కర్మయోగము

ఋషులు సూతు నిట్లడిగిరి, “మనువు ప్రశ్నించగా మత్స్యరూప విష్ణువు అతనికి తెలిపిన పరమోత్తమమమగు ధర్మాధర్మ విస్తరమును తెలుపుము. ఈ చెప్పిన విధమున ఏకార్ణవమయిన జలమునందుండిన మత్స్యరూప జనార్దనుడు సూర్యపుత్రుడగు మనువునకు మొదట ఆదిసర్గము ప్రతిసర్గము మొదలగునదంతయు-అనగా వంశ-మన్వంతర-వంశాను చరితములను కూడ- తెలిపియుండెను. అతడు వాటితోపాటు కర్మయోగమును సాంఖ్య (యోగ) మును ఉన్నదియున్నట్లు సవిస్తరముగ చెప్పియుండెను అని విందుము. (వానిలో సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశాను చరితములను నీవలన వింటిమి.) ఇక ఇప్పుడు కర్మయోగ లక్షణమును వినగోరెదము. ఏలయన నీవు సువ్రతుడవు. (యథావిధిగ గురు శుశ్రూష చేసి అన్ని విషయముల నెరిగినవాడవు.) లోకమునందు నీకు తెలియనిది ఏ కొంచెమును లేదు.”

సూతుడిట్లు చెప్పనారంభించెను, శ్రుతులయందు చెప్పబడిన విధమున మీకు కర్మ యోగమును తెలిపెదను. (అది తెలిసికొనవలసినదే) ఏలయన వేయి జ్ఞానయోగముల కంటెను కర్మయోగము మేలయినది. కర్మయోగము ననుష్ఠించుట వలననే జ్ఞానము కలుగును. జ్ఞానము వలన పరమపదము-పరమాత్మ తత్త్వము-లభించును. కనుక కర్మము వలనను జ్ఞానము వల నను బ్రహ్మము లభించును. కర్మాచరణము లేనివారికి జ్ఞానము లభించదు. కావున కర్మ యోగము నాశ్రయించినవాడు శాశ్వతతత్త్వమును పొందును. వేదము అంతయును దాని తత్త్వమును ఎరిగినవారి ఆచరణమును ధర్మమునకు (ధర్మ కర్మల ననుష్ఠించుటకు) మూలము. ఆ ఆచారమునందును ఎనిమిది ఆత్మగుణములు ప్రధానములు. సర్వభూతములయందు దయ- ఎన్ని బాధలయందును ఓర్పు లోకము విషయమున అసూయ (దోషారోపబుద్ధి) లేకుండుట- దేహమునను చిత్తమునను పవిత్రత-అక్కరలేని శ్రమ పడకుండుట-శరీరమున శుభలక్షణమును వేషమును కలిగియుండుట-లేని ద్రవ్యముల విషయమున కాని సంపాదించిన ద్రవ్యముల విషయమునకాని పిసినిగొట్టుతనము లేకుండుట-పర ద్రవ్యము లందును పరస్త్రీల విషయము నందును కోరిక లేకుండుట (దయ- క్షాంతి-అనసూయ-శౌచము-అనాయాసము-మంగళ్యాచార సేవనము-అకార్పణ్యము-అస్పృహ) అనునవి ఈ ఎనిమిది గుణములు. ఇట్టి నడువడియే క్రియాయోగము-ఇది జ్ఞాన సాధకము. ఇది లేనిచో అది లేదు. ప్రయత్నపూర్వకముగా ప్రతియొక రును శ్రుతి స్మృతి ప్రోక్తమగు కర్మల నాచరించుచుండ వలయును.

గృహస్తునకు ఇంటి పనులలో ప్రాణి హింసకు కారణములై పాపము కలిగించునవి ఐదు; అవి: కత్తిపీట-తిరుగలి-పొయ్యి-నీటికడవ-చీపురు అనునవి; వీనిని పోగొట్టుకొనుటకై అతడు హోమములచే దేవయజ్ఞము శ్రాద్ధములచే పితృయజ్ఞము వేదాధ్యయనముచే ఋషి యజ్ఞము అన్నదానముచే మనుష్యయజ్ఞము భూతములకు బలి (నూకలు మొదలగునవి) వేసి భూత యజ్ఞము అను పంచయజ్ఞములను దేవర్షి పితృ తర్పణములను చేయవలెను. ముప్పది సంస్కారములు పొందినవానికైనను ఈ చెప్పిన ఆత్మ గుణములు లేనిచో మోక్షమురాదు. తనకున్న ధనముతో గోబ్రాహ్మణులకు శుభము కలిగించవలెను. గోవులు భూమి హిరణ్యము వస్త్రములు గంధమాల్యములు మొదలగువానితో బ్రాహ్మణులను పూజించవలెను. బ్రహ్మ, విష్ణు, భాస్కర, రుద్ర, వసురూపుడగు శివుని (పరమాత్మను) యథావిధిగా శ్రద్ధాపూర్వకముగా మత్సరము లేకుండ (మరియొకరితో పోటీపడక) వ్రతములు ఉపవాసములు మొదలగునవి ఆచరించుచు అర్చించుచు ఉండవలెను. అతీంద్రియుడు శాంతుడు సూక్ష్ముడు అవ్యక్తుడు సనాతనుడు జగజ్జన్మ కారణుడు నగు వాసుదేవుని నుండి రూపొందిన తత్త్వములే బ్రహ్మ విష్ణు శివ రవి వసుగణ రుద్ర గణాదిత్యగణములు సప్త పితృ గణములు సప్త మాతృకలును చరాచరములగు సర్వభూతము లును. అవ్యక్త తత్త్వమగు పరమేశ్వరుడు అధిపతిగాగల ఈ విశ్వమునకు బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యులు వేళ్ళవంటివారు. కనుక వారిని పరస్పరము అభిన్నులనుగాను వారిని పరమేశ్వరునితో అభిన్నులనుగాను ఆరాధించినచో చరాచర విశ్వమును ఆరాధించుట యగును. బ్రహ్మాది మూర్తి త్రయమును రవియందు రూపొందియున్నారు. కనుక ప్రయత్నముతో విధి విధానమున రవి ఉపాసించవలయును. అగ్నిముఖ ద్విజముఖములు చేసి (అగ్నియందు ఔపాసనము కాని దేవ సన్నిధిలో దీపము వెలిగించుటకాని చేసి బ్రాహ్మణుని పూజించి ఆతని నోటితో వేదమంత్రములు చెప్పించుచు) దాన వ్రతోపాసన జప హోమాదులతో వీరి నారాధించవలెను.

ఇట్లు క్రియాయోగ పరాయణుడై వేదాంత శాస్త్రమునందును స్మృతి విధానములందును ఆసక్తి కలిగియుండు వానికి ఇహపర లోకములందు పొందరాని దేదియు లేదు.