మత్స్య మహా పురాణము
విశోక సప్తమీ వ్రతము
ఈశ్వరుడిట్లనెను: మునిపుంగవా! ఇట్టిదేయగు విశోక సప్తమి విషయము చెప్పెదను: ఈ సప్తమినాడు ఉపవాసమున ఎప్పుడును శోకమునందుడు. మాఘశుక్ల పంచమినాడు దంతధావన పూర్వకముగా తిల (చూర్ణము-తైలము)లతో స్నానముచేసి పులగము మాత్రము తిని ఉపవసించి రాత్రియందు బ్రహ్మచర్యము పాటించవలయును. తెల్లవారి లేచి స్నాన జపములు చేసి శుచియై ‘అర్కాయ నమః’ అను మంత్రముతో ఎర్రని కరవీర పుష్పములతో రవిని పూజించి ఆయనకు ఎర్రని వస్త్ర ద్వయము నర్పించవలెను. “మూడులోకములకు విశోకత్వము (శోకము లేకపోవుట) కలిగించు ఆదిత్యా! నాకును విశోకత్వమును జన్మజన్మములందును నీయందు భక్తిని ప్రసాదింపుము” అను మంత్రముతో ప్రార్థించుచు షష్టినాడు రవిని పూజించి బ్రాహ్మణులను కూడ పూజించవలెను. ఆనాడు గోమూత్రము మాత్రము ఆహారముగా గడపి రాత్రి నిద్రించిలేచి సప్తమి నాడుదయము నిత్యానుష్ఠానము ముగించుకొని విప్రుల నన్నదానపూర్వకముగా ఆరాధించి ఆ వస్త్ర ద్వయమును బంగారు పద్మమును బ్రాహ్మణున కీయవలయును. మౌనవ్రతముతో తైలలవణ రహితముగా భుజించి పురాణశ్రవణముతో అనాడు గడుపవలయును. ఇట్లు చేయుటచే సుఖమును ఐశ్వర్యమును కలుగును.
ఈ విధానమున అది మొదలు ప్రతి మాసమున పక్షద్వయమునను మరల మాఖశుక్ల సప్తమి వచ్చువరకు చేయవలయును. వ్రతాంతమున సువర్ణకమలముంచిన కలశమును అన్ని పరికరములతోడి మంచమును పాన్పును పాడి కపిల గోవును దానము చేయవలెను.
ఈ విధమున విత్త శాఠ్యము (ధనలోభముతో కొంటెతనము) చేయక ఈ విశోక సప్తమీ వ్రతమును చేయువాడు ఉత్తమగతి చెందును. వేయినూరుకోట్ల (కోటి×1000x100) జన్మముల కాలము శోకరహితుడై అమృతత్వానందమును పొందును. కోరికతో చేసినవానికి కోరినదెల్ల సిద్దించును. నిష్కాముడై చేసినవానికి పరబ్రహ్మ పదము లభించును. దీనిని చదివినను వినినను ఇంద్రలోకమునందును. విశోకుడగును.