మత్స్య మహా పురాణము
కాలనేమి విజయము
శ్రీమత్స్య నారాయణుడు మనువునకు ఇంకను ఇట్లు చెప్పెనని సూతుడు ఋషులకు వచించెను. దానవుల సేనల నడుమ కాలనేమి మహాసురుడు వృద్ధినందిన తన మహా తేజస్సుతో నిండియు తన వర్ణముచే గ్రీష్మాంతమున వర్షాసమయా రంభమందలి మేఘమువలె కనబడుచుండెను. త్రిలోకాంతర్భాగమున నిండియున్న అతనిని చూడగానే ఆ దానవేశ్వరులందరును ఉత్తమమగు అమృతమును త్రాగినందుచేతవలె శ్రమయంతయు తిరిలేచిరి. మయుడు తారుడు మొదలగు దానవులు ఆ జరుగుచుండిన తారకామయ సంగ్రామమున అంతవరకు ఎడతెగని జయముతో ప్రకాశించుచుండినట్లే ఇపుడు ఏమాత్రమును భయ సంత్రాసములు లేక యుద్ధముచేయగోరుచు ప్రకాశించిరి. వర్షా కాలమందు విజృంభించిన దట్టమగు మేఘముల వంటి ఆ దానవులు కొందరు మంత్రములను ఆవృత్తి చేయుచుండిరి. మరి కొందరు వ్యూహములందు అటునిటు పరుగెత్తుచుండిరి. వారికందరకును ఈకాలనేమిని చూచిన కొలది హర్షమధికమగు చుండెను. మయుని సహచరులలో ఆ యుద్దమున అగ్రగాములును ముఖ్యులును అగు దానవులందరును ఏ మాత్రమును భయము లేక హర్షముతో నిండి యుద్ధము చేయుటకై సిద్దులయి నిలిచిరి. మయుడు తారుడు వరాహుడు వీర్యశాలియగు హయగ్రీవుడు విప్రచిత్తి దానవుని కుమారుడగు శ్వేతుడు ఖరుడు లంబుడు బలి పుత్రుడగు అరిష్టుడు కిశోరుడు దేవతల లోని వాడువలె ప్రకాశించువాడును నోటితో యుద్ధము చేయువాడునగు రాహు మహాసురుడు - ఈ దానవులందరును అస్త్రవేత్తలును, కార్యనిపుణులును అగువారు, వీరందరును తమకే ఆశ్చర్యము గొలుపుచున్న ఆ కాలనేమి దగ్గరకుపోయి అతనిని పరివేష్టించి ఉండిరి.
వారు బరువయిన గదలు చక్రములు రథములు గండ్రగొడ్డండ్రు యమదండముల వంటి ముసలములు వడిసెలలు ముద్గరములు కొండలవంటి రాళ్లు భయంకరములగు గండ శైలములు (పెద్దపెద్ద బండలు) పట్టిసములు భిండివాలములు ఉత్తమమగు ఉక్కుతోచేసిన పరిఘులు బరువగు ఘాతనీ ఆయుధములు శతఘ్నులు కాండ్లు - వదులుటకు సిద్ధముగా ఉంచిన యంత్రములు భయంకరముగా దెబ్బకొట్టు బాణములు, పొడవయి యొప్పు భుజములు ప్రాసములు పాశములు మూర్ఛనములు, నాలుకలు క్రోయుచున్న సర్పములు ప్రాకుచున్న పాములవలె కనబడు మెలికల శరములు ప్రహరించుటకు పనికివచ్చు చక్రములు ప్రకాశించు తోమరములు ఒర నుండి తీసి యుంచిన తీక్ష్ణ ఖడ్గములు, తెల్లని నిర్మల శూలములు కలిగి దైత్యులు చురుకయిన మనస్సులతో ధనువులు పట్టి నిలిచిరి. ఇట్లా మహా యుద్ధమున దైత్యసేన ప్రకాశించు ఆయుధ శ్రేష్ఠములుదాల్చి కాలనేమిని ముందుంచుకొని నీల మేఘములు క్రమ్మగా పూర్ణముగా మూతపడిన ఆకాశమువలె (కారు నలుపుతో) ప్రకాశించెను.
చంద్ర సూర్యుల తెల్లని, నల్లని కనుపాపలతో కూడి వాయు వేగము కలిగి సౌమ్యమయి తారాగణములు పతాకలు కాగా మేఘములను వస్త్రములుదాల్చి, గ్రహములతో నక్షత్రములతో నవ్వుచు దేవసేన ప్రకాశించుచుండెను. శక్రుడు పాలించుచుండ యమ ఇంద్ర వరుణకుబేరులు కాపాడుచుండ అగ్ని తన సదనములందు (వేదికలందు) ప్రకాశించుచుండ నారాయణుడు పరమశరణమైయుండ ఆ సేన సముద్ర జలరాశివలె దివ్యరూపముతో ఒప్పుచుండెను. వారికిని అస్త్రములు కలవు. యక్ష గంధర్వులు (తమ చేష్టలతో) పరులకు భయము గొలుపుచుండిరి. అంతలో ఆ రెండు సేనలును ప్రళయకాలమందు భూమ్యంతరిక్షములు తారసిల్లినట్లు పరస్పర మెదుర్కొనెను. దేవదానవులకు జరిగిన ఆ యుద్ధము సంకులమును ఘోరమును అయి క్షమా పరాక్రమములకును దర్పవినయములకును జరుగు రణమువలె నుండెను. అందు దేవతలును దానవులును ఇరు సేనలనుండియు తూర్పు పడమటి సముద్రములనుండి వెలికివచ్చి కలియు మేఘములవలె వెలికివచ్చి తారసిల్లిరి. వారుకోపావిష్ణులును భయంకరులును అయి యుండిరి.
