బలి శుక్రుల సంవాదము

పర్వతవన సహితయగు ఉర్వి సంక్షుభితమగుట చూచి బలి శుద్ధుడగు శుక్రుని కృతాం జలియై నమస్కరించి "ఆచార్యా! పర్వత ద్వీపవన సహితయగు మహి కలతచెందుచున్నది; వహ్నులును ఆసుర భాగములను అందుకొనుట లేదు; ఏల?” అనెను; మహామతియు వేద విద్వరుడునగు కావ్యుడు శుక్రుడు చాలసేపు ధ్యానమందుండి దైత్యాధిపతియగు బలితో ఇట్లనెను; జగత్కారణుడు సనాతనుడు పరమాత్ముడునగు హరి ఇపుడు వామనరూపుడై కశ్యపునింట అవత రించినాడు; దానవపుంగవా! అతడిపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు కాబోలును; అతని పాదన్యాస వీక్షోభమున ఈ మహి ప్రచలిత మగుచున్నది; అడ్రులు కంపించుచున్నవి; సముద్ర ములు కలుగుచున్నవి; భూతపతియగు ఈ ఈశ్వరుని భూమి మోయజాలకున్నది? దేవాసుర, యక్ష, గంధర్వ, రాక్షస సమేతయగు పృథివిని పృధివ్యాప్తేజో వాయ్యాకాశములను ఆతడే మోయు చున్నవాడు, మన్వాదులును మహా అసురులను అతడే వహించుచున్నాడు; జగత్కారణుడగు కృష్ణుని మాయ గంభీరమైనది, ఆ మాయ ధార్యధారకభావముతో ఈ జగత్తును పీడించుచున్నది. అసురోత్తమా! అతని నంనిధియందసురులు యజ్ఞ భాగార్హులుకారు, అందు చేతనే ఈవహ్నులు అసుర హవిర్భాగములను గ్రహింపకున్నవి, అనవిని బలి ఇట్లనెను: బ్రహ్మన్! నేను ధన్యుడను; కృతవుణ్యుడను; ఏలయన యజ్ఞపతియే స్వయముగా నా యజ్ఞమున కేతెంచినాడు. నాకంటే గొప్పవాడింకెవడు? ఏ అవ్యయుడు దేవేశుడునగు పరమాత్ముని దర్శింపగోరి యోగులు సదోద్యుక్తులైయుందురో అతడే నాయజ్ఞమునకు రానున్నాడు. యజ్ఞమున హోత ఎవనికి హవిర్భా గము లిచ్చునో, ఉద్గాత ఎవని ఉద్దేశించి గానము చేయునో అట్టి అధ్వరేశ్వరుడు అగు విష్ణుని నేను కాక మరెవ్వరు పొందగలరు? ఇట్టి సర్వేశ్వరుడగు కృష్ణుడు నాయజ్ఞమునకు వచ్చిన ఈ సమయమున నేను ఏమి చేయవలయునో ఆదేశింప ప్రార్థించుచున్నాను.

