విష నిర్హరణోపాయము

ధర్మ విద్వరుడవగు మత్స్య ప్రభూ! రాక్షస-విషనాశకములగు వేనిని రాజు తన దుర్గమున నిలుపుకొనవలయునో తెలుపుమనిన మనువుతో మత్స్యుడు ఇట్లనెను. బిల్వాటకీ, యవక్షారము, పాటలా, బాహ్లికము, ఊషణము, శ్రీపర్ణి, నల్లకి ఈ అన్నిటితో కాచిన కషాయమును సవిష పదార్థములపై చిలుకరించినచో అవి నిర్విషములగును; యవలు సైంధవము పానీయములు వస్త్రములు శయన సామగ్రి ఆసన సామగ్రి, ఉదకము, కవచములు, ఆభరణములు, ఛత్రములు, వింజామరములు, నివాస గృహములు, ఇట్టివి విష సంయుక్తము లయ్యెననిపించినచో వాటిపై ఈ కషాయమును చల్లవలయును. శేలువు, పాటలీ, అతివిష శిగ్రువు, మూర్వా, పునర్నవ, సమంగా, వృషమూలము, కపిత్థము, వృషము, శోషితము, సహదేవ, హరిద్ర, ఇవియు విష నాశకములు; లాక్ష, ప్రియంగువు, మంజిష్ఠ ఏలా, హరేణుకా అతి మధురము. ఇవి ముంగిస పిత్తముతో కలిపి భావనచేసి ఎద్దుకొమ్ములో ఈ మిశ్రమును పోసి దాని నేడు అహోరాత్రములు నేలలో పాతిఉంచి తీసి దానిని పూసలుగా చేయవలెను, వానిని బంగరు దారములో గ్రుచ్చి చేతికి కట్టుకొనిన విషయుక్త పదార్థములను తాకినను అవి వెంటనే నిర్విషములగును; మనో హ్వయా శమీపత్రము, తుంబికా, శ్వేతసర్షపములు, కపిత్థము కుష్ఠము మంజిష్ఠా. ఇవి కుక్క పిత్తముతోగాని కపిల గోపిత్తముతో గాని నున్నగా అరగదీసి పూసినచో ఇదియు ఒక విధమగు విషనాశకమగు ఔషధమగును; మూషికా, జతుకా, ఈ రెండు ఓషధులతో కూడ పైవలెనే పూనలను చేసి హస్తమందు ధరించినను విషహర ఔషధముగా పనిచేయును; హరేణువు, మాంసి, మంజిష్ఠ, మధుకా, మధువు, అక్షత్వక్, సురసము, వీనిని శ్వ(కుక్క) పిత్తములతో వెనుకటివలె గోశృంగములో నింపి భూమియందుంచి తీసి సిద్ధపరచిన పిష్టము పూసిన వాద్యముల (ధ్వనుల)ను వినినను పతాకలను చూచినను వాసన చూచినను సవిష పదార్థములు నిర్విషములగును.

పిప్పలి, మిరియాలు, శొంఠి అను ఊషణత్రయము సాముద్ర లవణ, సైంధవ లవణ, బిడాల లవణ, సౌవర్చల లవణము లనెడు పంచ లవణములు మంజిష్ట పసుపు -మ్రానిపసుపు సూక్ష్మైలా, త్రివృతాపత్రము, వాయువిడంగములు, ఇంద్రవారుణీ, మధుకము, వేతనము, తేనె- ఇవి అన్నియు కలిపి కొమ్ము నందుంచవలెను; దాని నుండి తీసిన మాత్రలను వేడి నీటితో కలిపి సేవించినచో సవిషాహారము జీర్ణమగును; విషములేని దానిని తినినపుడు ఇది సేవించినచో పైత్య దోషము చేయును; శుక్లము సర్జరసము, ఉశీరము, సర్షపములు, ఏలావాలుకములు, సువేగ, తస్కరము, సురము, అర్జున కుసుమములు, వీనిపొగ వేసినచో ఇంటియందలి స్థావర (పదార్థముల) విషమును జంగమ (చరప్రాణుల) విషమును కూడ విరిగిపోవును, ఈపొగ వ్యాపించు చోట కీటకములుకాని విషములుకాని, కప్పలుకాని, నరీనృపములుకాని, అభిచారిక కృత్యముల ప్రభావములుకాని, శక్తిహీనములగును; నెమిలి పింఛము, కొంగ, ఎముకలు, సర్షపములు చందనము, నేయి, వీటి పొగ శయనాసన వస్త్ర గృహములందు వ్యాపించినచో విషమును విరుచును; చందనము పాలచెట్టు, మోదుగుచెట్టుల బెరడు, మూర్వా, ఏలవాలుకము సురసము, నాకులి, తండులీయకము, వీనితో కాచిన కషాయము అన్నివిధములగు (స్నానపానాది) ఉదక కార్యములందును కాకమాచి రసముతో కలిపి వినియోగించినచో విషహరమును హితకరము నగును; గోరోచనము తాళిసపత్రి, నేపాళి, కుంకుమ పూవు, వీని చూర్ణములో తిలకము ధరించినచో విషహారమును హితకరము నగును; గోరోచనము తాళినపత్రి, నేపాళి, కుంకుమ పూవు, వీని చూర్ణములో తిలకము ధరించినచో అతడు విషభాధల నందుడు; నరులకును, నారులకును, నృపులకును ప్రీతిపాత్రుడునగును; హరిద్ర, మంజిష్ఠ, కిణిహి పిప్పలి, వేపచెక్క, వీని చూర్ణముతో పూసిన పదార్థములు సవిషములయినను నిర్విషములగును; సర్వ విషముల స్పర్శనందిన శరీరము కూడ విషదోష రహితమగును.

