శివుడు వివాహమునకై తరలిపోవుట

అనంతరము శివుడు హిమగిరి కందరమువలె తెల్లనగు మహావృషభమును మెత్తని కొరడా దెబ్బలతో, తోలుచు సాగిపోవుచుండెను. అదియును సమ్మర్దముగా గుమియై ఉన్న ప్రమథులపై కన్నులు ప్రసరింపజేయుచు వజ్రము కొండలనువలె వారిని భయపెట్టుచు వణకించుచు సాగు చుండెను. అంతట హరియు త్వరతో అడుగులు వేయుచు ముందుగ పోవుచు శ్రమయైనపుడు చెట్ల నీడలందు విశ్రమించుచు త్రోవలోని ధరాధూళితో తన ఆభరణములు వింతరంగులు కలవి యగుచుండ పోవుచు “ముందునకు నడచుచుండుడు; నిలువబడి ఈశుని త్రోవకు ఇబ్బంది కలిగించవలదు” అని జనులను హెచ్చరించుచుండెను. ప్రభువు మొదటనే తనకిచ్చిన అజ్ఞను మన్నించుచు వీరకుడును కనుబొమలు ముడివేసి దేవతలారా! అకాశములో ఏమి వింత చూచుచున్నారు? పర్వతములారా! మాకు దూరముగా పొండు; మహాసముద్రములారా! మహాసుర సంచారమున బురదగానైన మీజలమును శిలవలెగట్టి పరచుకొనుడు; గణాది పతులారా! చంచలగతితో పోవలదు. దేవతలతో కలిసి స్థిరగతితో నడుపుడు. ఓ భృంగీ! నీవు నీ ఒడలివంక చూచుకొనుచు అడ్డదిడ్డముగా పోవుచున్నావే కాని శివుడు తన విశాలముఖ మండలాగ్రమును (చూపును) ప్రసరింపచేసిన త్రోవవెంట ఆయనను వహించికొని పోవుటలేదు. యమా; నీవు నీ దంతముల నడుమ సందులు బయల్పడ నోరు తెరచుకొని ఏసంభ్రమమును లేక ఊరక దండాయుధమును మోసికొనిపోవుచున్నావు. (ఎచ్చరికగా లేవు;) ఏలయన-త్రోవయంతయు రథముల గుర్రములును మాతృకలును తమ తమ అనుచరులు తమవెంటరాగా కాలినడకతో నడుచుచున్న దేవతలును తమకు వలసిన దానికి రెండింతల త్రోవ నాక్రమించి శివునకు త్రోవ విడుచుటలేదు. దేవతలారా! గాలికి చామరములు కదలియాడుచుండు ధ్వజములు చలించుచుండ ఠీవితో తమతమ వాహనములను ఆరోహించి నడువుడు; మీరు మూడు విధములగు లయలతో మీరు మీరు సాధన చేసిన చేసిన రాగములను పాడరేల?

కిన్నరులు తమ విభూషణముల రాపిడివలన కలుగు ధ్వనిని మరుగు పరచునంతగా గొంతెత్తి పాడలేకున్నారే! స్వజాతిజు (లగు ప్రమథు)లారా! మీరును షడ్జ మధ్యమ స్వరములతో బిగ్గరగా బహుతరముగా పాడరేల? (కళావేత్తలగు) గౌడకులారా! మిగుల వంగి వంగిపోవు శరీరములతో మీరందరును మీ కళలకు సంబంధించిన వ్యవస్థను విడిచి ఎవరికివారై విడిపోయి, భయపడుచు త్వరతో అడుగులు వేయుచు అట్లు పోవుచున్న రేల? షాడ్గవాది కళాభిజులుకూడ అట్లు వేరువేరుగా విడిపడిపోయెద రేల? లలిత పదప్రయోగములతో సంపన్నములయిన మీమీ గీతకములతో ప్రభువునకు ఎదుట అతి స్పష్టార్థమగు అక్షత అనగా ఏకొరతయులేని సంగీతమును స్ఫుటముగా పాడరేల? ఈ నాగజాతులవారును ఒక గుమిగానుండక ఎవరియంతట వారయి విడివడి రమ్యమగు రాసక నృత్తమును బహుగమక స్వభావవంతముగా అభినయించుచు పరమ శివుని యశమును వ్యాపింపజేయుచు ప్రకీర్ణక విధానమున అభినయించుచున్నారేల? ఈవివిధ జాతులకుచెందిన దేవయువతులును ఒకఅమరికలో నుండక ఆయా దిక్కులం దెచ్చట వెచ్చటనో చేరి పరస్పర మిశ్రితలయి ప్రతిక్షణమందును ఏవేవో మాటలో పాటలో పలుకుచు ధ్వని చేయుదురేల? చక్కని ధ్వనులుగల మృదంగ వాద్యధ్వనులు వినవచ్చుటలేదు. సంగీత శాస్త్రీయ మూర్ఛనా ప్రధానములగు మూర్ఛిత గీతికలు వినబడవు; ఇదియేమి? శ్రవణ ప్రీతికరమగు క్రమగతిగల సంగీత భేదములతో వివిధ సాధనములతో కూడినవియు తుంబురునిచే చెప్పబడినవి యునగు వీణామృదంగాది వాద్య విశేషములు చక్కగా మ్రోయింప బడవేల? ఇట్లు పలుకు వీరకుని వచనము లవధరించి సురాసురులు నియమ బద్ధులయి మిగుల హర్షముతో చరాచర జగమంతయు తామే నిండి ముందునకు సాగిపోవు చుండిరి.

ఇట్లు దిశలు ఉరుముచున్నట్లు ధ్వనించుచుండ, మహార్ణవములు మ్రోగుచుండ, మేఘములు ఉరుముచుండ, గిరికందరములు పగులుచుండ, జగమంతయు తుముల మగుచుండ, త్వరిత గమనమున తన నగరికి తరలివచ్చుచున్న శివునిచే హిమవంతుడు కలతనందెను.

ఆ హిమాలయ మహాగిరి నగరమునందు ఒకచోట మిగుల ప్రకాశించు వేలకొలది బంగారు తోరణములుండెను. ఒక దానికి మరియొకటి చేరువలో మరకత మణివేదిక లుండెను. ఒకచోట వైడూర్యపు భూమికలుండెను. ఒకచోట జలజలపారు అందమగు సెలయేళ్లు ఉండెను. ఆ నగరమందంతటను వేలకొలది పతాకలు కదలియాడుచు అలంకారమయి యుండెను. ఇండ్ల ముంగిళ్లయందు కల్పవృక్షముల పూలు చల్లబడి ఉండెను. తెల్లని ఎర్రని నల్లని గైరిక ధాతువులు వ్యాపించి యుండెను. త్రోవపొడవున భవన గోపురములు కనబడుచు శోభించుచుండెను. సుగంధ ధూపపు పొగలతో నిరుపమానములగు మేఘములానగరపు ఆకాశమున క్రమ్మి యుండెను. అంతట నా మనోహరవాయువులు వీచుచుండెను. ఇట్లు సురాసురులు స్తుతులందు కొనుచు పరమేశ్వరుడు ఒకక్షణ కాలములో ఇట్టి హిమవత్ మహానగరము చేరెను.