బలి వచనములు విని శుక్రుడు ఇట్లనెను, అసురా! వేద ప్రామాణ్యానుసారము యజ్ఞ భాగార్హులు దేవతలయి యుండ నీవు దైత్యదానవులను యజ్ఞభాగ భోక్తలనుగా చేసితివి, ఈ దేవుడు సత్త్వగుణాశ్రయుడై లోకస్థితి పాలనములను చేయును. ఇది సృష్టికి తరువాత; అంత మందతడే ప్రజలను తినును. నీమూలమున నతడా విష్ణుదేవుడు స్థితియందు (లోక పాలన కృత్యమందు) ఉన్నాడు. మహాభాగా! ఇది ఎరిగి రానున్నదాని గూర్చి చేయవలసిన యత్నము చేయుము. దైత్యపతీ! అతడు నీకడకువచ్చి నిన్నే అల్ప వస్తువడిగినను ఇత్తునని ప్రతిజ్ఞ చేయకుము. ఫలితము లేని సామ(మృదు)వచనములు పలుకుము. నేను దానము చేయ శక్తుడనుకాను అనుము. ఏలయన మహాసురా! అతడు దేవతల అభ్యుదయమున ప్రవృత్తు డయియే ఇటకు వచ్చుచున్నాడు. అనవిని బలి ఇట్లనెను: బ్రహ్మన్! ఇతరులు యాచించినను లేదని ఎట్లు చెప్పుదును, సంసారదోష రాశ్యవహారియగు హరి యాచించినపు డింకెట్లు మాట అందును. హరి యనగా వివిధములగు ప్రతోపవాసములతో ఆరాధింపబడి అనుగ్రహింపజేసికొనబడువాడు. నన్ను అట్టి గోవిందుడే ‘దేహి’యనుచో నాకు అంతకంటె గొప్పదనమింకేమి యుండును? ఎవని నిమిత్తమయి దమశౌచ గుణాన్వితులగు ఉపాసకులు ఉపహారాదికమర్పింతురో యజ్ఞము లాచరింతురో అట్టి దేవేశుడు నన్ను దేహియని యాచించనున్నాడు; ఇందువలన నేనింతవర ఆచరించినది సుకృతమే అనియు సుతపస్సే అనియు నిశ్చయింపవచ్చును. ఏలయన నేనిచ్చు దానిని ఈశులకును ఈశుడగు హరి స్వయముగ గ్రహించచున్నాడు. గురో! స్వయముగా ఆ ఈశ్వరుడే రాగా నేను నాస్తి అనను. తానై వచ్చిన హరిని నేను వంచించుచో నా జన్మఫలము వ్యర్థమగును. ఈ యజ్ఞమునందు యజ్ఞేశుడగు జనార్దనుడే యాచించుచో ఇపుడు నాశిరమునైన అవిచారితముగ ఇత్తును. ఇతరులు యాచకులుగా వచ్చినను నాస్తి అనని నేను ఈనాడు అచ్యుతుని విషయమున అలవాటు లేని ఆ మాట ఎట్లు పలుకగలను? ధీరులకు దానము వలన ఆపదలు కలిగినను కొనియాడదగినదే. అయ్యా! బాధకారికాని దానము బలము కలది ఎట్లగును. నారాష్ట్రమునందు అసుఖి, దరిద్రుడు, అతురుడు (రోగి), అభూషితుడు, ఉద్విగ్నుడు, పుష్పమాలాది రహితుడు ఎవడును లేడు. ప్రతియొకడును హర్షముతో పుష్టితో సుగంధాను భవములతో తృప్తితో సర్వసుఖములతో ఉన్నాడు. సదాసుఖవంతుడనగు నామాట చెప్పనేల? ఈ మహాపురుషు నందు దానమును వదలి నంతనేయది మహాఫలదమగును. భృగు శార్దూలా! ఈ విషయమును నీయనుగ్రహము వలననే ఎరిగితిని.

