నర్మదా తీర్థ మాహాత్య ఫలశ్రుతి

నర్మదా నదికి ఆది స్థానమందున్న అమరకంటక పర్వత ప్రాంతము మొదలుకొని నర్మదా సాగర సంగమమునకు నడుమ పదికోట్ల తీర్థములున్నవి. తీర్థమునకును తీర్థమునకును నడుమ కోట్లకొలది ఋషులును ఉన్నారు. వారందరును అగ్నిహోత్రపరులు. ధ్యానపరాయణులు. విద్వాం సులు. వీరందరును అట ఉండుచు ఈప్సిత ఫలప్రదాత్రియగు నర్మదను సేవించు చుందురు. ఈ నర్మదా తీర్థ మాహాత్మ్యమును ఎవరు శ్రద్ధా భావముతో విందులో పఠింతురో అతనిని ఈ సమస్త తీర్థములును తమయందలి జలముతో అభిషేకించును. అన్ని తీర్థముల యందు స్నానమాడి నంత పుణ్యము లభించును. అతని యందు నర్మదకు ప్రీతికలుగుట నిస్సంశయము. రుద్రుడును మార్కండేయుడును అతనిపై ప్రీతులగుదురు. ఇది వినుటచే చదువుటచే గొడ్రాలికిని సంతతి కలుగును. దుర్భగ (మగని ప్రీతికి నోచుకొనని స్త్రీ) కూడ సుభగ (భర్తకు ప్రీతిపాత్రము) అగును. కన్యకు తగిన భర్తతో త్వరగ పెండ్లియగును. కోరిన కోరికలన్నియు తీరును. ఇందు సంశయము లేదు. బ్రాహ్మణునకు వేదార్థ జ్ఞానసిద్ధియు క్షత్రియు నకు విజయమును వైశ్యునకు ధనలాభమును శూద్రునకు సద్గతియు లభించును. దీనిని మూడు సంధ్యల యందును పఠించు చుండినచో మూర్ఖుడును విద్యావంతుడు అగును. నరకమునకు పోవరు.