అంకుశేశ్వర తీర్థాది మహిమానువర్ణనము

మార్కండేయుడు ధర్మజునకు ఇట్లు చెప్పెను. తరువాత అంకుశేశ్వరమను ఉత్తమ తీర్థము; అచటి ఆ అంకుశేశ్వరుని దర్శించినంతనే సర్వపాపముక్తుడగును; తరువాత నర్మదేశ్వర తీర్థము; ఈ ఉత్తమ తీర్థమున స్నానముచే స్వర్గలోక ప్రాప్తియగును; తరువాత అశ్వతీర్థము; అటకేగి స్నానమాచరించినచో చూచుటకు ఇంపగు రూపము కలుగును; భోగవంతుడగును; స్త్రీలకు ప్రీతిపాత్రుడగును; తరువాత పూర్వము బ్రహ్మస్వయముగా నిర్మించిన పైతామహ తీర్థము; అందు స్నానమాడి భక్తితో పితరులకు పిండదానముచేసి తిలదర్భ విమిశ్రమగు జలముతో తర్పణము వదలినచో ఆ తీర్థ ప్రభావమున ఆ పితృ కార్యమక్షయ ఫలప్రదమగును; తరువాత సావిత్రీ తీర్థము; దానియందు స్నానమాడినవారు బ్రహ్మలోక ప్రాప్తులగుదురు. అచ్చటనే మనో హరమును పరమశోభనమునగు మనోహరతీర్థము గలదు; అందు స్నానమాడినచో పితృలోక ప్రాప్తిచే సుఖించగలరు; తరువాత మానసతీర్థము. అందు స్నానమాడినచో రుద్రలోక ప్రాప్తి యగును. తరువాత అనుత్తమమగు కురుతీర్థము. అది త్రిలోక విశ్రుతమును సర్వపాప ప్రణాశ నమును. లోకమునందు మానవులు పశుపుత్ర ధనాదికములను వేటిని వేటిని కోరుచుందురో అవన్నియు ఈ తీర్థమున స్నానమాడినచో సిద్ధించును. తరువాత ఉత్తమమగు త్రిదశ జ్యోతిస్థీర్ణము, అందు ప్రసిద్ధులగు ఋషికన్యలు (కొందరు) మంచి వ్రత నియమముల నవలంబించి తమ కందరకును లోక ప్రభుడును అవ్యయుడునగు ఈశ్వరుడు పతి కావలయునను సంకల్పముతో తపమాచ రించిరి. అంతట మహాదేవుడగు హరుడు వారిని మెచ్చి ప్రశస్తమగు (పలాశ) దండ మును ధరించి బ్రహ్మచారియై వికృతమగు మొగము కలిగి అసహ్యము గొలుపు రూపముతో వచ్చెను. అయిననువారు పరమేశ్వరుని (గుర్తించి) వరించిరి; ఋషి కన్యలమగు మేము దేవ దేవుడగు శివునకు పత్నులుగా దానము ఈయబడవలయును అని తపమాచరించిన ప్రదేశ మగుటచే దీనికి ఋషి (దశ) కన్యా తీర్థమను నామము ప్రసిద్ధమయ్యెను. ఇందు స్నానమాడి శివు నర్చించినచో సర్వపాప ముక్తియగును.

