మత్స్య మహా పురాణము
దేవాసురులు బలములు కూర్చుకొనుట
తారకుడు ఇట్లు పలికెను, మహాబలులగు అసురులారా! అందరును నామాట వినుడు. మీరందరును కార్యాచరణ మందు మిగుల స్థిరబుద్ధి నిలుపుడు, దానవులారా! దేవతలు మనకు వంశక్షయకరులు. మనకు జాతిధర్మముగా వారితో అక్షయమగు వైరము నెలకొని యున్నది. మనము ఇపుడు సురల దండించుటకుగా స్వభుజ బలము సర్వమును అవలంబ నముగా చేసికొని పోవుదము. ఇందు సందేహము వలదు. కాని తపస్సు లేక దేవతలతో సంగరము యుక్తము కాదను కొందును. దితిసుతులారా! మొదలు నేను ఘోర తపమొన రింతును. తరు వాత దేవతలను జయింతము; జగత్రయమును అనుభవింతుము. స్థిరోపాయముగల పురుషుడే స్థిరశ్రీని పొందును. చపలుడనయియుండి నేను సహజ చపలయగు లక్ష్మిని కాపాడజాలను అని అనగా దైత్యదాతనవు లందరును ఆ తారకాసురుని వచనము విని విస్మయమంది ‘బాగుబాగ’ నిరి. తారకుడును పారియాత్రగిరి గుహకు పోయెను. అది ఉత్తమము. సర్వఋతు కుసుమ ములతోవ్యాప్తము, నానా విధములగు ఓషధులతో (ధాన్యాదులతో) దీపించుచున్నది. నానాగైరిక ధాతువులను స్రవించునది. చిత్రమయినది; అనేక గుహాగృహములు అందుగలవు. దాని కన్ని వైపుల దట్టములగు అడవులు కలవు; చిత్రములగు కల్పవృక్షములు అందగలవు. అనేక ఆకారములు కలిగి నృత్యమొనర్చు అనేక పక్షులతో కల్లోలితముగా నున్నది. ఎన్నో సెలయేళ్లందు గలవు. ఎన్నో జలాశయములును గలవు. అచటచేరి ఆదైత్యుడు విస్తృతమగు తపమాచరించెను. పంచాగ్ని మధ్యగతుడై నిరాహారుడై ఆకులను ఆహారముగా నిరాహారముగా ఇట్లు వేరువేరు విధముల నూరేసి ఏండ్లు తపమాచరించెను. తరువాత దినదినమున తన దేహము నుండి మాంసము ఖండించి మాంసము అగ్ని యందు వేల్చి వేల్చి మాంస రహితుడయ్యెను.
వాని తపస్సుతో దేవతలు అందరును భయమందిరి. ఇంతలో (బ్రహ్మ) వానితపస్సునకు సంతృప్తుడై వరమీయ దేవలోకమునుండి పోయెను. సరసమగు రథమునెక్కి ఆదేవుడు ఆపారి యాత్రశైల రాజమునుచేరి మధురవాక్కుతో తారకునితో ఇట్లనెను: పుత్రా! తపము చాలించుము; నీకిపుడు అసాధ్యము లేదు. నీ సంకల్ప మందున్న ఇష్టవరము కోరుము. ఇట్లనగా తారకుడు విభుడగు స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి విశాల దేహుడయ్యును వినయముతో వంగి ప్రాంజలియై ఇట్లనెను. దేవా! నీవు సర్వ భూతముల మనస్సుల యందుండువాడవు. సర్వప్రాణుల చర్యలను నీవు ఎరుగుదువు. ప్రాయికముగా జనుడు ప్రతియొకడును తనకు ఇతరులు చేసిన అపకారమునకు ప్రతీకారముచేసి పగవానిని గెలువ గోరును. మాకు జాతి ధర్మముగా మేము అమరులకు వైరులము. వారు ధర్మము విడిచి దైత్యుల నిఃశేషుల జేసిరి. నేను వారిని నిర్మూలించ గోరుచున్నాను. నేను సర్వభూతములకును మహాతేజోవంతములగు అస్త్రములకును అవధ్యుడ గావలయును. ఇది నా హృదయమునకు ఈప్సితమగు పరమవరము; దేవేశా! ఇదియే నాకిమ్ము; మరేవరమును నాకింపుగాదు. అనగా అమరనాయకుడగు బ్రహ్మ తారకునితో ఇట్లనెను: దైత్య సత్తమా! ఏదేహియు మృత్యువు నందకుండజాలదు. కనుక ఏదోయొక దాని నుండి మరణమును కూడ సంశయింపక కోరుము; అనగా వాడును గర్వ మోహితుడయి ఆలోచించి ఏడు దినముల శిశువు వలన మృత్యువును కోరెను. బ్రహ్మ వానికా వరములనిచ్చి దేవలోకమేగెను. దైత్యేంద్రుడు తారకుడును తన గృహమునకు పోయెను. తపస్సు నుండి ఉత్తీర్ణుడయివచ్చిన ఆదైత్యుని దైత్యేశ్వరు లందరును స్వర్గమున దేవతలు సహస్రాక్షునివలె సేవించసాగిరి.
