శ్రాద్ధము జరుపదగిన తీర్థక్షేత్రములు

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి, “ఏ సమయమునందు- అనగా పగటి ఏ అంశమునందు శ్రాద్ధకర్త శ్రాద్ధము జరిపినచో అనంతమగు ఫలము లభించును? ఏ తీర్థము అందుకాని క్షేత్రములందుగాని శ్రాద్ధము జరిపినయెడల బహుఫలము లభించును? తెలుప వేడుచున్నాము.”

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను, అభిజిన్ముహూర్తము రౌహిణ ముహూర్తము ఉదయించు సమయము అగు అపరాహ కాలమున జరిపిన శ్రాద్ధము అనంతమగు ఫలమును ఇచ్చును.

పితృదేవతలకు ప్రీతికరములగు తీర్ధములను క్షేత్రములను పేర్కొని వాటిని గూర్చి సంక్షేపముగా తెలుపుచున్నాను. గయా తీర్థము పితృతీర్థములన్నిటిలో మేలయినది. శుభకర మయినది. అక్కడ దేవదేవులకును ఈశుడుఅగు బ్రహ్మ స్వయముగా సన్నిహితుడై యుండును. తమ పితృభాగమగు కవ్యమును అనుభవింపగోరు పితృదేవతలు గానము చేసిన గాథ (యొక్క అర్థము) ఈ విధముగా నున్నది: “పితరులు అనేకులగు పుత్రులు కలుగవలెనని కోరుకొనవలెను. ఏలయన వారిలో ఒకడైన గయకు పోయి పితృ శ్రాద్ధము జరుపునేమో: అశ్వమేధ యాగమునైన జరుపునేమో! నీల వృషభమును విడుచునేమో!” వారాణసి సదా పితరులకు ప్రియమయినది. దానిని ఎన్నడును పార్వతీ పరమేశ్వరులు విడువనందున దానిని అవిముక్త క్షేత్రము అందురు. వారి నిరంతర సన్నిధివలన అదిభుక్తిముక్తి ఫలములను శ్రాద్ధకర్తకు ఇచ్చును. విమలేశ్వరము ప్రయాగ కటీశ్వరము అను క్షేత్రములును పితరులకు ప్రియములైనవి, పుణ్యకరములైనవి. సర్వ కామములను తీర్చునవి. వటేశ్వర క్షేత్రమునందు వటేశ్వరుడను శివుడు యోగనిద్రతో శయనించియుండు కేశవునితో కూడి నివసించును. దశాశ్వ మేధము - గంగా ద్వారము (హరిద్వారము) నందా లలితా తీర్థములు మాయాపురము (జగన్నాధపురి) (బ్రహ్మసరమను తీర్థము శతద్రు (సట్లెజ్) జలపుమడుగు గంగా గోమతీ సంగమ స్థానము నైమిశము పితృప్రీతి కరములు. గంగాగోమతీ సంగమమున శాశ్వతుడగు యజ్ఞవరాహ విష్ణుడును శూలధారియగు శివుడును సన్నిహితులై యుందురు. అచట బంగారుద్వారము కలదు. అచటి శివుడు అష్టాదశ భుజుడు. విష్ణుచక్రపు నేమి (అంచు) శీర్ణము (శిథిలము) అయిన స్థలమే నైమిశము. ఈ క్షేత్రము నందు యజ్ఞ వరాహమూర్తిని దర్శించినచో విష్ణులోకమును పొందును. కృతశౌచమను మహా రణ్యము సర్వపాప నాశకము. నారాయణుడు నరసింహ రూపమున నున్నాడు. ఇక్షుమతీగంగా సంగమము పితృప్రియమగు తీర్థము. అచట పితృదేవతలు ఎల్లప్పుడును నివసిం చుచుందురు.

కురుక్షేత్రము మహాపుణ్యకరము. అచట సర్వతీర్థములు చేరియుండును. సరయూనది పుణ్యకరమయినది. సర్వదేవతలకును అది పూజ్యమయినది. ఇరావతీ-యమునా-దేవికా కాళీ-చంద్రభాగా-దృషద్వతీ- వేణుమతీ-పారా-వేత్రవతీ నదులును పితరులకు ఇష్టములైనవి. ఇచట శ్రాద్ధము జరుపుటచేత కోటిరెట్లు ఫలితము గలుగును.

