పితృగాథా వర్ణనము

మత్స్యుడు మనువునకు ఇట్లుచెప్పెను. ఈ చెప్పిన ఋషివంశములందు జనించిన విప్రుల యందు శ్రాద్ధము జరుపుట పితృప్రీతికరము; శ్రాద్ధములందు ఈ ఋషిగోత్రములందు జనించిన వారిని భోక్తలనుగా నియమించవలయును. ఇక ఇపుడు పూర్వము స్వపుర (స్వలోక) మందుండి పితరులీ విషయమున కీర్తించిన గాథలను వినిపింతును.

సుశీతల బహుతోయములగు నదులయందు మాకు జలాంజలి నిచ్చువాడును సమాహిత చిత్తుడై తేనెతో నూవులతో కూడిన జలాంజలి నిచ్చువాడును పాలు-మూలములు, ఫలములు, భక్ష్యములు, తిలజలము, ఖడ్గమృగ మాంసము కాలవాకము త్రయోదశినాడు తేనెతో, నేతితో పాయసము వర్షఋతువు నందు మాఘానక్షత్ర దినమందు కాలశాక (బలుసు కూర) మహా శాకము (పెరుగు తోటకూర)లు తేనె నీవారాన్నములు, కొమ్ములు లేని ఖడ్గమృగముల మాంసము గ్రహణ కాలమున గయయందు యోగులకు (తద్రూపులగు పితరులకు) ఖడ్గ మాంసము, గజచ్ఛాయాదినమందు మాంసము వీనితో శ్రాద్ధము జరుపువాడు మాకులమందు జనించిన ఎంతయో బాగుగనుండును. ఇట్టి శ్రాద్ధము వలన మాకు కల్పాంతము వరకును తృప్తి కలుగుననిన అన్నిటితో చేసిన దాని వలన ఇంకెంత తృప్తికలుగునో చెప్పవలయునా?

కృష్ణాజినమునుగాని ప్రసవించు ధేనువునుగాని, దానమిచ్చువాడును వృషోత్సర్గము చేయువాడును శ్రద్ధతో సువర్ణ దానగోదాన పృథివీ దానములు చేయువాడును కూపారామ తటాక వాపీ ప్రతిష్ఠలు చేయువాడును సర్వభావముతో విష్ణువు (సర్వాంతర్యామి) దేవేశుడు మధుసూదనుడు అగు హరిని శరణు వేడువాడును విద్వాంసుడు, విచక్షణుడు (వివేకి) ధర్మ శాస్త్రములను యథావిధిగా విద్వాంసులకు దానమొసగు వాడును మా వంశమునందు జనించవలయును అని పితరులు గానముచేసిరి. మనురాజా! ఇది మునులు ఉపదేశించిన శ్రాద్ధకల్పము- పాపహరము; పుణ్యవర్ధనము; లోకముల యందు ప్రధానత్వమును కలిగించును.