మత్స్య మహా పురాణము
జ్యోతిర్మండల వ్యవస్థ
ఈ విధముగా రౌమహర్షణి చెప్పి దివ్యకథను సూర్యచంద్రమసుల-సర్వగ్రహముల సంచారమును వేరువేరుగవిని ఋషులతనితో ఇట్లనిరి. ఈజ్యోతిస్సులు అన్నియు రవి మండలము నందు ఏ వ్యూహమును (అమరికయు) లేకయే ఒకదానితో మరియొకటి సంకరము (వ్యవస్థలేని కలయిక) నొందక సంచరించుచున్నవి? ఎవరైన వీనిని త్రిప్పుచున్నారో స్వయముగ అవియే తిరుగున్నవో ఎట్లు తిరుగుచున్నవో- ఇదియంతయు తెలియగోరుచున్నాము. పండితోత్తమా! మాకు అదితెలుపుము. ఈవిషయము భూతములకే సంమోహమును కలిగించు నది. కాని నీవు విషయమును తెలుపగల వారందరిలో శ్రేష్ఠుడవు. కావున మాకది తెలుపవలయును. అనగా సూతుడు వారికి ఇట్లు చెప్ప నారంభించెను.
అవును; ఇది మీరనినట్లు భూత సంమోహనమే. ప్రత్యక్షముగ కనబడుచుండియు ఇది భూతములను సంమోహింప జేయుచున్నది.
ఇదుగో! ఈ శింశుమారము (శిశుమారము) వేదములందు చెప్పబడినట్లు పదునాలుగు ఋక్షములపై (జ్యోతీరూపములపై) వ్యవస్థ చేయబడి కనబడుచున్నదే! ఈ శిశుమార చక్రమునకు మేధముగా ద్యులోకమున ఉత్తానపాద పుత్రుడుగా పురాణములందు పేర్కొనబడిన ధ్రువుడున్నాడు. (అతడు పేరునకు తగినట్లు కదలడను కొనవలదు.) అతడు తాను (తనచుట్టు) తిరుగుచునే చంద్రాదిత్యులను ఇతర గ్రహములను త్రిప్పుచున్నాడు. ఇతర నక్షత్రములును తిరుగుచున్న ఆ ధ్రువుని చుట్టు తామును భ్రమించుచు చక్రమును చుట్టుచు భ్రమించు ఇతర చక్రములవలె తిరుగుచున్నవి. ధ్రువుని మనస్సంకల్పాను సారము ఇట్లు తిరుగుచున్న ఈ జ్యోతిర్గణము వాత సమూహమయములగు పాశములతో (కట్టబడి) ధ్రువము (కదలనిది)ఐ అతని వెంట తిరుగుచున్నది. వాని భేదము (వేరగుట) యోగము (కలయిక) కాల ప్రమాణానుసారము వాని సంచారము ఉదయాస్తమయములు ఉత్పాతములు దక్షిణోత్తరాయనములు విషువములు గ్రహవర్ణములు ఇవి అన్నియు ధ్రువుని మూలముననే కలుగుచుండును.