తరువాత స్వర్ణబిందు తీర్థము; అందు స్నానమాడిన వారికి దుర్గతి కలుగదు; తరువాత అప్సరస్ తీర్ధము; ఇందు స్నానమాడిన వారు నాగలోకమును పొంది అప్సరసలతో సుఖింతురు, తరువాత(ఆ)నరక తీర్థము; అందు స్నానమాడి శివునర్చించినవారికి నరకప్రాప్తి యుండదు; తరువాత భారభూతి తీర్థము; ఇందు స్నానమాడి ఉపవాసమాచరించి, శాంభవ అవతారమగు విరూపాక్ష దేవుని అర్చించినచో రుద్రలోక ప్రాప్తులగుదురు; ఈ భారభూతి తీర్థము నందు స్నానమాడినవారు మహాత్ములు; ఏలయన-వారు ఇందేకాక మరి ఎచ్చట మరణించినను గణే శ్వరులుగా అయి శివసాన్నిధ్య మందుట నిశ్చయము. ఇచ్చట కార్తీకమాసమున మహేశ్వరుని అర్చించినచో అశ్వమేధమునకు పదింతలుగా ఫలము కలుగునని విద్వాంసులందురు, అందు నేతిదీపములు నూరు వెలిగించినచో సూర్య సమానప్రకాశ విమానములపై శంకరుని సన్నిధి కేగును; శంఖమువలె మొల్లపూవువలె చంద్రునివలె తెల్లనగు వృషభమును ఇచ్చట దానమిచ్చినచో రుద్రలోక ప్రాప్తుడగును; ఈ తీర్థమున గోదాన మొకటియైన చేసినను తేనెతో పాయసముతో కూడ వివిధ భక్ష్యములను యథాశక్తిగా బ్రాహ్మణులను భుజింప జేసినచో ఈ తీర్థ ప్రభావమున ఈ పుణ్య కార్యములలో ప్రతియొకటియు కోటిగుణితమగు ఫలమును ఇచ్చును; ఈతీర్థము నాశ్రయించి యుండి ప్రాణత్యాగము చేసినవాడు శంకరలోకమున కేగును; ఇచట నర్మదా జలముత్రావి వృషధ్వజుని అర్చించినచో దుర్గతి కలుగదు; ఈ తీర్థమున (ప్రాణ త్యాగమునకై) జలప్రవేశము చేసినచో హంసలను పూంచిన విమానముపై రుద్రలోకమేగును, చంద్ర సూర్యులు హిమాలయము మహాసముద్రము గంగానది నదులు ఉన్నంత వరకు స్వర్గ లోకమున సుఖపడును; నిరాహారతావ్రతముతో ఇచట ప్రాణత్యాగము చేసిన వారికి పునర్జన్మ ముండదు.

తరువాత ఆషాఢీ తీర్థము; ఇది ఉత్తమము; అందు స్నానమాడినచో ఇంద్రుని అర్ధాసనము లభించును. తరువాత స్త్రీయాతీర్థము. ఇది సర్వపాప ప్రణాశకము. ఇందు స్నానమాత్రముచే గణేశ్వరుడై రుద్రలోకమున సుఖించును. తరువాత ఐరండీ (ఉపనది) నర్మదా నదుల సంగమపు తీర్థము. ఇది లోక విశ్రుతము. ఇందు అనుదినము స్నానము చేయుచు వ్రతపరాయణుడై ఉప వాసము చేయుచుండినచో బ్రహ్మ హత్యాదోష ముక్తియగును. (ఈ పేరు లోగడ కూడ వచ్చినది). తరువాత నర్మదా సాగరసంగమ తీర్థము. దీనికే జామదగ్న్య తీర్థమనియు నామాంతరము. ఇచట జనార్దనుడు సన్నిహితుడై యుండును. అతడిచ్చట సిద్ధినందెను. ఇచ్చట బహుయజ్ఞము లాచరించి నందుననే ఇంద్రుడు దేవాధిపతి కాగలిగెను. ఇందు స్నానమాడిన నరుడు అశ్వమేధ ఫలమునకు మూడింతల ఫలమందును. ఇది పశ్చిమ సముద్రపు సంధియందు ఉన్నది. సర్వ ద్వారమును తెరచు పవిత్ర ప్రదేశమిది. ఇచట దేవగంధర్వ ఋషి సిద్ధ చారణాదులు ప్రాతర్మ ధ్యాహ్న సాయంసంధ్యలయందు దేవేశుడగు విమలేశ్వరుని ఆరాధింతురు. ఇందు స్నానమాడిన వారు రుద్రలోక ప్రాప్తులగుదురు. ఈ విమలేశ స్థానముకంటె గొప్పదియగు తీర్థము ఇదివరకు లేదు. ఇకముందుండదు. ఇచట ఉపవసించి విమలేశ్వరుని దర్శించినవారు సప్త జన్మకృతమగు పాపముల నుండి ముక్తులయి శివస్థానముచేరి సుఖింతురు.

తరువాత కౌశికీ తీర్థము. ఇది ఉత్తమము. ఇందు స్నానమాడి శ్రద్ధతో ఒక అహో రాత్రము ఉపవసించి నియమపరుడై ఆహార నియమము పాటించినచో ఈ తీర్థ ప్రభావమున బ్రహ్మహత్యా దోష మోచనమగును. ఇచట సర్వ తీర్థస్నానము చేసిన పుణ్యఫలమునిచ్చు సాగరేశ్వర తీర్థముకలదు. ఇచట సాగరేశ్వరుడను శివుడున్నాడు. ఈశివుడు సముద్రము నుండి యోజనము లోపలగా సముద్ర జలపు సుడుల నడుమనున్నాడు. ఆ తీర్థమును అందలి విమలేశ్వరుని దర్శించినచో సర్వతీర్థ దర్శనము చేసినట్లే యగును. తత్ఫలముగా సర్వపాప ముక్తియగును.