నేటికిని మహామార్గము కనబడు జంబూ మార్గము నీలకుండము భద్రసరము మానన సరస్సు అచ్ఛోదా నది -మందాకిని-విపాశా (బియాస్) – సరస్వతీ-మిత్రపదము-వైద్యనాధము శిప్రా (క్షిప్రా) నది-(ఉజ్జయినిదగ్గర) మహాకాలక్షేత్రము కాలంజరము (పర్వతము) వంశోద్భేదము ఫలోద్భేదము – గంగోద్భేదము - భద్రాస్పదము. విష్ణుపదము నర్మదాద్వారము (నర్మదా సాగర సంగమము) ఈ ప్రదేశములందు పితరులకు పిండదానము చేసినచో గయలో పిండదానము చేసినట్లగును. ఈ పితృతీర్థములు స్మరణమాత్రముననే జనుల సర్వపాపములు హరించును. శ్రాద్ధము వలన కలుగు ఫలమింతయని చెప్పనేల? ఓంకారము పితృతీర్థము కావేరీ కపిలా చండవేగా నదీ సాగర సంగమము-అమరకంటకము-వీటియందు స్నానము కురుక్షేత్ర తీర్థము లందు స్నానము కంటెను నూరురెట్లు ఎక్కువ ఫలము నిచ్చును. శుక్లతీర్థ సోమేశ్వర తీర్థములందు శ్రాద్ధము జరిపినను స్వాధ్యాయము చేసినను సర్వవ్యాధులును నశించును. ఇతర క్షేత్రములందు కంటె నూరుకోట్ల రెట్లు ఎక్కువ పుణ్యము కలుగును.

కాయావరోహణ క్షేత్రము చర్మణ్వతీ గోమతి అరుణ - ఔశసన తీర్థము భైరవము భృగు తుంగము గౌరీతీర్థము వైనాయక తీర్థము వస్తేశ్వర తీర్థము పాపహరమను తీర్థము తపతీనది - భూతిదా -పయోష్ఠీ-పయోష్లీ సంగమము మహాంభోది తీర్థము పాటలాతీర్థము నాగ తీర్థము అవంతికా-వేణునదీ-మహాశాలము-మహారుద్రము-మహాలింగము. దశార్ణానది- శతరుద్రాశ తాహ్వా నదులు-విశ్వపదము అంగారవాహికా నది-శోణ ఘర్ఘరములను నదములు-కాళికా వితస్తానదులు-ఈ పితృ తీర్థములు స్నాన, దానములందు ప్రశస్తములు. ఈ తీర్థక్షేత్రము లందు శ్రాద్ధము జరిపినచో అనంతపుణ్యము లభించును.

ద్రోణీనది-వటనది-ధారానది-వీరనది-గోకర్ణము-గజకర్ణము-పురుషోత్తమ క్షేత్రము (జగన్నాధము)-ద్వారము-కర్ణద్వారము-కృష్ణతీర్ధము-సరస్వతీ-మణిమతీ గిరికర్ణికానదులు. ధూతపాప తీర్థము-దక్షిణ సముద్రము ఈ పితృతీర్ధములందు చేసిన శ్రాద్ధము అనంతమగును. మేఖలకమను తీర్థమునందు సర్వాంతర్యామియు శార్జధరుడునగు జనార్ధనుడు స్వయముగా ఎల్లప్పుడు మేఖలయందు సన్నిహితుడై యుండును. (మేఖల=పర్వతపు నిలువుటెత్తులో నడుమ భాగము) మండోదరీ తీర్థము వంశనదీ తీర్థము అమరనాధము మహీశాలనది చిత్రకూటము మర్కోటము జన్మేశ్వరము అర్జునము త్రిపురము సిద్ధేశ్వరము శ్రీశైలము శాంకరతీర్థము నారసింహ తీర్థము మహేంద్రము శ్రీశంకుక్షేత్రము-వీటిని దర్శించినను వెంటనే పాపములన్నియు నశించును. వీటియందు జరుపబడిన శ్రాద్ధము అనంత ఫలమును ఇచ్చును.

తుంగభద్రానది-త్రిసంధ్యాతీర్థము-భీమనదీ-భీమేశ్వర క్షేత్రము-కృష్ణవేణీ-కావేరి- వంజులానది గోదావరి త్ర్యంబక తీర్థము ఇవి ప్రశస్తములగు పితృప్రీతికర తీర్థములు. త్ర్యంబక తీర్థమునందు ఎల్లప్పుడును త్ర్యంబక శివుడు సన్నిహితుడై యుండును. వీటిని స్మరించినను పాపములు వెంటనే నశించును. ఇచట చేసిన శ్రాద్ధము కోటిరెట్లు ఫలమును ఇచ్చును.

శ్రీపర్ణానది-వంశనదీ శివానది-భావతీర్థము-పంచతీర్థము రామేశ్వరము- ఏలాపురము అలంపురము అంగభూతి క్షేత్రము ఆపాణ్డురము-ఆలంబుకము అనోకేశ్వరము ఏకామ్రక్షేత్రము గోవర్ధనము హరిశ్చంద్రము పృథూదక సరస్సు - సహస్రాక్షము హిరణ్యాక్షము కదళీనది- రామచిత్ర-అజితానది- సౌమిత్రి సంగమము-ఇంద్రకీలము మహానాదము ప్రియమాలము- ఇవి శ్రాద్ధము జరుపుటకు ప్రశస్తములు-అధిక ఫలప్రదములు. వీటియందు దేవతలు ఎల్లప్పుడు యుందురు. వీటియందు గానముచేసినచో కోరినకోరికలు కోటి రెట్లుగా ఫలించును.