గురూ! ఇంత ఎరిగిన నా చేతి దానబీజము జనార్ధనుడను మహాపా(క్షే)త్ర(పొల) మందే పడినచో నాకిక లభించనిదేముండును? ఈతడు నావలన దానమందుకొని దానితో దేవతలకు పుష్టి కలిగించుచో ఈ హరి నాచే యజ్ఞ ద్వారమున ఆరాధితుడై నాయందనుగ్రహము చూపినట్లే అగును. ఈ విధముగ వినియుక్తమగు దాన, ధనము దానిని నేను అనుభవించు నంతకంటె పదిరెట్లు ఫలము ఇచ్చినదగును. అట్టి దానము శ్లాఘనీయము. ఇదియే నిజమగుచో అతడు తన దర్శనము చేతనే నాకుపకారము చేయదలచి వచ్చుచున్నాడనుట నిశ్చయము. ఒకవేళ నేను దేవతల యజ్ఞభాగములను విరోధించుచున్నానను కోపముతోనే నన్ను చంపవచ్చుచున్నాడా! అచ్యుతుని చేత నేను వధింపబడుటయు కొనియాడదగినదే కదా! ఈ విశ్వమంతయు ఎవని యందు గలదో అట్టి హరికి లభించని దేమున్నది? అయినను అతడు నన్ను యాచింప వచ్చుట నాయందలి అనుగ్రహము చేతనే కాని వేరు హేతువుచే కాదు. తన ఇచ్ఛాశక్తి బలముచే సర్వ మును సృజించి తన చేతముతోనే లయమందించు హృషీకేశుడు స్వయముగా నన్ను చంప వచ్చుటకు హేతువు మరింకేమయి యుండునో? కావున నిది యెరిగి గురూ! జగన్నాథుడగు గోవిందుడు వచ్చినపుడు నీవు దానవిఘ్నకరుడవు కారాదు. అని అతడిట్లు అనుచుండగనే జగత్పతి, సర్వదేవమయుడు, అచింత్యుడు అగు హరి వామనరూపధారియై అచ్చటకు వచ్చెను. యజ్ఞవాటమున ప్రవేశించిన ఆప్రభుని చూచి సభాసదులగు అసురులు అతని తేజముచే నిష్ప్రభులై క్షోభమందిరి. ఆ మహాధ్వరమున కచట సమేతులయిన మునులు వేదములు పఠించిరి. బలి తన జన్మమంతయు సఫలమయ్యె ననుకొనెను, ఆట ఏఒక్కడును కలతనందిన వాడే కాని మాటలాడినవాడు లేకుండెను. ప్రతి ఒక్కడును ఆ దేవదేవేశుని తనమనమునందే పూజించెను. అంతట వినీతుడగు ఆ అసురపతిని ఆ మునివరులనుచూచి సాక్షాత్ దేవదేవపతియు, వామన రూపుడు అగు విష్ణుడు ఆ యజ్ఞమును వహ్నిని యజమానుని ఋత్విజులను యజ్ఞ కర్మాధికారము లందున్న సదస్యులను యజ్ఞార్థ ద్రవ్య సంపదలను ప్రశంసించెను. తత్ప్రణమే ఎల్లరును వామనుని విషయమున ప్రసన్నులైరి. యజ్ఞవాటస్థితుడగు ఆ ధీరునుద్దేశించి సాధువాదములు చేసిరి.

ఆనందముచే పులకించి, బలి అర్ఘ్యము చేబూని గోవిందుని పూజించి ఆ దేవునితో ఇట్లనెను: సువర్ణమో రత్న సంఘములో గజములో వస్త్రములో అలంకారములో గ్రామములో సర్వ పర్వతాది సమిత పృథివియో పుష్కలముగ యథేప్సితముగ గ్రహించుము. నీకు ప్రియము అగునది కోరు కొనుము. ఇది కావలయునని యాచించుము. ఇత్తును అని దైత్యపతి అనగా, వామనాకృతియగు ఆ భగవానుడు అచ్యుతుడు ప్రీతినంది చిరునవ్వుతో గంభీరముగ ఇట్లనెను: రాజా! నాకు అగ్ని శాలకుగాను మూడడుగులిమ్ము; సువర్ణ గ్రామ రత్నాదికమును అది కోరువారికి ఇమ్ము. అనగా బలి పురుషోత్తమా! మూడడుగులతో అగునదేమి? నూరడుగులో వేయి అడుగులో అడుగుము. అన వామనుడు ‘దైత్యపతీ! ఆ మాత్రపు ధర్మబుద్ధితోనే కృతకృత్యుడను. నీవు ధనార్థులగు ఇతరులకు అది ఇత్తువుకాని.’ అన విని మహాబాహుడా బలి మహాత్ముడగు వామనునకు పదత్రయమిచ్చెను. దాన జలము తనచేతియందు పడగానే వామనుడు అవామను డయ్యెను. అతడు తత్తణమే సర్వదేవమయ రూపమును చూపెను.