మేఘముల నుండియే జీవులు ఉత్పన్నములగును కావున వానికి ‘జీ(వ)మూతములు’ అని పేరు. సప్త వాయువులలో రెండవదగు అవహ వాయువు నాశ్రయించి మేఘములుండును. ఇక్కడి (మన భూమి) నుండి ఒకటియు ముప్పావు యోజనము దూరమున అవి నిలిచి వానను భూమిపయి వదలుచుండును. దానికే ధారా-ఆసారము- ఈ మొదలగు నామములు,
ఇవికాక పక్షములు మొలచియున్న పుష్కరా వర్తకములను మేఘములు కలవు. మహా సామర్థ్యము కలవగు పర్వతముల పక్షములను ఇంద్రుడు-అవి కామ సంచారములును సమృద్ధి కలవియును నగుటచూచి భూతహితమునకైన రకెను. (కాని ఈపుష్కరా వర్తకముల రెక్కల నతడు నరుకలేదు.) పుష్కరము అనగా నీరు; అవి తోయ(జల) ధారులై బృంహణము (ప్రాణి పోషణము) చేయును కావున వానికి పుష్కరావర్తకములని వ్యవహారము (ఆవర్తకములు-సంపూర్ణముగా వర్తనమును-జీవనమును-కలిగించునవి.) ఇవి నానారూప ధరములును మహాఘోర ధ్వని యుతములును; అవి కల్పాంతమున వానలు కురిసి ప్రళయాగ్ని నుపశమింపజేయును. కాని ఇవి సృష్టిస్థితి కాలములందు వాయు వశమున కొట్టుకొనిపోవుచు వానలనీయక కల్ప ప్రవృత్తిని సాగించుచుండును. లోకమున సాధారణముగా అండము పగులగా ఏర్పడిన కుండ పెంకులను కపాలములందురుగదా! అట్లే ఏ అండమునందు ప్రభువు (సృష్టి వ్యాపార సమర్థుడు) చతుర్ముఖుడునగు బ్రహ్మ గర్భస్థ శిశువుగా నుండి చివరకు దానిని చీల్చుకొని ఉత్పన్నుడయ్యెనో ఆ అండపు కపాలములే మేఘములయ్యెను. అట్టి మేఘము లెన్నియున్నను అన్నిటికిని సమానముగా అప్యాయనము కలిగించునది ధూమము. మేఘములన్నిటిలో శ్రేష్ఠములు పర్జన్యుడును నాలుగు దిగ్గజములును; (మేఘములును దిగ్గజములును వేరుగదా యనిన) గజములు మేఘములు భోగులు (సర్పములు) వీని కన్నిటికిని మూలతః కుల మొక్కటియే; ఈరువాత ఈ కులము రెండయినది. (నాగములు అనునది ఆ రెండవ కులము కావుననే గజములకును సర్పములకును నాగమని వ్యవహారము) వీనికన్నిటికిని జన్మకారణము నీరు ఒక్కటియే. ఈ పర్జన్యుడు వర్షర్తువు నందు నీరు ఇచ్చుచు మేఘుడుగా నుండును. హేమంతర్తువులో ఇతడే శీతము కలిగించును. ఇవి మరింత వృద్ధినొందినచో మంచువానను కురియించును. ఇట్టి పుష్కరావర్తక పర్జన్యాధికమునకు వాయువులలో ఆరవది యగు పరివహవాయువు ఆశ్రయము.
ఆ పరివహ వాయుభగవానుడే ‘త్రిపథగా’ ‘ఆకాశమున పోవునది’ అని ప్రసిద్ధయు దివ్యామృత జలపూర్ణయు త్రిపథమునకు (అంతరిక్షమునకు) ఉపరిస్థానమున ప్రసరించుచు ఇదిగో! ఈ అవకాశమున కానబడుచున్న గంగను భరించు (క్రిందకు పడకుండ నిలిపి పట్టు) చున్నాడు. అతడు స్రవింపజేసిన జలమును దిగ్గజములు తమ లావగు తొండములతో తుంపురులనుగా వదలుచుండును. ఆ తుంపురుల సముదాయపు రూపమునే నీహారమనుచున్నాము.
హేమకూట పర్వతమునకు దక్షిణమునను హిమవంతమునకు ఉత్తరమునను కల ప్రదేశము నందు-ఆగ్నేయమున-పుర్ద్రూ అను నగరము ఉన్నది (ఇది పూర్వముండెడిది.) ఈ చెప్పిన తుషారవర్షము ఆ నగరము వరకు వ్యాపించి నిలిచిపోవును. అక్కడినుండి హిమపాతమునకు మూల హేతువగు ఈ వాయువు హిమముతో హిమవన్మహాగిరిని తడుపుచు ఆ నీహారమును దక్షిణమునకు తెచ్చును. హిమవత్పర్వతమును దాటి దక్షిణమునకు వచ్చిన ఈ వాయువు వర్షము తన శేషాంశముగా కలదగును. ఈ వృష్టి తక్కువదయియు వృద్ధికరము; (వానలను కురియించును.) అంతరిక్షమున మేఘముల ఉనికి తీరును. వానివలన ప్రాణులకు కలుగు ఆప్యాయన (సంతృప్తి) ప్రకారమును మీకు తెలిపితిని.