దేవతలును దానవులును అటువంటి రెండు సేనలతో కూడి పర్వతములందలి పూచిన వనద్వయముతో కూడిన గజములవలె అందముగా కనబడుచు సంచరించుచుండిరి. అంతలో భేరులను మ్రోగించిరి. అనేకములగు శంఖములను పూరించిరి. ఆ ధ్వనితో భూమ్యాకాశములును దిక్కులును నిండిపోయెను. అల్లెత్రాటిని కంపింపజేయుటచే కలిగిన ధ్వనులును ధనువులు కూతలును దుందుభుల ధ్వనులును దైత్యుల (అరపుల) ధ్వనులను తమయందు ఇముడ్చుకొనెను. వారు పరస్పరము ఎదుర్కొనిరి; పడవేసికొనుచుండిరి. భుజములతో భుజములను విరుగగొట్టు కొనుచుండిరి. మరికొందరు ద్వంద్వయుద్ధముచేయగోరి సిద్ధమగుచుండిరి. దేవతలు దానవులపై ఘోరములగు వజ్రములను (పిడుగులను) మేలగు ఉక్కుతో చేసిన పరిఘులను ఖడ్గములను బరువగు గదలను యుద్ధమునందు ప్రయోగించుచుండిరి. దానవులు గదాపాతములతో అవయవములు విరిగి బాణములతో ముక్కలయి మిక్కిలిగా పడిపోవుచుండిరి. మరికొందరు చంపబడుచుండిరి. ఇంకను కొందరు ఎదురు నిలిచి దేవతలనే కొట్టుచుండిరి. వారు శీఘ్ర గమనముగల రథములతోను అశ్వములతోను విమానములతోను సంచరించుచు రోషావిష్ణులై ఆవేశముతో పరస్పరము తలపడి పోరుచుండిరి. పెదవులను కొరుకుచు వికృతముఖములతో వారు రణమున భయంకరులుగా నుండిరి. రథికులు రథికులతో పదాతులు పదాతులతో పోరుచుండిరి. ధ్వని జనకములగు ఆ దేవదానవ రథముల తుముల శబ్దము శ్రావణ భాద్రపద మాసములందు కలుగు వర్షాకాల మేఘముల ధ్వనివలె నుండెను. కొందరు రథములను విరుగగొట్టిరి. కొందరును రథములు విరుగగొట్టెను. కొందరు ఇరుకు ప్రదేశములందు చిక్కుకొని రథములను కదలించలేకుండిరి. కవచధారులగు వీరులు కొందరు ఒకరినింకొకరు పైకెత్తి వేయుచుండిరి. మరికొందరు తమ ఆభరణములు ధ్వని చేయుచుండ కత్తులు పలకలు (డాళ్ళు) ధరించిన వీరులను కూడ కొట్టుచుండిరి. కొందరు అస్త్రముల దెబ్బలుతిని రక్తము క్రక్కుచు చచ్చుచు వర్షాకాలమున నీరు వర్షించు మేఘములవలె కనబడుచుండిరి. ఆ దేవ దానవులకు తుములయుద్ధము అస్త్రశస్త్రముల అల్లికతో ఎత్తి విసరబడుచున్న గదలతో క్రుద్ధులయిన దేవ దానవులతో భయంకరమయి ఒప్పెను. అట్టి ఈ యుద్ధమున దానవులు మహామేఘములును దేవతలు ప్రయోగించు ఆ యుధములు ఇంధ్ర ధనువులుగా పరస్పర ప్రయుక్త శస్త్ర ప్రయోగములు వర్షముగా దుర్దినమయి మేఘములాకస మావరించిన దినమయి ప్రకాశించెను.
