగును. ఇచట మనోనిగ్రహము కలిగి శివుని యందు చిత్తము నిలిపి నిరతము వసించువాడు మూడు వేళల భుజించినను వాయు భక్షణమున జీవించునట్లే. అవిముక్త క్షేత్రమున దినమున కొక నిమేష మాత్రమయినను భక్తియుక్తుడై బ్రహ్మచర్యము కలిగి తపమాచరించుచు ఇంద్రియములను మనస్సును జయించి మాసమాత్రము నియమపరుడై వసించువాడు మహాదివ్య పాశుపత వ్రతము ననుష్టించునట్లే, అట్టివాడు జన్మ మృత్యుభయము నతిక్రమించి పరమ గతినందును. పుణ్య లభ్యమగు నిఃశ్రేయన (పారలౌకిక) గతిని యోగసిద్ధి లభ్యమగు పరమగతిని అందును.

దివ్యయోగగతి నూరు జన్మాంతరములకును లభించకపోవచ్చును, కాని అవిముక్తమున మాత్రము ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున అది లభించును; బ్రహ్మ హత్య చేసిన వాడును ఒకమారైన ఈ క్షేత్రమునకేగినచో తన్మాహాత్మ్యమున అది నివర్తిల్లును, దేహపాత మగువరకు అతడిచట వసించుటచే ఆ బ్రహ్మహత్యా దోషమేకాక పూర్వ కృత దోషములును నశించును; వాడు విశ్వేశ్వరుని సన్నిధిలో మరల జన్మించడు; అనన్యమనస్కుడై ఇట విడువక వసించువాని విషయమున దేవుడు సంతుష్టుడయి సర్వకామముల నొసగును; సాంఖ్య యోగ తత్త్వములకు ద్వారభూతుడగు ప్రభువగు భవుడు మహాదేవుడు సగుణరూపుడై భక్తుల యందలి దయతో అట వసించుచున్నాడు; అవి ముక్తము పరమక్షేత్రము; అచట ఉండుటచే పరమసిద్ధి పరమపదము పరమగతి దొరకును; పునర్జన్మము కలుగరాదనుకొను ధీమంతుడగు వాడు దేవర్షిగణ సేవితమగు అవిముక్తమును సేవించవలయును; మేరు పర్వతమునకు, ద్వీపములకు, సముద్రములకు గల గుణములనైన చెప్పగలము కాని ఈ అవిముక్త క్షేత్ర గుణముల చెప్పజాలము; అంత్యకాలమున మానవుల (ప్రాణుల) మర్మస్థానములు భిన్నమగుచుండగా ప్రాణ వాయువులు శిథిలమగుచుండగా స్మృతియే లేకుండపోవును, అప్పుడును ఈశ్వరుడు ఆయా కర్మలచే ప్రేరితులై బాధలనందు తన భక్తులకు తాను స్వయముగా కర్ణములందు మంత్రోపదేశము నిచ్చును. అవి ముక్తమున దేహత్యాగమొనర్చువాడు ఉత్తమ సంస్కారమందిన ఆత్మలు లేనివారికి పొందరాని ఇష్టపరమగతిని ఈశ్వరప్రేరణచే పొందును. ఈ మనుష్యలోకము అశాశ్వతమును బహు పాప యుక్తమును; ఇది ఎరిగి సంసారభయ మోచనమగు అవిముక్తమును విడువక అట వసించువాడు అశాశ్వతమగు ఈ జన్మమును జరామృత్యువులను వీడి శివప్రసాదమున శివసాయుజ్య మందును.