మత్స్య మహా పురాణము
యయాతి స్వర్గభ్రంశము
ఇంద్రుడు యయాతితో ఇట్లనెను, “నహుషపుత్త్రా! యయాతి రాజా! గృహస్థుడుగా సర్వకర్మములను ముగించుకొని గృహములను విడిచి వానప్రస్థుడవయి వనమును చేరుకొంటివి. అందువలన నిన్నడుగుచున్నాను. తపస్సుచే నీకు సమానుడు మరి ఎవ్వరో చెప్పుము. యయాతి: “వాసవా! దేవతలు మనుష్యులు గంధర్వులు మహర్షులు-ఈ ఎవ్వరి యందును తపస్సుచే నాకు సమానుడు మరి ఎవ్వడును కనబడడు.” ఇంద్రుడు: “నీవు వారివారి వైయక్తిక ప్రభావమును ఎరుగకయే సమానులను అధికులను హీనులనుకూడ అవమానించినావు. కావున ఇవిగో! ఈ నీలోకములన్నియు అంతవంతములు (ముగిసిపోయినవి) అగుచున్నవి. ఇప్పుడే పడిపోవుచున్నావు.” యయాతి: “సురలను, ఋషులను, గంధర్వులను, నరులను అవమానించి నందున నాలోకములన్నియు క్షీణములయినచో ఇంద్రా! సురలోకమునుండి జారిపడియు సత్ జనుల నడుమ పడగోరుచున్నాను.” ఇంద్రుడు “యయాతిరాజా! నీవు జారియును సత్ జనుల నడుమనే పడుచున్నావు. మరలవారివలననే నిలుకడను పొందగలవు. ఈ విషయమును గుర్తునందుంచుకొని మరల ఎప్పుడును సమానులనుగాని, అధికులనుగాని అవమానింపకుము.”
అంతట దేవేంద్రుడే సాక్షాత్ అనుభవించు పుణ్యలోకమునుండి పడద్రోయబడుచున్న యయాతిని చూచి రాజర్షి వరుడును ధర్మమునకు మూలతత్త్వమును (వేదమును వేదమార్గమును) రక్షించువాడునగు అష్టకుడు అతనితో ఇట్లనెను, “నీవు ఎవరవు? యువకుడవు. ఇంద్రుని రూపము వంటి రూపముతో నున్నావు. స్వతేజముతో అగ్నివలె ప్రకాశించుచున్నావు. అగ్నివలెను అర్కునివలెను ద్యుతి కలిగి ఇంతటివాడవు అన నలవికాని నీవు స్వర్ణ పథము నుండి పడుచుండుట చూచి ఈ పడుచున్నది ఏమియో అని అందరమును పరి మోహితులము (ఏమియు తెలియనివారము) అగుచున్నాము. స్వర్గమార్గము నధిష్టించియున్న నీవు రవి విష్ణుల ప్రభావమువంటి ప్రభావము కలిగియున్నావు. ఇట్టి నీవు పడుటకు కారణమగు తత్త్వము ఎరుగగోరి మేమందరమును లేచి నీకు ఎదురు వచ్చుచున్నాము. నిన్ను మేమే మొదట ప్రశ్నించుటకు సాహసించ లేకున్నాము. నీవో-మమ్ములను మీరెవ్వరని అడుగుటయులేదు. కావున ముచ్చటగొలుపు రూపము గల నిన్ను నేనే ముందుగా ప్రశ్నించుచున్నాను. నీవు ఎవ్వరివాడవు? ఎందులకు నీవు వచ్చితివి? దేవేంద్ర సమాన రూపుడవు-గాని నీవు సామాన్యుడవు కావు. నీవు ఏమాత్రమును భయమును విషాదమును మోహమును (ఏమి చేయుటకును తోచకుండుటను) విడువుము. నీవిపుడు సత్ జనుల దగ్గరనున్నావు. ఇంద్రుడు బలాసురునంతటివానిని చంపినవాడే అగుగాక! ఇట్టి నిన్ను అతడును ఏమియు ఎదిరింపజాలడు. అదియుగాక స్వర్గసుఖము నుండి భ్రంశము నొందిన వారికి నిలుకడ చోటయి సత్ జనులు వర్ధిల్లుచున్నారు. నీవో-దేవులతో దేవరాజుతో సమానుడవు. సజ్జనులును సత్ జనులును ఒకచోట పరస్పరము కలిసినచో స్థావర జంగమ రూపమగు ప్రపంచమునకెల్ల ప్రభువులై దానిని రక్షించగలరు. నీవు ఇప్పుడు నీకు సాటివారుగు సత్ జనుల యందు నిలుకడ పొందినావు. కనుక భయపడకుము. చింతింపకుము. వేడిమినిచ్చుటలో అగ్నియు బీజములను విత్తుటకు అనుకూలమగుటలో భూమియు ప్రకాశము నిచ్చుటలో రవియు అభ్యాగతులకు ఆశ్రయమునిచ్చుటలో సజ్జనులును సమర్థులు.”