దైత్యనందనుడా తారకుడానాడే రాజ్యస్థుడయ్యెను. నాటినుండి ఋతువులు తమకాలపు లక్షణములతో నిండి వాని సేవింపవచ్చెను. లోకపాలురందరు వాని కింకరు లయిరి. కాంతి ధృతి కీర్తి మేధా అఖండమగు సిరి తమ తమగుణములతో నిండినవై ఏ లోపమును లేక అన్నియు ఆ దానవుని ఆశ్రయించెను. అతడు కాలాగురు (సుగంధ ద్రవ్యము) లేపనము పూర్తై కొని మహా కిరీటము మనోహరములగు భుజకీర్తులు ధరించి మహాసింహాసన మధిష్ఠించియుండ అప్సరః శ్రేష్ఠలు ఆతనిని విడువక వీవనలతో మిగుల వీచుచుందురు. ఆతని దీపమార్గములందు చంద్రసూర్యులును వీవనల యందు వాయువును యముడాతని ముందుగాను ఉండెడివారు.
చాలకాలమిట్లు గడచిన మీదట మహావర గర్వితుడగు ఆ తారకాసురుడు ఒకనాడు సచి వులతో ఇట్లనెను: స్వర్గమాక్రమించనిదే రాజ్యముతో నాకేమి తృప్తి? దేవతలతోడి పగ తీర్చుకొననిదే నాహృదయమునకు శాంతి ఎక్కడిది. ఇప్పటికిని దేవతలు యజ్ఞ్యాంశములను అనుభవించుచునే ఉన్నారు. స్వర్గమందే నివసించుచున్నారు. విష్ణువు లక్ష్మిని విడువక ఏ తడబాటును లేక సుఖముగా ఉన్నాడు. స్వర్గస్త్రీలు ఇప్పటికిని తమ ప్రియులను శృంగార క్రీడలందు పీడించు చున్నారు. స్వర్గమున విహార స్థానములందు ఇంకను మద్యములు కలువల వాసనతో కూడి యున్నవి. జన్మము నందియు పౌరుషమును సాధించని వాని జన్మము వ్యర్థము; వానికంటె పుట్టనివాడే మేలు. తల్లిదండ్రుల కోరికలను తీర్చనివాడును బంధువులను సంతోషపెట్టని వాడును మాన్యమగు కీర్తి నార్జించనివాడును మృతుడేయని నాయభిప్రాయము. కావున మనము నేడే సురపుంగవుల త్రైలోక్యలక్ష్మిని హరించుటకై శీఘ్రముగా యుద్ధయాత్ర చేయుదము. అష్ట చక్రమగు నారథమును దుర్జయమగు దైత్య సేనాచక్రమును సిద్ధపరచబడు గాక! కాంచనముతో రత్నములతో కూర్చిన నా ధ్వజమును మౌక్తిక జాలముతో బద్దమయిన ఛత్రమును సిద్ధమగుగాక!
తారకుని మాటవిని అతని సేనాపతియగు గ్రసనుడను దానవుడు తన సేనతోకూడి అదేవిధముగా చేసెను. అతడు గంభీరమగు భేరినిమ్రోగించి త్వరితముగా దైత్యులను యుద్ధమునకై పిలిచెను. వేయి గుర్రములు, ఎనిమిది చక్రములు, శుక్ల వస్త్రాలంకారములు నానా క్రీడా గృహములు మనోహర గీతవాద్యపు ఏర్పాటులు కలిగి చతుర్యోజన వైశాల్యము కలిగి దేవపతియు శతక్రతుడు అగు ఇంద్రుని విమానమో అనునట్లున్న రథమును సిద్ధపరచెను. దైత్యులలో చండ విక్రములును పదికోట్ల దైత్యులకు నాయకులునుఅగు అసురులును సంసిద్ధులైరి. వారందరును నానా శస్త్రము లతో యుద్ధము చేయగలవారు; నానాశస్త్రాస్త్ర విద్యాపారంగతులు.