వాన కురియుటకు సూర్యుడే మూలము అని పెద్దలు సముపదేశించుచున్నారు. కాని వస్తుతః వర్షము-వేడిమి-హిమము-రాత్రింబవళ్ళు-సంధ్యాకాలములు-ఇవన్నియు ధ్రువుని నుండియే ప్రవర్తిల్లుచున్నవి. ధ్రువుడు అధిష్ఠాతగా ఉన్ననే రవియు వాన కురియించుచున్నాడు. సర్వభూత శరీరములందును ప్రాణములకు కూడ నీరే ఆశ్రయము. స్థిర చర ప్రాణులన్నిటి యందును ఆనీరు (అదృష్టమగు అగ్నిచే) దహింపబడగా అది ఆవిరిగా అయి బయటికి పోవును. (ఇదియే మరల నీరుగా మారినపుడు) ఆయా ప్రాణులు సాస్రములు (న-అస్ర-కన్నీటితో కూడినవి) అయినవనుచున్నాము. ఇది నీటి యొక్క స్థానభ్రంశము (ఒక స్థితిని విడిచి మరియొక స్థితిని పొందుట) మాత్రమే. రవి సర్వభూతముల నుండియు తేజోమయములగు తన కిరణములతోను సముద్రమునుండి మాత్రము వాయు సహకృతములయిన తన కిరణములతోను ఈ జలమును గ్రహించుచున్నాడు. తరువాత అతడు తన తెల్లని కిరణములతో తెల్లని జలములనుగా ఆ నీటియావిరిని పరివర్తించి మేఘముల కందించుచున్నాడు. తరువాత వాయు ప్రేరణచే మేఘముల యందంత వరకున్న నీరు క్రిందపడును. ఇట్లు ఆరు మాసములపాటు రవి సర్వభూత వృద్ధికరముగా అంతయో ఇంతయో వానలు కురియించుచుండును. వాయువు మూలమున ఉరుములును అగ్నివలన మెరుపులును కలుగును. మిహ్-అను ధాతువునకు తడుపుట- నీరు చిందించుట అని అర్థము. నీరు చిందించి తడుపునది కావున (మేహ>మేఘ) మేఘము అనబడును. (వాయుశక్తిచే నిలుపబడి) క్రిందికి జారిపడదు కావున అభ్రము అని ఈ మేఘములకు పేరు (న+భ్ర>భ్రంశ్)-అభ్ర-(కాని వాస్తవమున-అప్-భ్ర > అబ్-భ్ర > అ(బ్) భ్ర > అభ్ర- నీటిని మోయునది).
ఇట్లు ధ్రువుడు తనపై అధిష్ఠాతగా ఉండుట చేతనే (ధ్రువుని శక్తి రవియందు నిలిచి యుండుటచే) సూర్యుడు వృష్టికి స్రష్ట-వాన కలిగించువాడు-అగుచున్నాడు. ధ్రువుడు తనకు అధిష్ఠాతగా ఉండుటచేతనే వాయువు వర్షమును ఉపసంహరించగలుగుచున్నది. ధ్రువుడు అధిష్ఠాతగా ఉండుట చేతనే నక్షత్రమండలము (కుజ బుధ గురు శుక్ర శనులకు తారాగ్రహములని శాస్త్ర వ్యవహారము) నిరంతరముగా రవి సంచరించెడి త్రోవలో రవితోపాటు అతనికి విధేయులవలె సంచరించుచుండును. ధ్రువాధిష్ఠానము చేతనే అవి తమతమ నియతరాశి సంచారానంతరము రవియందు ప్రవేశించుచున్నవి.