ఇంతలో కాలనేమి మహాసురుడు సముద్రజలములు త్రావిన మబ్బువలె వృద్ధిపొందెను. మెరుపులవలె చంచలమయి మెరియు ఆభరణములు కల అవయవము నుండి ప్రజ్వలించు పిడుగులను వర్షించుచు ఏనుగుల వంటివియు పర్వత మంతటివియు మేఘములు వెలువడసాగెను. క్రోధమువలన శ్వాస వదలుచున్న వాని ముఖము నుండి కనుబొమల ముడులను చెమటను వర్షించుచు పొగలతో నిండి అగ్నితో కూడిన జ్వాలలు బయటకు రాసాగెను. వాని బాహువులు ఆకసమునందు అడ్డముగను నిలువుగను పెరుగుచు పర్వతము లందుండి వెలువడు ఐదుతలల సర్పములవలె కనబడుచుండెను. బహు విధములగు శస్త్రజాలములును ధనువులును పరిఘలును ఆకసము నందంతటను నిండి ఉన్నత పర్వతములవలె కనబడుచుండెను. వాడు అందు గాలికిచెదరి ఎగురుచున్న వస్త్రముతో యుద్ధకాంక్షియై సంధ్యాకాలపు ఎండతో వ్యాప్తమైన శిలలుగల సాక్షాత్ మేరు పర్వతమో అనునట్లు ఒప్పుచుండెను. వాడు తన తొడల ఒత్తిడిచే నలుగగొట్టుచుండిన పర్వత శిఖరాగ్రములతోను వృక్షములతోను వజ్రముతో (ఇంద్రుడు) మహాగిరులను వలె దేవతలను పడగొట్టుచుండెను. ఇట్లు కాలనేమిచే తగులు దెబ్బలతో సురలు అనేక శస్త్రములతో ఖడ్గములతో తమ తలలు పగులగా, కేశములు తెగిపోగా బాధపడుచు కదలనైన లేకుండిరి. కొందరు వాని పిడికిళులతో గ్రుద్దబడియు మరికొందరు చీల్చబడియు పడిపోయిరి. దేవతలు తామెంత పరాక్రమ వంతులయినను కాలనేమి వలన కలిగిన భయముతో తెలివి తప్పినందున ఆ సమరమునందు ఏయత్నమును చేయలేకుండిరి. సహస్రాక్షుడగు శక్రుడును వానిచే శరబంధనములతో బంధితుడై ఐరావత గజముపై కదలలేకుండెను.
వరుణుడును వానిచేత తినిన దెబ్బలతో జలరహిత మేఘమువలెను జలమెండిన సముద్రమువలెను ఏమియు చేయజాలకుండెను. కామరూపుడు అగు ఆ కాలనేమి విశ్రవః ప్రజాపతి కుమారుడు అగు కుబేరుని పరిఘలతో చావమోది ధనదుడు (విత్తమును ఇచ్చువాడు) అనుయోగ్యతకు దూరముచేసెను. సర్వుల ప్రాణములను హరించు మృత్యురూపుడగు యముడును వాని దెబ్బలుతిని యముడుగా తనకుగల యోగ్యతను కోల్పోయి తన(దక్షిణ) దిశకు పారిపోయెను. వాడట్లు లోకపాలురను తరిమి వారివారి అధికార కృత్యములను హరించి తన దేహమును నాలుగు దిక్కులందును నాలుగుగా నిర్మించెను. వాడు రాహువు తనకు చూపిన దివ్యనక్షత్ర మార్గమునకు పోయి సోముని లక్ష్మిని (కాంతిని - ఐశ్వర్యమును - అధికారమును) అతని పాలన మహాదేశమును హరించెను. వాడు స్వర్గద్వారము నుండి భాస్కరుని తరిమివేసి అతనికి గల ఆయనములను పగళ్ళను ఏర్పరచు అధికారమును తన అధీనముగా చేసికొనెను. దేవతలకు ముఖము (నోరు) అగు అగ్నిని వాయుదేవుని తన శక్తితో జయించి తన ఇచ్చ చొప్పున నడుచునట్లు చేసెను. వాడు తన వీర్య బలములతో సర్వములగు నదులను సముద్రమును తన దగ్గరకు రప్పించుకొని తన ముఖమునందు (తన ఎదుట - తన అధీనములో) ఉండునట్లు చేసికొనెను. సముద్రములన్నియు వానిదేహమయ్యెను. భూమ్యంతరిక్ష ద్యులోకములం దెక్కడెక్కడ నున్న జలమును తన వశమున నడుచుకొనునట్లు చేసి వాడు భూమినంతను తన ఆజ్ఞలో నడుచు పర్వతములతో భద్రపరచి కదలకుండునట్లు చేసెను. వాడు తాను స్వయంభూ బ్రహ్మయు మహాభూతపతియు నైనట్లు ప్రకాశించుచు సర్వలోకమయుడై సర్వభూత భయంకరుడై ప్రకాశించుచుండెను. ఇట్లు లోకపాలైక శరీరుడు చంద్ర సూర్యాది గ్రహరూపుడు వాయ్వగ్ని శరీరుడునై ఆయుద్ధము నందా దానవుడు ప్రకాశించు పరమేష్ఠి బ్రహ్మస్థానమునందు నిలిచి లోకముల ఉత్పత్తికే తాను మూలకారణుడై ప్రకాశించుచుండగా దేవతలు బ్రహ్మను స్తుతించు నటుగా దైత్యులు వానిని స్తుతించిరి.