వారిలో తారకుని ధ్వజము రౌద్రమయి పద్మాలంకృతమయి యుండెను. గ్రసనుడు మకర ధ్వజము దాల్చెను. జంభుని ధ్వజము అయోమయమయి పిశాచ మఖమయి యుండెను. కుజంభుని ధ్వజమందు తోక ఆడించుచున్న గాడిద ఉండెను. మహిషుని ధ్వజమందు బంగారు నక్క ఉండెను. శుంభుని అత్యున్నతమగు ధ్వజమందు అయోమయమగు కాకియుండెను. ఇతర దానవులు ధ్వజములును అనేకాకార చిహ్నములతో నుండెను.
గ్రసనుని రథము శీఘ్రవేగము కలవి బంగరు మాలికలు కలవియగు నూరు పులులు పూంచినది. జంభుని రథము చిరుగజ్జెల సమూహములు మాలికలుకల నూరు సింహములను పూంచినదై దుర్జయమయినది. పిశాచ ముఖములుగల గర్దభములు కుజంభుని రథమును లాగుచుండెను. మహిషుని రథమును ఉష్ట్రములును గజుని రథమును తురంగములును మేఘుని రథమును భయంకరములగు చిరుతపులులును కాలనేమి రథమును ఏనుగులును లాగుచుండెను. ఆ మదపుటేనుగులు పర్వతములవలె దృఢములయి ఎత్తయి నాలుగు దంతములు కలవయి మదము కార్చుచు సుశిక్షితములయి మేఘములవలె భయంకరములయి యుండెను. వానికి తోడుగ నూరు మూరల ఎత్తయినవి బంగరు విధోత్తరీయములతో నానామాల్య విభూషణములతో నానా సుగంధములతో నానాస్తోత్ర పాఠకుల స్తోత్త్రీములతో నానా వాద్యముల మ్రోతలతో మహారథులు తమముందు నడువగా నానా వీరాలాపములాడుచు మహా అసురులు ఆ సేన యందుండిరి. ఇట్లా దైత్యసింహు డగు తారకుని సేన భయంకర రూపముతో ఒప్పెను. అది భయంకరములగు మదపు సొమ్మలుగల నల్లని గుర్రములు నుండెను. కాలనేమి తెల్లని చందనము పూసికొనిన మనోహర దేహముతో నానా పుష్పమాలలతో ప్రకాశించుచున్న వాడయి తెల్లని చామరములతో ప్రకాశించుచు దక్షిణదిశకు బయలుదేరెను.
మథనుడను దైత్యేంద్రుడు పాశహస్తుడై ప్రకాశించెను. జంభకుడు చిరుగంటలు రాసులు మాలలుగల ఒంటె నెక్కెను. శుంభ దానవుడు నల్లని తెల్లని పెద్దగొర్రె పొట్టేలు నెక్కెను. ఇతరులగు దానవ వీరులును నానా వాహన గాములయి భయంకర చిత్ర కృత్యములు చేయుచు కవచములు దాల్చి కుండలములు తలపాగలు సొమ్ములుగా నానా టేనుగులతో ప్రమత్తులగు రథికులతో సంకులమయి అనేక పదాతు లతో జెండాలతో దేవతలతో యుద్ధమునకు బయలు దేరెను.