చంద్ర సూర్యులు నేత్రములు-ద్యులోకము శిరము-క్షితి-చరణములు పిశాచులు పాదాంగు ళులు గుహ్యకులు హస్తాంగుళులు విశ్వదేవులు జానులు సురోత్తములగు సాధ్యులు జంఘలు యక్షులు నఖములు రేఖలు అప్సరసలు అశేష జ్యోతిర్గోళములు దృష్టులు సూర్యాం శువులు కేశములు తారకలు రోమకూపములు ఓషధులు రోమము విదిశలు బాహువులు దిశలు చెవులు అశ్వినులు శ్రవణము (ఆ ఇంద్రియ తత్త్వము) వాయువు నాసిక ప్రసాద రూపుడగు చంద్రదేవుడు మనస్సు, సత్యము వాక్కు సరస్వతి, జిహ్వ దేవమాతయగు అదితి గ్రీవ-విద్యలు ముడుతలు స్వర్గద్వారము గుదము త్వష్టయు పూషయు కనుబొమలు వైశ్వానరుడు ముఖము ప్రజాపతి వృషణములు పరబ్రహ్మము హృదయము కశ్యపముని పుంస్త్వము వసువులు పృష్టము మరుతులు సర్వసంధులు సర్వసూక్తములు దంతములు జ్యోతిస్సులు విమలకాంతులు మహా దేవుడు వక్షము మహాసముద్రములు హృదయము గంధర్వులు ఉదరము లక్ష్మీ మేధాధృతి కాంతులును సర్వవిద్యలును కటిదేశము సర్వజ్యోతిః కాంతులును అతని పరమమహ(తేజ)స్సు వేదములు స్తనములును కుక్షియు మహామఖములు ఇష్టులు పశుబంధములు ద్విజులు ఆచరించు కర్మాను స్థానములును ఉదరము ఆ మహాత్మునకయ్యెను.

మహాబలులగు దైత్యులును ఆ విష్ణుని సర్వదేవమయ రూపము చూచినంతనే మిడుతలు అగ్నినివలె ఆ దేవుని సమీపించిరి; ఆ విభుడంతట హస్తపాద తలములతో అసురుల నెల్లరను నలుగగొట్టి మహాకాయ రూపముదాల్చి శీఘ్రమే భూమినెల్ల హరించెను, అతడు భూమినిదాటి విక్రమించుచుండ మొదట చంద్రాదిత్యులు అతని స్తనములనడుమ ఇమిడిరి; అంతరిక్షమును దాటి విక్రమించుచుండ వారే తొడలకడకు వచ్చిరి, అంతకుమించి ద్యులోకమును క్రమ్మి విక్రమించుచుండగా వారే జానుమూలమునకు సరిపోయిరి; మహీపాలా! విష్ణుడుచేసిన దేవరక్షాకార్యమున ఇట్లు జరిగెను : ఉరుక్రముడు (విస్తృత పాదవిన్యాసములు కల) విష్ణుడు లోకత్రయమును నిఃశేషముగ జయించి అసుర పుంగవుల వధించి ఇంద్రునకు త్రైలోక్యమునిచ్చెను, ప్రభవిష్ణుడగు విష్ణు భగవానుడు వసుధాతలాధో భాగమందలి సుతల మనెడు పాతాళాంశమును బలికిచ్చి ఆ సర్వేశ్వరేశ్వరుడా దైత్యేశ్వరునితో నిట్లనెను; నీచే దత్త మయిన సలిలమును నేను నాపాణితో గ్రహించిన దాని ఫలముగా నీకు కల్పప్రమాణముగల ఉత్తమాయువగును, వైవస్వతమన్వంతరానంతరము సావర్ణికమన్వంతరమున నీవింద్రుడ వగుదువు; నేనిపుడఖాల త్రైలోక్యమును దేవరాజున కిచ్చితినిగదా! ఇక డెబ్బది యొక్క చతుర్యుగ ములవరకు నేనతని శత్రువులను నా అదుపులోనుంతును. ఏలయన పూర్వము అతడు పరమభక్తితో నన్నారాధించి యుండెను; నీవంతవరకు నేను నీకిచ్చిన మనోరమమగు సుతల నామక పాతాళముననే నాయాదేశము నేమాత్రమును తప్పకపాలించుచు నట వసింపుము.

