శ్రాద్ధముచే పితరులకు తృప్తి కలుగు విధము

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి, “లోకమున పితృ కర్మలయందు పితృదేవతలను ఉద్దేశించి జనులు ఇచ్చిన కవ్యములును (పితృ దేవతలకు ఇచ్చిన ద్రవ్యములు అన్నము మొదలైనవి) హవ్యములును (విశ్వేదేవులు మొదలగువారిని ఉద్దేశించి ఇచ్చిన ద్రవ్యములు అన్నము మొదలగునవి) పితృలోకమునందున్న పెద్దలకుగాని పితృదేవతలు మొదలగు వారికి గాని ఎట్లు చేరును? ఈ పదార్థముల వలన కలుగు తృప్తిని అచ్చటికి చేర్చువారు ఎవరు? ఇక్కడ ఈ పదార్థములను తినువారును అనుభవించువారును మానవులగు బ్రాహ్మణులు గదా! హోమము చేయునది అగ్ని హోత్రమునందు కదా! ప్రేతలనుద్దేశించి ఇచ్చిన ఈ పదార్థములు శుభాశుభ రూపులై పుణ్యమో, పాపమోచేసియుండి ఈలోకమును విడిచిపోయి ఉన్న ఆ ప్రేతలు ఏ విధముగా అనుభవింతురు?”

సూతుడు ఆ ఋషులతో ఈ విధముగా చెప్పనారంభించెను, పితృ శ్రాద్ధములను ఆచరించు ప్రక్రియలో పితను మాతను వసు రూపులనుగా పితామహుని పితామహిని రుద్ర రూపులనుగా ప్రపితామహుని ప్రపితామహిని ఆదిత్య రూపులనుగా చెప్పుదురు. ఇట్లని శ్రుతి ప్రమాణము. వారిని వారిని ఈఈ రూపములతో ఉన్నట్లు పేర్కొనుటతో బాటు పితరుల నామమును గోత్ర మును కూడ చెప్పుదురు. ఇవియే శ్రాద్ధకర్త ఇచ్చిన హవ్యకవ్యములను ఆయా పితరులకు చేర్చును. ఇదికాక శ్రాద్ధపు మంత్రములను శ్రద్ధను భక్తి పూర్వకముగ శ్రాద్ధమున ఉపయోగించ వలెను. అగ్నిష్వాత్తులు మొదలగు పితృదేవతా గణములవారు పితరులకును వారిని ఉద్దేశించి ఇచ్చిన ద్రవ్యములకును అధిపతులై యుందురు. పితరులను ఉద్దేశించి చెప్పిన ఈ వసురుద్రాదిత్య రూప నిర్దేశములను వారికి ఆహారముగా ఇచ్చిన దానిని వారికి అందజేసి తృప్తి కలిగించును.

ఎట్లన ఒకానొక శ్రాద్ధకర్తయొక్క తండ్రి తన శుభకర్మ బలమువలన దేవత్వమును పొందెను అనుకొందము. ఈ లోకమునందలి అతని కుమారుడు అతని నుద్దేశించి ఇచ్చిన అన్నము అమృతమై దేవత్వములో ఉన్న ఆ తండ్రికి చేరును. ఆ తండ్రియే రాక్షసుడైయున్నచో ఈ కుమారుడు శ్రాద్ధమున ఇచ్చిన అన్నము అతనికి తగిన భోగముగా అందును. పశువుగా ఉన్న వానికి గడ్డియై అందును. పామయియున్న వానికి గాలియై చేరును. యక్షులై యున్న పితరులకు పానీయమై గ్రద్దగానున్న వారికి మాంసమయి దనుజులైయున్న వారికి మాయగా అయి పిశాచము లుగా అయి యున్న పితరులకు రక్తపానీయమయి మనుష్య జన్మము పొంది యున్న పితరులకు అన్నము పానము భోగము రసద్రవ్యములునయి వారివారికి చేరును.

ఆనందానుభవము శక్తి స్త్రీలు కాంతి భోజ్యద్రవ్యములు భుజించు శక్తి దానము చేయు శక్తి విభవము దూపము ఆరోగ్యము ఇవి అన్నియు శ్రాద్ధపు పూవులు-బ్రహ్మత్వ ప్రాప్తి ఫలము. మానవులు జరిపిన శ్రాద్ధమువలన ప్రీతినొందిన పితృదేవతలు శ్రాద్ధకర్తకు ఆయువును పుత్రులను ధనమును విద్యను స్వర్గమును మోక్షమును సుఖములను రాజ్యము కూడ ఇత్తురు. కౌశిక గోత్రమునందలి బ్రాహ్మణులు (లేదా కౌశికుని కుమారులు) శ్రాద్ధము పితృదేవతలకు తృప్తి కలిగించినందువలన తత్ఫలితముగా ఐదు జన్మలతోనే మోక్షమును పొంది విష్ణు స్థానమును చేరుకొనిరి అని పరంపరలో వినబడుచున్నది.