ఇంతలో దేవదూతయగు వాయువు అంతరిక్ష ప్రదేశమందుండి దానవ బలమును చూచి ఇంద్రునకు తెలుపుటకు పోయెను. అతడు మహాత్ముడగు ఇంద్రుని దివ్య సభకు పోయి దేవతల నడుమఉన్న అతనితో ఈయుద్ధము సంప్రాప్తించిన మాట తెలిపెను. అదివిని మహాభుజు డగు దేవరాజు కనులు మూసికొని (ఆలోచించి) తగిన సమయమున బృహస్పతితో ఇట్లనెను, దేవతలకు దానవులతో ఈ మహాయుద్ధము వచ్చిపడినదిగదా! ఇందు నీత్యుపాయముతో కూడిన కార్యము ఏదియో తెలుపుము. మహేంద్రుని ఈ వచనము విని వాకృతియు మహాబుద్ధిశాలియు అగు మహాభాగుడు బృహస్పతి ఇట్లనెను:
సేన చతురంగ మయినట్లే నీతికిని చతురంగములు కలవు. సురశ్రేష్ఠా! జయము కోరువారికి ఈ చతుర్విధ నీతి సనాతనమయినది. సామదాన భేదడండములు అనునవి ఆ నాల్గు నిత్యంగ ములు, దేశకాల శత్రువులనుబట్టి క్రమముగా వీనిని ప్రయోగించవలెను. బలమగు ఆశ్రయము కలవారు కావున దైత్యులందు సామము పనికిరాదు. జాతి ధర్మము చేతనే వారు భేదమునకు లొంగరు. ధనవంతులయందు దానమేమి ఉపయోగించును? మీకిష్టమయినచో దండోపాయము మాత్రమే ఇక మిగిలియున్నది. ఆదియుకాక సామో పాయము గొప్పదేకాని దుర్జనుల విషయమున మనము అది ప్రయోగించిన నింద పొందుదుము. మహాత్ములు ప్రయోగించిన సామమును క్రూరులు ఇది భయముచేత అని తలంతురు. ఋజుత్వము ఆర్యమగు బుద్ధితో నడుచుట దయ సామము-ఇవి భయముచే చూపు గుణములనియు నీతికి లోపమనియు దుర్జనులు అనుకొందురు. కావున దుర్జనుల నణగద్రొక్కుటకు పౌరుషమాశ్ర యించుటయే మేలు. మనలనే వాడాక్ర మించినపుడును ప్రతిక్రియయే మహాకార్యము. దుర్జనుడు ఎన్నడును సుజనుడు కాడు. సుజనుడును తన స్వభావమును ఎన్నడును విడువరాదు. నాకు ఇట్లు తోచుచున్నది. మీరును ఆలోచించుడు.
బృహస్పతి ఇట్లనగా ఇంద్రుడును ‘ఇది ఇంతే;’ అని తానును కర్తవ్య మాలోచించి సభ యందలి దేవతలతో ఇట్లనెను: లోకపాలకులారా! మనము యజ్ఞభాగ భోక్తలము-అతి సాత్త్వి కులము, మన మందరమును మనఅధికారము లందుండగా దానవేశ్వరులు అనిమిత్తముగా మనలను (దేవతలను)బాధించుచున్నారు. వారిమీద సామాదికము పనికిరాదు. దండమే పూన వలెను. యుద్ధమునకు ఉద్యుక్తులము కావలెను. నా సేవను సంయోజన పరచుడు. శస్త్రములను (స్థానములందు) నిలుపుడు. అస్త్ర దేవతల నారాధించుడు. అమరులారా! వాహనములను యాన సాధనములను సిద్ధపరచుడు. యముని సేనాపతిగా చేసికొని స్వర్గవాసులారా! ఇట్లు చేయుడు. అనగానే దేవతలలో ప్రధానులు అందులకయి ఉద్యుక్తులు కాసాగిరి.
మాతలి పదివేల గుర్రములను పూన్చిన ఇంద్ర రథము సిద్ధపరచి తెచ్చెను. దానికి బంగరు గంటలు అలంకరించబడెను. అది ఆశ్చర్యకర నానా లక్షణములతో ఉండెను. సర్వ దేవతలు దాని వెంటనుండిరి. దాని నెవరును జయింపజాలరు. యముడు మహిషమెక్కి సేనకు ముందుండెను. అతని చుట్టును చండులగు కింకరుల బృంద ముండెను. అతని వస్త్రములును కనులును ఉద్ధత ప్రళయకాలాగ్ని జ్వాలలవలె నుండెను. అగ్నియు శక్తి ఆయుధముగా దాల్చి మేషమును ఎక్కెను. వాయువు విస్తార మహావేగముగల లేడినెక్కి అంకుశము