మత్స్య మహా పురాణము
విగ్రహ నిలువుకొలతలు
ప్రతిమకు ముఖమెంత నిలువు టెత్తుండునో అంత పరిమాణములు తొమ్మిదింటిని మనస్సులో కల్పించి ఉంచుకొనవలయును. ఇక మూర్తి ప్రధానఖండముల కొలతలపాళ్లు. 1. (ముఖపు నిలువుటెత్తు 12 అంగుళములయినపుడు), 2. మెడ 4 అంగుళములు; 1 భాగము = 12 అంగుళములు హృదయము; దానికి దిగువను నాభివరకు 1 భాగము = 12 అం.; 4. బొడ్డు లోతు 1 అంగుళము; 5. నాభికి దిగువ అంచునుండి మేడ్రము (మర్మాంగము) దిగువ కొనవరకు 1 భాగము = 12 అంగుళములు; 6. తొడలు = 2 × 12 = 24 అంగుళములు; 7. మోకాళ్లు (మోకాటి చిప్పలు) 4 అంగుళములు; 8. జంఘలు 2 భాగములు = 2 × 12 = 24 అంగుళములు; 9. పాదముల నిలువు కొలత 4 అంగుళములు; 10. శిరస్సు 14 అంగుళములు; (ముఖపు కొలత శిరపు కొలతలో చేరిపోయినది; ఇట్లు మొత్తము 108 అంగుళములగును; 9 × 12 = 108; నవభాగ ప్రకల్పన సరిపోయినది; ఇట్లు ఈ 108 అంగుళములకు పీఠపు ఎత్తు 54 అంగుళములు చేర్చగా 162 అంగుళములు; ఇది దేవాలయద్వారపు టెత్తులో 7/8 అగుచో ద్వారపుటెత్తు = 162 × 8 = 184 అంగుళములు) ఇది విగ్రహపు నిలువు కొలతల విషయము; ఇక ఆయా అవయవముల వెడల్పును వాని చుట్టు కొలతలును వానిచే ఏర్పడు వైశాల్యమును తెలిపెదను. వినుడు.