మత్స్య మహా పురాణము
ధాన్యాది పర్వత దానములు
నారదుడు ఈశ్వరుని ఇట్లడిగెను, పరలోకమున అక్షయ ఫలదమైనదియు దేవతలును దేవర్షులును ప్రశంసించునదియు మహా మహిమము కలదియునగు ఉత్తమ దానమును తెలుప వేడుచున్నాను. అనగా ఈశ్వరుడిట్లు చెప్పెను, పది విధములగు మేరు (పర్వత) దానము అనునది కలదు. దానిని చేసిన నరుడు సుర పూజితములగు ఉత్తమ లోకములందు సుఖించును. ఇవి చేయుటచే కలుగునంత ఫలము పురాణములను వేదములను అధ్యయనము చేయుటచే కాని వానియందు చెప్పబడిన ఆయా యాగాది పుణ్యకార్యములను చేయుటచేకాని లభింపదు. అవి వరుసగా ధాన్య లవణ గుడ సువర్ణ తిల కార్పాస(దూది) ఘృత రత్న రజత -శర్కరా మేరు (పర్వత) దానములు. క్రమముగా వీని విధానము తెలిపెదను. (ఉత్తర-దక్షిణ) అయనములు- విషువము (దివారాత్ర పరిమాణము నమమగు దినములు రెండు) వ్యతీపాత యోగము అవమ- త్రిద్యుస్పృక్ దినములు-(ప్రతిమాస) శుక్లపక్ష తృతీయ-(చంద్ర-సూర్య) గ్రహణములు- అమావాస్య-వివాహములు-ఉత్సవములు-యజ్ఞములు-ద్వాదశి-పూర్ణిమ -పుణ్య (శుభ) నక్షత్రము ఉన్న దినము-ఈ కాలములందును పుణ్య తీర్థక్షేత్రములు-గోవులు నిలుచు ప్రదేశము- ఇంటి ముంగిలి- వనము-ఇట్టి దేశములందును వీటిని యథావిధానముగ దానము ఈయవలెను.
తూర్పునకో ఉత్తరమునకో వాలుగా ఉండు ప్రదేశమున భక్తితో ఉత్తరమో తూర్పో మొగముండునట్లు చతురస్ర మండపము (పందిరి) ఏర్పరచవలయును. దానియందు గోమయముతో అలికిన ప్రదేశమున దర్భలను పరచవలయును. ఆచోటి నడుమ శాఖా పర్వతము లతో కూడిన ప్రధాన పర్వతమును (మేరువును) నిర్మించవలెను.
(పర్వత నిర్మాణము) 1. ధాన్య పర్వతము: దీనికై కావలసిన ధాన్య పరిమాణము-వేయి తూములు-గాని, ఐదువందల తూములురాని, మూడువందల తూములురాని ఉండవలెను. నట్ట నడుమ మూడు బంగారు శిఖరములు తూర్పున ముత్తెముల వజ్రముల శిఖరము-దక్షిణమున గోమేదక పుష్యరాగ శిఖరము పడమర గరుడ పచ్చల ఇంద్ర నీలముల శిఖరము ఉత్తరమున వైదూర్య పద్మరాగముల శిఖరము ఉండవలెను. మంచి గంధపు కర్రలతోను పగడములతోను చేసిన తీగలు ముత్తెపు చిప్పలతో అమర్చిన రాతినేలలు ఉండవలెను. బంగారుతో చేసిన బ్రహ్మ విష్ణు రుద్ర శివుల ప్రతిమలును సురసిద్ధ ప్రముఖ దేవతల ప్రతిమలును ఈ పర్వతపు పైభాగమున అమర్చవలెను. నాలుగు శిఖరములును నెత్తములును వెండితో చేయవలెను. నానా దిక్కులందును చెరకుగడలతో మూయబడిన గుహలును నేతితో నీటితో అమర్చిన సెలఏరు లును కొండ ఊటలును ఉండవలెను. తూర్పున తెల్లని వస్త్రములు మేఘములుగా అమర్చవలెను. వెండితో చేసిన దిక్పాలకుల ప్రతిమలను ఎనిమిది దిక్కులందును నిలుపవలెను. కొండపై అంతటను వివిధ ఫలపుష్ప మాల్యములు అమర్చవలెను. దీనికి పైభాగమున ఐదు వన్నెల వస్త్రములతో వాడని పూవులతో ఆభరణములతో అమర్చిన చాందినీని అమర్చవలెను. (నిర్ణయించు కొనిన ధాన్య పరిమాణములో నాలుగింట మూడు వంతుల ధాన్యముతో మేరు పర్వతము అమర్చగా మిగిలిన నాలుగవవంతు ధాన్యముతో గంధమాల్య యుక్తముగా అయా కుల (శాఖా) పర్వతములను అమర్చవలెను. ఎట్లనగా-తూర్పున బంగారుతో చేసిన రుద్రుని ప్రతిమయు ప్రమథుల ప్రతిమలును అనేక ఫల పుష్ప గంధ విలేపనములును బంగారు మన్మథ ప్రతిమయును వీరికి అందరకును వస్త్రమాల్య గంధ విలేపనములును మందర పర్వతముపై అమర్చవలెను.
