మం(యం) త్రేశ్వరాది తీర్థ మహిమ

మార్కండేయుడు ఇట్లు చెప్పెను, నర్మదానది ఉత్తరపు ఒడ్డున యోజన విస్తారముగల మం(యం) త్రేశ్వరమను సర్వపాపహరమగు గొప్ప తీర్థము గలదు; దానియందు స్నానమాడిన వారు ఐదువేల ఏండ్లు కామరూపధరులై దేవతలతోకూడి విహరించుచు సుఖింతురు, తరువాత గర్జనమను తీర్థము, దానియందు స్నానమాడిన మేఘ మొకటి దాని ప్రభావమున ఇంద్రజిత్తను నామమునంది ఉన్నతి పొందెను. తరువాత మేఘ గర్జనమువలె ధ్వనించు మేఘనాద తీర్థము; దాని యందు స్నానమాడి మేఘనాథుడను గణ ప్రమథుడు గణాధిపతి అయ్యెను; తరువాత ఆమ్రాతకేశ్వర తీర్థము; దానియందు స్నానమాడినచో గోసహస్ర దానఫలము కలుగును; తరు వాత ధారాతీర్థము; అది సర్వోత్తమము; దానియందు స్నానమాడి పితరులకు తర్పణము చేసినచో సర్వచింతిత కామసిద్ధి యగును; తరువాత బ్రహ్మ సదా సన్నిహితుడయి యుండు బ్రహ్మావర్త తీర్థము; దానియందు స్నానము బ్రహ్మలోక ప్రాప్తినిచ్చును; తరువాత గాణేశ్వర తీర్థము; అటకేగి నియతుడై నియతమగు ఆసనమున కూర్చుండినచో సర్వపాప విశుద్ధాత్ముడై రుద్రలోక మేగును, తరువాత ఉత్తమమగు కపిలా తీర్థము, దానియందు స్నానముచే సర్వదాన ఫలము సిద్ధించును; తరువాత దేవర్షి గణ సేవితమగు కరంజ తీర్థము, దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తి; తరువాత కుండలేశ్వర తీర్థము, అది ఉత్తమము, అందు రుద్రుడు ఉమతో సదాసన్నిధిచేసి యుండును; అందు స్నానమాడినవాడు దేవతలకును అవధ్యుడగును, తరువాత సర్వపాప నాశకమగు పిప్పలేశ తీర్థము, దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తి; తరువాత ఉత్తమమగు విమలేశ్వర తీర్థము; అందు ఈశ్వరుడు నిలిపిన రమ్యమగు దేవశిల యొకటిగలదు, అచట ప్రాణ త్యాగముచే రుద్ర లోకప్రాప్తి, తరువాత పుష్కరణీ తీర్ధము, అందు స్నానమాడిన వాడు ఇంద్రుని అర్ధాసనమునకు అధికారి అగును. నర్మద సాక్షాత్ రుద్ర దేహమునుండి వెలువడిన నదీ శ్రేష్ఠ, అది స్థిరచర భూతములను అన్నిటిని తరింపజేయగలది అని సర్వదేవాధి దేవుడు మహాత్ముడు అగు ఈశ్వరుడు ఋషులకును విశేషించి మాకును చెప్పియుండెను, నదీశ్రేష్ఠయగు ఈ నర్మదమునులచే స్తుతిం పబడునది, లోకములకు హితము చేయుటకై రుద్ర దేహమునుండి వెలువడినది, ఇది సర్వపాప హరము; సర్వదేవ నమస్కృతము; దేవతాగంధర్వాప్సరోనుతులను అందు కొను నది, పుణ్యజలా! ఆద్యా! సాగరగామినీ! పాపనాశనీ సుందర ముఖీ! దేవీ! ఋషిగణ సేవితా! శంకర దేహనిర్గతా! ధర్మ పోషకులలో మేలగు దానా! సర్వ పవిత్ర వస్తువులను కూడ పావనము చేయుదానా! నర్మదా! నీకు నమస్కారము అను ఈ స్తోత్రమును నిత్యమును శుద్ధ మనస్కుడై పఠించినచో బ్రాహ్మణులకు వేద విద్యయు క్షత్రియునకు విజయమును వైశ్యునకు ధన లాభమును శూద్రునకు సద్గతియు కలుగును. ధనార్థికి ధనమును లభించును; మహేశ్వర దేవుడే స్వయముగ దీనిని సదా సేవించు నన్నచో ఇది బ్రహ్మహత్యా దోషమును కూడ పోగొట్టగలదని వేరుగా చెప్పపని లేదు.