మత్స్య మహా పురాణము
ఉభయతోముఖీ గోదానము
మనువు మత్స్యుని ఇట్లడిగెను. అపుడే ఈనుచున్న ధేనువును బ్రాహ్మణోత్తమునకు దానము చేయవలసిన విధానమును దాన ఫలమును ధర్మజ్ఞా! తెలుపవేడెదను. అనగా నారాయణుడు ఇట్లు తెలిపెను: ప్రసవించుచున్న ధేనువును బంగరు కొమ్ములతో వెండిగిట్టలతో ముత్తెముల తోకతో కంచుతో చేసిన పాలు పిదుకు పాత్రలతో ఆ దూడతో కూడ బ్రాహ్మణ పుంగవునకు దాన మిచ్చినచో మహాపుణ్యఫలము లభించును. దూడ యోనియందే యుండి ఇంకను గర్భమును విడువనంతవరకు ఆ ప్రసవించు గోవు పర్వతవన కాననాదులతో కూడిన సర్వ పృథివితో సమాన. ఇట్టి ధేనువును ధనముతో కూడ దానము చేయుట సర్వసముద్ర శైల తద్గుహావన కానన సహితమయి చతురంత (నాలుగు సముద్రములు హద్దుగాగల) భూమిని దానము చేయటతో సమానము. దానిచే ఆదూడకెన్ని రోమములుండునో అన్ని మహాయుగములు దాత దేవలోక మందుండును. భూరి దక్షిణలతో ఈ ప్రసూయమాన ధేను దానము చేసినచో వాని పితృ పితామహ ప్రపితామహులు నరకము నుండి తరింతురు. అతడు వెళ్ళిన చోటనెల్ల నేయియు పాలును చిక్కని పెరుగును పాయసమును ప్రవహించు నదులును కోరికలను ఒసగు వృక్షములును కాచిన బంగారువంటి దేహచ్ఛాయయు విశాలములగు పిరుదులును సన్నని గుండ్రని నడుములును పద్మముల వంటి నేత్రములునుగల స్త్రీలును లభింతురు. (ఈనుచున్న ఆవునకు వెనుక నుండి దూడముఖము ఉండుటచేతను అవి రెండును ఒకటిగా ఉండుట చేతను ఈ గోవు ఉభయతోముఖీ + రెండు వైపుల ముఖముగలది)