ధరించెను. వరుణ భగవానుడు సర్పముల పూంచిన రథమారో హించెను. ఆకాశగామియగు నిరృతి మను జులులాగు రథమెక్కెను. ధనాధిపుడగు కుబేరుడు తీక్ష్ణ ఖడ్గమును, గదను దాల్చి భయంకర వీరుడుగా మహాసింహరథమున కూర్చుండెను. చంద్ర సూర్యులు అశ్వినీ దేవతలు అశ్వములనెక్కి నిలిచిరి. గంధర్వులు బంగరు సొమ్ములు దాల్చి బంగరు అంచుల ఉత్తరీయములు ధరించి చిత్రములగు కవచములు రథములు ఆయుధములు కలవారయి బంగరుతో జుట్లుల నలంక రించుకొని వైఢూర్యములతో చేసిన మకరముల ధ్వజములతో నుండిరి. రాక్షసులు ఎర్రని ఉత్తరీయములు దాల్చి ఎర్రని కేశములతో గ్రద్దలు ధ్వజములుగా ఇనుప సొమ్ములు ధరించియు మహావీర్యులు నిర్మలులు నయియుండిరి. నాగులు ముసల ఖడ్గ గదలాయుధములుగా హస్తముల దాల్చి తలపాగలు కవచములు ధరించి రథముల నారోహించి మహామేఘధ్వనులతో మహోల్కలు పిడుగులు ఆయుధములుగా నుండిరి. యక్షులు నల్లని వస్త్రములుదాల్చి భయంకర బాణధనుర్ధరు లయి రాగిగ్రుడ్లగూబలు ధ్వజములుగా బంగరు సొమ్ములుదాల్చియు భయంకరులై యుండిరి. చిరుతపులుల చర్మములు ఉత్తరీయములుగా పిశాచబల ముండెను. వారిలో చాలమందికి గ్రద్దల ఈకలు ధ్వజములు-ఎముకలు సొమ్ములు-గా ఉండెను. ఆసేన ముసలా ధ్యాయుధములతో నానా ప్రాణులతో చూడరానంత భయంకరముగా నుండెను.
కిన్నరులకు వస్త్రములు తెల్లనివి, తెల్లని పక్షులు వారి పతాకము లందుండెను. వారిలో చాలమందికి వాహనములు మత్తేభములు. వారి ఆయుధములు వాడితోమ రములు; ముత్తెములు జాలరులతో అలంకరించబడిన వెండి హంసలు వారి ధ్వజము లందుండెను.
వరుణుని ధ్వజము భయంకరమగు ధూమముతో కూడిన అగ్ని. కుబేరుని ధ్వజము పద్మరాగ మహా రత్నముతో చేసిన మొక్క.అది మిగుల ఎత్తయి ఆకాశములోనికి పోగోరుచున్నట్లుండెను. యముని ధ్వజము ఇనుప తోడేలు. నిరృతి ధ్వజము ప్రేత ముఖము. రవిచంద్రుల ధ్వజములు అమితకాంతిగల బంగరు హంసలు. అశ్విదేవతల ధ్వజము ఎర్రనిదై వింత వన్నెలు గల కడవ. బంగారుతో చేయబడి మిశ్రితరత్నములతో చేయబడి తెల్లని వింజామరలతో అలంకృత మైన ఏనుగు ఇంద్రుని ధ్వజము. నాగ, యక్ష, గంధర్వ, మహోరగ, నిశాచరులతో అమరిన ఆ ఇంద్ర సేన త్రిలోకములందును దుర్జయమయియుండెను. ఆదేవ సేనయందు ముప్పది మూడు కోట్ల దేవతలు నుండిరి.
మంచుకొండవంటిదై తెల్లని కర్ణచామరములు బంగరు తామరలతో కూర్చిన అమల సుందర హారములు ఎర్రని కుంకుమపూవుపూత కపోలములందు క్రీడించు తుమ్మెదల గుంపులు కలిగిన ఐరావతము నందు మహా బలశాలియు చిత్ర వస్త్రాభరణ ధారియు విశాల వస్త్రపు కిరణములతో ఏర్పడిన వితానము(చాందనీ-అంబారీ)తో అలంకృతుడును వ్యాప్తమయిన భుజ కీర్తులుగల భుజాగ్రమండలము కలవాడును సహస్ర నేత్రుడును వేలకొలదిగా స్తుతిపాఠకులచే సంస్తుతింప బడువాడును అగు పాకశాసనుడు ఇంద్రుడు స్వర్గమునందలి ఎల్లరకంటే మిక్కిలిగా ప్రకాశించెను.
గజతురగ బలరాశితో సంకులమయి శ్వేతచ్ఛత్త్ర ధ్వజ పంక్తితో ప్రకాశించుచు జయింప నలవికాని పదాతులు కలిగి నానాయుధులగు యోధులతో దుస్తరమయి ఆ దేవసేన ప్రకాశించుచుండెను.