అనంతరము పెద్దలు సూర్యరథ సన్నివేశమును ఈవిధముగ చెప్పుచున్నారు. నిలువుగా నిలిచియున్న (ఒక్కటి యేయైనను పడిపోకయున్న) ఒకే చక్రము-ఆచక్రమునకు ఐదు అరలు- (ఆకులు)-పృథివ్యంతరిక్ష ద్యులోకములు అనెడు మూడు నాభులు-(చక్రపు మధ్యస్థానములు- కుండలు) బంగారుతో చేసిన మిగుల సూక్ష్మమగు అణి (చక్రపుచీల) ఎనిమిది చక్రములతో ఏర్పడిన ఒకే ఒక నేమి (చక్రపు పట్టా) కలిగిన ఇట్టి ఏకచక్రమగుచు తీవ్రముగా ప్రసరించగల ప్రకాశమాన రథముతో సూర్యుడు సంచరించుచుండును. ఆ రథపు నడిమి విస్తారము పదివేల యోజనములు. రథపు ఉపస్థ ప్రదేశము (నడిమి విస్తారము)నకు రెట్టింపు కాడి పొడవు; ప్రయోజనవశ దృష్టితో ఈ రథమును బ్రహ్మ (వేదము) సృష్టించెను. (సృష్టియందలి ఆయా తత్త్వములను ఆయా రథాంగ ప్రత్యంగములనుగా వేదము రూపించుచున్నది.) ఈ రథము దేనికిని అంటకయే నడుచు బంగారు రథము. ఛందస్సులు అనెడి శీఘ్రగాములగు అశ్వములు ఈ రథమున పూంచియున్నవి. ఈ స్యందనము దాని చక్రమునకు అనుగుణముగ (నిట్టనిలువుగా)నున్నది. దీని లక్షణములు వరుణ రథ లక్షణములతో సమానములు. ఈ రథముతో భాస్కరుడు అనుదినమును ద్యులోకమున సంచరించుచుండును.
వాస్తవ స్థితిని ఆలోచించగా రవి రథపు అంగ ప్రత్యంగములన్నియు సంవత్సరావయవములతో కల్పింపబడినవే. (ఇచ్చట సంవత్సరమునకు అవయవములుగా లోక వ్యవహార ప్రసిద్ధము లగు అవయవములు మాత్రమేకాక వేదములందు సంవత్సరాత్మక ప్రజాపతికిని ఆ ప్రజాపతిని ఆరాధించు విధానమునకును అంగములుగా చెప్పిన వానినిగూడ గ్రహించ వలయును. ) అది ఎట్లనగా-సంవత్సరము చక్రము; పంచ సంవత్సరాత్మక యుగమున ఉండెడి సంవత్సరము- పరివత్సరము-ఇదావత్సరము ఇద్వత్సరము వత్సరము అను ఐదు భేదములును ఐదు ఆకులు; వసంత గ్రీష్మ వర్షా శరచ్ఛిశిరములనెడు ఐదు ఋతువులును ఐదునేములు-ఐదు పూటీలు- రాత్రి వరూథము (రథమును కాపాడుటకు అమర్చిన దారుమయమైన పంజరము) ధర్మము (యజ్ఞము) నిట్టనిలువుగా ఎగురుచున్న ధ్వజము; అర్థ కామములు రెండును కాడికొనలు; ‘కాష్ఠా’ అను కాలావయవ విశేషములు ఆ రథమును లాగెడి ఏకైకాశ్వపు ముక్కు; క్షణమను కాలావయవ విశేషములు ఆ అశ్వపు దంతపంక్తి, నిమేషము లనెడు కాలావయవ విశేషములు అనుకర్షము అను రథావయవము; కలా అనెడు కాలావయవ విశేషములు ఈషా (ఏండి) అనెడు రథావయవము. కాడి కట్టుటకుపయోగించు నిలువు దూలము వంటిది. ఇట ‘ఏరో అశ్వో వహతి సప్తనామా’ అను శ్రుతి ననుసరించి అశ్వము ఒకటియే అయినను అది ఏడు పేరులతో ఏడు గుర్రములుగా నున్నది; గాయత్రి-త్రిష్టుప్ -జగతీ-అనుష్టుప్పంక్తి-బృహతీ-ఉష్టిక్ అను ఏడు ఛందస్సులే వాయువేగము గల ఏడు గుర్రములు.