గోదావరీ నదీ సమీపమునందలి పితృతీర్థమను తీర్థము చాల ప్రశస్తమయినది. ఇచ్చట గోదావరి నది అన్ని చోటులందు కంటే చాల లోతుగా ప్రవహించుచు వేయి శివలింగములతో కూడి ఉన్నది. ఈ తీర్థమునకే జామదగ్న్య తీర్థము అని నామాంతరము. ఇది శ్రాద్ధ కర్తలకు సర్వోత్తమమగు దీర్ఘాయువును ఇచ్చును. ఇచ్చటనే గోదావరీనది ప్రతీకుడను ఋషివలన భయముచే చీలినది. ఇది దేవతల నుద్దేశించి హవ్యములను ఇచ్చుటకును పితృదేవతల నుద్దేశించి కవ్యములను ఇచ్చుటకును కూడ ప్రశస్తమయినది. అందుచే దీనికి అప్సరోయుగ తీర్థము అని పేరు. ఇచట శ్రాద్ధములు కాని అగ్ని కార్యములు కాని (యజ్ఞ హోమాదికము కాని) దానములు కాని చేసినచో నూరుకోట్ల రెట్ల పుణ్యము లభించును.

సహస్ర లింగ క్షేత్రమును రాఘవేశ్వర క్షేత్రమును పితృ కార్యములకు ప్రశస్తములు. ఇంద్రసేనా నది పితృ శ్రాద్ధము విషయమున పుణ్యకరము. పూర్వము నముచి దానవుని చంపినందున పతితుడైన ఇంద్రుడు ఇచట తపస్సాచరించి పుణ్యము సంపాదించి స్వర్గమును పొందగలిగెను. ఇచ్చట మానవులు శ్రాద్ధము జరిపినచో అనంత ఫలము కలుగును.

పుష్కర తీర్థము సాలగ్రామ తీర్థము శోణపాదము వైశ్వానరుడను పేరుగల అగ్ని విశేష మునకు స్థానమగు వైశ్వానరాలయ తీర్థమును దాని సమీపమందలి సారస్వత తీర్థము స్వామి తీర్థము మలందరానదీ కౌశికీనది చంద్రికానది విదర్భానది వైరానది పూర్వము ప్రాఙ్ముఖ ప్రవాహముతో నుండిన పయోష్ఠీనది ఉత్తర వాహినిగా నున్న కావేరి జాలంధర పర్వతము-ఈ ప్రదేశములందు జరిపిన పితృ శ్రాద్ధము అనంత ఫలము నిచ్చును. లోహదండ తీర్థము చిత్ర కూటము వింధ్య-యోగేశ్వరము గంగానదీ తటము కుబ్జామ్రకము ఊర్వశీ పులినము సంసారమోచన తీర్థము ఋణమోచన తీర్థము అద్రుహానము గౌతమేశ్వరము వసిష్ఠ తీర్థము హారీతము బ్రహ్మావర్తము కుశావర్తము హయతీర్థము పిండారకము శంఖాధారము ఘటేశ్వరము బిల్వకము నీల పర్వతము సుగ్రీవము ధరణీతీర్థము రామతీర్థము అశ్వతీర్థము వేదశిరస్తీర్థము ఉద్యవతీనది వసుదతీర్థము ఛాగలాండము బదరీ తీర్థము గణతీర్థము జయంతము విజయము శుక్రతీర్థము శ్రీపతి తీర్థము రైవక తీర్థము శారదా తీర్థము భద్రకాళేశ్వరము వైకుంఠతీర్థము భీమేశ్వరము మాతృగృహతీర్థము కరవీరతీర్థము జలేశ్వరము గౌరీ శిఖరము లకుటీశము కర్దమాలము దండి ముండికరము పుండరీకపురము సప్తగోదావరము-ఇవన్నియు పితృ శ్రాద్ధమునకు ప్రశస్తములగు తీర్థరాజములు. పేరులు మాత్రమే గ్రహించి (వాటి మహిమములను విస్తరింపక) కొన్నికొన్ని పితృ తీర్థములను మీకు తెలిపితిని. అన్నిటిని సంపూర్ణముగా తెలుపుట బ్రహ్మకు కూడ సాధ్యము కాదు.

ముఖ్యముగా-సత్యము దయ ఇంద్రియ నిగ్రహము-ఇవి అత్యుత్తమములగు తీర్థములు. ఇవి కలిగి తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి నడచుకొను వారికి ఇంటియందే పితృ తీర్థస్థానము ఉండును. ఏమయినను ఈ చెప్పిన తీర్థములందు శ్రాద్ధము చేసినచో కోటిరెట్ల పుణ్యము కలుగును. కనుక సర్వ విధముల ప్రయత్నించి తీర్థ శ్రాద్ధమును జరుపవలయును.