అత్రి గోత్ర ప్రవరాను కీర్తనము

మత్స్యరూప జనార్ధనుడు వైవస్వత మనువుతో ఇంకను ఈ విధముగా చెప్పెను: అత్రి వంశోత్పన్నులయిన గోత్రకారులను తెలిపెదను వినుము. (వీరు మూడు వర్గములుగానున్నారు).

మొదటి వర్గమువారు: కర్దమాయనులు, శారాయణులు, ఉద్ధాలకులు, శౌణులు, కర్ణీరథులు, శౌక్రతువులు, గౌరగ్రీవులు, గౌరజినులు, చైత్రాయణులు, అర్థవణ్యులు, వామరథ్యులు, గోపనులు, ఆస్తకులు, బిందువులు, కణజిహ్వుడు, హరప్రీతి, నైద్రాణి, శాకలాయని తైలపుడు, వైలేయుడు, అత్రి, గోనీపతి, జలదుడు, భగపాదుడు, మహాతపస్కుడుగు, సౌపుష్పి, ఛందోగేయుడు-ఈ ఋషుల (గోత్రముల వారలకు) శ్యావాశ్వుడు, అత్రి, అర్చనానశుడు అనువారు ప్రవర ఋషులు; ఈ ఋషుల (గోత్రముల వార)లు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.

రెండవ వర్గమువారు: దాక్షి, బలి, పర్ణవి, ఊర్ణనాభి, శిలార్దని, బీజవాపిన్-శిరీషుడు, మౌంజకేశుడు, గవిష్ఠిరుడు, భలందనుడు-ఈ ఋషులు (గోత్రములవారల)కు అత్రి, గవిష్ఠిరుడు, పూర్వాతిథి అనువారు ప్రవర ఋషులు; వీరు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.

మూడవ వర్గమువారు: ఆత్రేయ పుత్రికాపుత్రుల వర్గము వారిని తెలిపెద వినుము, కాలేయులు, వాలేయులు, వానరథ్యులు - ధాత్రేయులు, మైత్రేయులు - ఈ ఋషుల గోత్రముల వారలకు అత్రి వామరథ్యుడు - పైత్రి అనువారు ప్రవర ఋషులు; వీరు పరస్పరము వివాహ సంబంధములు జరుపుకొనరాదు.