శిరీష వృక్షపు ఫలము పత్రము పుష్పము బెరడు వేరు- ఇన్నియు గోమూత్రముతో అరగ దీసినచో సర్వవిషహరమగు ఔషధమగును; ఏకవీరుడవగు మనూ! ఇకమీదట మహౌషధులు (అనేక వ్యాధులపై పనిచేయ ప్రసిద్ధ మూలికలు) చెప్పెదను; వినుము; వంధ్య, కర్కోటకి, విష్ణు క్రాంత, ఉత్కట, శతమూలి, సిత, నంద, బల, మోచా, పటోలిక, సోమ, పిండా, పసుపు, దగ్ధ రుహ, మెట్టతామర, విశాలి, శంఖమూలిక, చాండాలీ, హస్తిమగధా, గోజాపర్జీ, కరంభికా, రక్తా, మమారక్తా, బర్హిశివా, కోశాతకీ, నక్తమాలము (కానుగ), ప్రియాలము, సులోచని, వారుణీ, వసుగంధా, గంధనాకులీ, ఈశ్వరీ, శివగంధా, శ్యామలా, వంశనాళిక, జతుకాళీ, మహాశ్వేతా, శ్వేతా, మధుయష్టికా, వజ్రకము, పారిభద్రము, సింధువారము, జీవానందా, వసుచ్ఛిద్రా, నతము, నాగరకంటక, నాలము, జాలీ, జాతీవటపత్రికా, కార్తస్వరము, మహానీలా, కుందురు, హంసపాది, మండూకపర్ణి, వారాహీ, రెండు విధములకు తండులీయకములు (చిర్రి) సర్పాక్షి-లవలి (రాచ ఉసిరిగ), బ్రాహ్మి (సరస్వతి) విశ్వరూపా, సుఖాకరా, రుజాపహా, వృద్ధికరీ, శల్యదా, పత్రికా రోహిణి, నక్తమాల, శొంఠీ, ఆమలకము (ఉసిరిక) వందాకము, నల్ల ఉమ్మెత్త, చిత్రఫల, కాకోలీ, క్షీరకా కోలీ, పీలుపర్ణి, కేశినీ, వృశ్చికాలీ, మహానాగ, శతావరీ, గరుడి, వేగా, నీటికలువ, మెట్టకలువ, మహాభూమిలతా, ఉన్మాదినీ, సోమరాజీ, సర్వరత్నములు, విశేషించి గరుడపచ్చ మొదలగునవి, కీటవక్షములు (పురుగుల రెక్కలు) జీవజాతములు (వేరువేరు క్రిమికీటకాదులు) మణులు-ఇవన్నియు ప్రయత్నముతో సేకరించి నిలువయుంచు కొనవలయును. రక్షస్సులను విషములను కృత్యలను బేతాళులను నశింపజేయు సామగ్రిని విశేషించి నరగజ హయ గోఖర సర్పతిత్తిరి గోమాయు-వస్త్ర- మండూకముల నుండి లభించునవియు సింహవ్యాఘ్ర ఋక్ష మార్జాలద్వీపి వానర కపింజల మహిషముల నుండియు ఇర్రినుండియు లభించునవియు అగు ఈ పదార్థముల సేకరించవలెను; ఇట్టి ద్రవ్యములతో కూడినదై సురక్షితమును అతి శుభ్రమును సర్వగుణయుక్తమును సర్వలక్షణ సహితమునగు గృహమందు రాజు నివసించవలయును.