దివ్యాంగనాయుతమును ప్రాసాద శత సంకులమును ద్రవికసిత పద్మ సరోయుతమును ప్రవహమాణ నిర్మల నదీయుతమును సుగంధయుత ధూప పుష్పమాలా వస్త్ర చామరాది విభూషి తమును పుష్పమాల, చందనాదులచే సంతోషప్రదమును గాననృత్యములతో మనోహరమును అగు ఆ సుతలమునందు మహాసురా! నీవు వివిధాన్న పానాది భోగములు అనుభవించుచు శతపరివృతుడవయి నేను ఇపుడు చెప్పిన ఈ కాలమంతయు ముగియువరకుండుము, దేవ బ్రాహ్మణులతో విరోధము పూననంతవరకు నీవీ భోగముల అనుభవింతువు; నీవది పూసిననాడు నిశ్చయముగ వారుణపాశములు నిన్ను వధించును, కావున ఇది ఎరిగి దైత్యసత్తమా! నా ఆజ్ఞాను సారము ఈ పొరబాటు చేయకుండుము, దేవదేవుడును ప్రభవిష్ణుడు అగు విష్ణువిట్లు పలుక విని, బలి మోదముతో నమస్కరించి అతనితో నిట్లనెను; భగవన్! నీ యాజ్ఞతోనే పాతాళమున వసించునపుడు నాకు ఈ భోగములను సంపన్నమొనరించు ఉపాదానము (మూలసాధనము) ఏది? అన విష్ణువు ఈ విధముగా పలికెను.

నీవిదివరకు శ్రద్ధతో శ్రోత్రియులయందిచ్చిన దానములును, అగ్నియందు చేసిన హోమము లును, అచరించిన సదక్షిణాక వివిధ యజ్ఞములును అధ్యయనములును వేదవ్రతములును నీకాఫలమును అందజేయుచుండును అని బలికి ఈ వరమునిచ్చి త్రిదివ రాజ్యము నింద్రునకిచ్చి హరి మరల వామన రూపమునంది యనంతరము అదృశ్యుడయ్యెను, ఇంద్రుడు యథాపూర్వముగ పుష్ఠిసంపన్న త్రైలోక్య రాజ్యము నేలెను, బలియు పాతాళమాశ్రయించి ఉత్తమ కామములను అనుభవించెను, ఆ దానవోత్తముడటనే ఆ దేవదేవునిచే బద్ధుడై మరల దేవకార్యము నిర్వహింపనై ఈ జగమునందే వేచి యున్నాడు. మహాభాగా! అర్జునా! ఆ కృష్ణుడే ఇపుడు నీ సంబంధి (బావ మరది)యై దానవ వినాశమును భూభారోత్తారణమును చేయబూని యదుకులమున జన్మించి ద్వారకయందున్నాడు; ఇకముందు నీశత్రులను నిగ్రహించుటకై ఆ బలానుజుడే నీకు సహాయ భూతుడై సారథ్యము చేయును, మహావీరా! అర్జునా! వినగోరిన నీకు ఇట్లు ధీమంతుడగు వామనుని యవతార వృత్తాంతమంతయు తెలిపితిని. అనిన శౌనకునితో అర్జునుడిట్లనెను: విభూ! నేనడిగిన కేశవ మాహాత్మ్యము ఇది నీచే వింటిని; ఇచటి నుండి గంగాద్వారమునకు పోవుదును, అనుజ్ఞను ఇమ్ము అని ముని అనుజ్ఞగోరి ఆర్జును ఏగెను. శౌనకుడును నైమిశారణ్య మునకు పోయెను, ఇట్టి ఈ దేవదేవుడగు వామనరూపి విష్ణుని ఉత్తమ మాహాత్మ్యమును వినువారు సర్వపాపముక్తులగుదురు, బలి ప్రహ్లాద బలి శుక్ర బలి విష్ణు సంవాదములను స్మరించు మానవుడు ఆధివ్యాధిమనోమోహములకు అందడు. రాజ్యభ్రష్టుడు రాజ్యమును ఇష్టజనవియుక్తుడు వారితోడి పొందును. ఈ కథాశ్రవణ ఫలముగా నందగలడు.