మత్స్య మహా పురాణము
ఆయగణితము
ఇంటి వెడల్పును పొడవుతో గుణించి వచ్చిన దానిని ఎనిమిదితో భాగించగా (పొXవె + 8) వచ్చిన శేషములలో 1. ధ్వజ; 2. ధూమ; 3. సింహ; 4. శునక; 5. వృషభ; 6. ఖర; 7. గజ, 8. ధ్వాంక్ష-ఆయములను తెలుపును; పొడవు వెడల్పులు మూరలలో లెక్కకు తీసికొనుటచేత ఈ పొడవు వెడల్పులను పరస్పరము గుణించగాను - దానిని భాగించగాను వచ్చిన సంఖ్యలు చదరపు మూరలను తెలుపును. ఈఎనిమిది ఆయములును వరుసగా తూర్పు నుండి ఈశాన్యము వరకు ఎనిమిది దిక్కులయందుండునని తెలియవలయును. వీనిలో ధ్వజాయము అన్ని దిక్కులకును అభిముఖమై-విశేషించి పశ్చిమాభి ముఖమయి గృహ నిర్మాణ (వాస్తు) స్థానమునందు తూర్పుదిశ యందుండును. సింహాయము దక్షిణదిశ యందు ఉత్తరాభి ముఖమయి యుండును, వృషభాయము పశ్చమ దిశ యందు ప్రాగభిముఖమై యుండును; గజాయము ఉత్తరదిశయందు దక్షిణాభిముఖమై యుండును; ఈఆయములు మంచివి; విదిశల (మూలల) యందు వచ్చిన 2-4-6-8 ఆయములు మంచివి కావు.