మత్స్య మహా పురాణము
లక్ష్మీదేవీ ప్రతిమా లక్షణము
లక్ష్మీదేవి నూతన యౌవన వయసునందుండును. లావు చెక్కిళ్లు, ఎర్రని పెదవి, వంపు తిరిగిన కనుబొమలు, బలిసి ఎత్తయిన స్తనద్వంద్వము, మణికుండల ఆభరణములు, చక్కని గుండ్రని ముఖ సీమంత (పాపటతో) భూషితమగు శిరము, పద్మములతో స్వస్తికములతో శంఖములతో భూషితములై మేలగు ముంగురులు కలిగియుండును. రవికలో బిగించబడిన అవయవములు గలిగి, హారాలంకృతములగు స్తనద్వంద్వము భుజకీర్తులతోను కటకములతోను అలంకృతములగు ఏనుగు తొండములవంటి బాహువులు, ఎడమచేతియందు పద్మము, కుడిచేతియందు మారేడుపండు, మేఖల(మొలనూలు - ఒడ్డాణము) ఆభరణముగా కాచిన బంగరు చాయ, నానాభరణ సంపద శోభనములగు వస్త్రములు కలది; ఆమెకు రెండు పార్శ్వములందును, హస్తములందు చామరములు ధరించి వీచుచుండు స్త్రీలు అనేకులు ఉందురు. పద్మ సింహాసన మందు పద్మాసనముతో ఈమె కూర్చుండిఉండును, రెండు ఏనుగులు ఈమెను భృంగారములను పాత్ర విశేషములతో నీరు వంచి స్నానము చేయుచుండ మరిరెండు ఏనుగులు భృంగారములు ధరించి స్నానము చేయించుటకు వేచియుండును, ఈమెను లోకపాలురును గంధర్వులును గుహ్యకులును స్తుతించుచుందురు.