సూర్యుని రథపు చక్రము అక్షమునందు బిగింపబడియున్నది; అక్షము ధ్రువుని యందిమిడి యున్నది. ఈ మూటిలో చక్రముతోపాటు అక్షమును అక్షముతోపాటు ధ్రువుడును తిరుగుచున్నారు. వాస్తవమున ధ్రువుని ప్రేరణతో అక్షము చక్రముతోపాటు తిరుగుచున్నది.
విషయ ప్రతిపాదనమును ప్రయోజనముగా దృష్టియందుంచుకొని రవి రథ సన్నివేశ మంతయు రూపింపబడి ప్రతిపాదింపబడినది. ఆవిధముగ కాలావయవముల సంయోగ భావముతో భాస్కరరథ (రూప)ము సిద్ధించుచున్నది. ఆ రథముతో సూర్యదేవుడు అంతరిక్షలోకము నుండి ద్యులోకమునకు సంచరించుచుండును. (అనగా రవి మండలము భౌతికముగా అంతరిక్ష మందే కనబడు చున్నను ఆదేవుని ఆధిదైవతరూపము ద్యులోకస్థాయి అని తెలియవలెను.)
రవి రథపు కాడికిని అక్షమునకును గల దక్షిణపు కొనలు ఏవి కలవో -వానికిగల పగ్గములు పట్టి ధ్రువుడు తన రథమును త్రిప్పుటను బట్టి రవి సంచరించుచుండును. ఆకాశమున ఇట్లు మండలాకార భ్రమణములతో తిరుగు రవి రథమున భానుమండలము అన్ని దిక్కులకును గిరగిర తిరుగు కుమ్మరిసారెవలె కనబడుచుండును.
ఎప్పుడును క్రమించు (ముందుకుసాగు)చునే యుండు రవి రథపు కాడి -అక్షముల కొనలు వాయుతరంగ ప్రేరితములగుచు మండల రూపమున అన్ని దిక్కులందును సంక్రమించు (వ్యాపించు)చుండును. ఈ సూర్యరథపు యుగ కోట్యక్షకోటులయందు బిగించియున్న రశ్మి ద్వయము (రెండు పగ్గములు)ను మండల (భాగల-లేదా డిగ్రీల) గణనమున చుట్టుకొనుచు మరల విప్పుకొనుచు ఉత్తరాయనమున పొట్టివగును. దక్షిణాయనమున పెద్దవగును. ఇవి ధ్రువునిచే బిగించి పట్టుకొనబడుచు వదలబడుచు తద్వశమున రవి రథమును వేడెక్కించుచుండుటే ఇందులకు హేతువు.
ఈరెండు రశ్ము (పగ్గము)లను ధ్రువునిచే అధిష్టితములయి సమస్థితికి వచ్చుచున్నట్లును లాగబడును. ఉత్తర దక్షిణ దిశల అర్ధవృత్తములు నూట ఎనుబది మండలములు (భాగలు- డిగ్రీలు) అగును. రథ యుగ కోట్యక్ష కోటులయందలి పగ్గములను ధ్రువుడు సడలించి వదలగా రవి వెలుపలగా సంచరించును; లాగిపట్టి చుట్టివేసినపుడు లోపలగా సంచరించును. దానిని బట్టి రవి వేగమునందు శీఘ్రత్వమందత్వ భేదములు ఏర్పడును. దానిని బట్టి ఉత్తరాయన దక్షిణాయనము లేర్పడును అని సారాంశము.