దక్షిణమున గోధుమల రాశితో గంధమాదన పర్వతమును దానిపై బంగారుతో నేరేడు చెట్టు-బంగారుతో కుబేర ప్రతిమ నేతితో మానస సరస్సు చక్కని వస్త్రములు వెండితో చేసిన చెట్ల అడవులుండవలెను. పడమట తిలలతో చేసిన విప్రులు పర్వతము దానిపై అనేక సుగంధ పుష్పములు బంగారుతో అశ్వత్థ వృక్షము బంగారు హంసలు వెండితో తెల్లని పూలవనము తెల్లని వస్త్రములతో దధి (పెరుగు) సరస్సు అమర్చవలయును. ఉత్తరమున కంచుతో నుపార్శ్వ పర్వతమును దానిపై శిఖరములు బంగారుతో పూల మొక్కలు మర్రిచెట్టు బంగారు గోవు వెండిచెట్ల అడవి తేనెతో భద్రమను సరస్సు ఏర్పరచవలయును.
ఈ మండపమునకు తూర్పున ఘన పరిమాణము గల కుండమునందు వేద పురాణ వేత్తలును పవిత్ర చరిత్రులు సమర్థులునగు నలుగురు బ్రాహ్మణులచే తిలలతో యవలతో ఘృతముతో సమిధలతో కుశలతో హోమము చేయించవలెను.
ఈ దానవ్రత దినమున రాత్రియంతయు జాగరణము చేయవలెను. తీవ్రతలేని సరస మధురములగు తూర్య నాదములతో పర్వతముల నావాహనము చేయవలెను. (ఆవాహన మంత్రార్థము) సర్వ దేవ గణముల తేజస్సులకు నివాస స్థానమ (నిధి) వగు దేవపర్వతమా! మాగృహములందలి అశుభమును శీఘ్రముగా నశింపజేయుము, పరమ భక్తితో చేసిన నా పూజలనందుకొని అత్యుత్తమమగు శాంతిని క్షేమమును కలిగించుము. నీవే భగవానుడవగు ఈశుడవు బ్రహ్మయు విష్ణువును రవియును మూర్తికలదియు తేనిదియు అగు వ్యక్తావ్యక్త తత్త్వమును జగద్బీజమును; కావున సనాతన పర్వతమా! మమ్ములను రక్షించుము. నీవు లోకపాలురకును విశ్వమూర్తియగు విష్ణునకును రుద్రాదిత్య వసువులకును నివాస స్థానమవు; కావున అట్టి నీవు నాకు శాంతిని కలిగించుము. నీశిరము దేవ-దేవనారీ జనముతో నిండి యుండును. కావున ఇట్టి నీవు నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్ధరించుము. ఇట్లు మేరు పర్వతమునర్చించి పిమ్మట మందర పర్వతము నర్చించవలెను. (మంత్రార్థము) నీవు చైత్రరథ (వన) ముతోను భద్రాశ్వ వర్షముతోను శోభించుచుందువు. కావున ఇట్టి నీవు శీఘ్రమే నాకు తుష్టి కలిగించుము. (గంధమాదనార్చనము) గంధమాదనమా! నీవు జంబూ ద్వీపమున చూడామణివి; గంధర్వ వనపు శోభతో కూడినదానవు. ఇట్టి నీచే నాకు దృఢమగు కీర్తి కలుగుగాక! (విపుల పర్వతార్చనము) విపుల పర్వతమా! కేతుమాల వర్షముతోను వైభ్రాజ వనముతోను శిరస్సునందు బంగారు రావిచెట్టుతోను ప్రకాశించుదానవు. ఇట్టి నీదయచే నాకు దృఢమగు పుష్టి కలుగుగాక! (సుపార్శ్వ పర్వతార్చనము) సుపార్శ్వ పర్వతమా! ఉత్తర కురు వర్షముతోను సావిత్రమనెడు వనముతోను నిరంతరమును ప్రకాశింతువు. ఇట్టి నీదయచే నాకు అక్షయ శ్రీ కలుగుగాక!
ఇట్లు వాటిని అన్నిటిని ఆవాహనము చేసి అర్చించి నిర్మలమగు ప్రభాతము కాగానే మధ్యమ (మేరు) పర్వతమును గురు (పురోహితు)నకును మిగిలిన నాలుగింటిని నలుగుర ఋత్విక్కులకును ఈయవలెను. శక్తిననుసరించి ఇరువది నాలుగు-పది-ఎనిమిది-ఏడు-ఐదు- ఐన పాడి కపిల గోవులను దానమీయవలయును. గురునకు ఒకటి తప్పక ఈయవలయును.
అన్ని పర్వతముల విషయమునను ఇదే విధానము-మంత్రము-ఉపస్కరములును. సర్వదేవతలకును హోమము కూడ పైవలెనే. వ్రత దినమున ఉపవాస ముండవలయును. శక్తిలేనిచో నక్తమున భుజించవచ్చును.
అన్ని పర్వత దానములందును ప్రధానముగా చెప్పవలసిన మంత్రము. “అన్నమే బ్రహ్మమును ప్రాణములును భూతోత్పత్తి స్థితి హేతువులును లక్ష్మియు జనార్ధనుడును కావున (అన్నము నకు మూలమగు) ధాన్యపర్వత రూపమున ఉన్న పర్వత రాజమా! మమ్ము కాపాడుము.”
ఈ విధానముతో ధాన్యపర్వతమును (కాని ఇతర పర్వతములను కాని) దానమిచ్చిన వారు సమగ్రమగు మన్వంతర శతము దేవలోకమున సుఖింతురు. సర్వత్ర వ్యాపించి యున్న అప్సరో గంధర్వ గణములతో వ్యాప్తమైయున్న స్వర్గమును దివ్య విమానములో చేరుదురు. కర్మక్షయముకాగానే మరల కల్పాదియందు రాజరాజై జన్మింతురు.