మత్స్య మహా పురాణము
బ్రహ్మ మన్మథుని అనుగ్రహించుట
తన కుమార్తెను తాను పొందుట కారణముగా బ్రహ్మ మన్మథుని శపించెను. మన్మథా! నాయంతటివాని మనస్సును కూడ నీవు నీ బాణములచే సంక్షోభింప జేసితివి. కావున రుద్రుడు నిన్నుకోపముతో భస్మము చేయును. అనగా మన్మథుడు బ్రహ్మను ఇట్లు అనుగ్రహింపజేసికొనెను, భగవన్! నీవు ఇక్కడ ఇప్పుడు ఇట్లు నన్ను అకారణముగా శపింపతగదు. మీరే నన్ను ఇట్టి వానినిగా-సర్వ ప్రాణులకు ఇంద్రియములను క్షోభింపజేయు వానినిగా-పుట్టించితిరి. ఈ చోట ఆ చోట అనక ఇప్పుడు అప్పుడు అనక ఎల్లప్పుడు ఎల్లచోట్ల హాని కలిగించు తలంపుతో ప్రయత్నించియైన నీవు స్త్రీ పురుషుల మనస్సు కలతపరచవలయును అని మునుపు మీరే నాతో పలికిరి. మరల నాకు నా శరీరము లభించునట్లు అనుగ్రహము చేయవేడుచున్నాను అని మన్మథుడు వేడగా బ్రహ్మ, వైవస్వతమన్వంతరము వచ్చినపుడు యదు వంశమున నాసత్త్వమును బలమునుపూని రాముడు అను మానవుడు జన్మించును. అట్లు అవతరించిన అతడు శత్రుపురముల ధ్వంసము చేయు మహాశూరుడై ద్వారకయందు నివసించును. అప్పుడు నీవు ఆతని తమ్మునకు అతనితో సముడగు సుతుడవై ధర్మానుసారము దేవజన్మమును పొంది ప్రళయకాలము వరకు విద్యాధరుల కధిపతివై ఉండి తుదకు నా సారూప్యమును పొందెదవు అని చెప్పెను.
ఇట్లు శాపము చేతను అనుగ్రహము చేతను శోకమును ప్రమోదమును పొంది మన్మథుడు తాను వచ్చిన మార్గమున వెళ్లెను.
శౌనకాది ఋషులు సూతునితో మన్మథుడు తన దేహమును మరల పొందుటకై యదు వంశమున జన్మించునంటివి. కుసుమాయుధుడు ఏల ఎట్లు రుద్రునిచే దగ్ధుడు అయ్యెను? ఈ భరథుని (బ్రహ్మ) నుండియే ఏ సృష్టి మొదట జరిగెను? మాకు ఇది అంతయు మొదటినుండి తప్పక చెప్ప గోరెదము. అనగా సూతుడిట్లు చెప్ప ఆరంభించెను. బ్రహ్మదేహార్ధము నుండి జనించెనని నేను చెప్పిన గాయత్రి వేద విశారద. పండితులకును దేవతలకును తల్లియు ఆరాధ్యయగు దేవియును. శతరూప- అనగా వందలకొలది రూపములు కలది; ఇంద్రియములను జయించినది. బ్రహ్మ ప్రజాపతి శతరూపయందు రతి-మనస్సు-తపస్సు-వృద్ధి-అహస్సు (పగలు) దిక్కు-తమస్సు (చీకటి) అను ఏడు మందిని కనెను. సర్వ విద్యాత్మకమగు ఈలోకము బుద్ధి శాలియగు బ్రహ్మకు జనించిన మానస పుత్రులగు మరీచి మొదలగువారికి సంబంధించినది అయ్యెను. అనగా వారీ లోకమునకు ప్రజాపతులుగా అయిరి. తరువాత లోక విభుడగు బ్రహ్మ, త్రిశూల శ్రేష్ఠమును ధరించినవాడును మొదటి వారికంటె మొదటి వాడును అగు వామదేవుని సనత్కుమారుని కూడ సృష్టించెను. భగవానుడగు వామదేవుడును అనగా పరమేశ్వరుడు తన ముఖము నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను సృష్టించెను. మెఱుపులను పిడుగులను మేఘములను వంకరలేని ఇంద్ర ధనుస్సును, ఇంద్రుడు మొదలగువారిని పర్జన్యుని, సాధ్యులు అను దేవగణములను సృజించెను. తన మూడవ కంటినుండి జరామరణములు లేని ఎనుబదినాల్లు కోట్లమంది దేవతలను కూడ సృష్టించెను. అంతట బ్రహ్మ వామదేవునితో ఇట్లనెను, శుభాశుభములతో కూడి చావు ముసలితనములతో కూడిన సృష్టియే మేలయినది కాని ఇట్లు జరా మరణములు లేనిదై ఉండరాదు అని అతనిని వారించెను. కల్పాదియందు ఈశ్వరుడింత వరకు సృష్టించిన తరువాత అతని సృష్టి నిలిచిపోయెను.
స్థిరబుద్ధి కలవాడగు స్వాయంభువ మనువు మిగుల దుస్తరమగు తపస్సాచరించి అనంత అనునామముకల భార్యనుపొంది మనస్సున సంతుష్టిచెందెను. ఆ మనువు ఆమెయందు ప్రియువ్రతుడు ఉత్తానపాదుడు అను కుమారులను కనెను. ఉత్తానపాదునకు ధర్ముని కుమార్తెయగు సూనృత అనునామె భార్యయయ్యెను. ఆమె నేర్పరి. సౌందర్యవతి. ఇంపైన, నెమ్మది నడక గలది. ఇతడు నాకు రక్షకుడు. ఇతడు నావలన కీర్తిశాలి కావలయును అను భావము తన భర్త యందు కలది. ఆమెయందు ఉత్తానపాదుడు ధ్రువుని కుమారునిగా పొందెను. పురాతన కాలముననే ఆ ధ్రువుడు దివ్యతపము ఆచరించి దివ్యమగు రూపమును బ్రహ్మలోకమునకు దిగువగా స్థిరస్థానమును సంపాదించెను. ఈధ్రువుని ముందుంచు కొనియే సప్త మహర్షులు ఉన్నారు. ధ్రువునకు ధన్యయను మనుపుత్రియందు శిష్ట కుమారుడు జనించెను. శిష్టికి అగ్నిపుత్రియగు సుచ్ఛాయయందు రిపుడు, రిపుంజయుడు, వృత్రుడు వృకలుడు వృకతేజసుడు అను కుమారులు కలిగిరి. రిపుంజయునకు బ్రహ్మకు దౌహిత్రి అగు వీరిణి (వైరిణి) యందు చాక్షుషుడు అను కుమారుడు పుట్టెను. ఈతనికి వీరణుని కుమార్తెయగు నడ్వలయందు శూరులు పవిత్రులునగు ఊరువు, పురుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్, కవి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుదృష్టి, అభిమన్యుడు అను పదిమంది కుమారులు కలిగిరి. ఊరువునకు ఆగ్నేయియందు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరుడు, శిబి అను కుమారులు కలిగిరి. పితరుల కన్యయగు సునీథ అను భార్యయందు అంగునకు వేనుడు పుట్టెను. అన్యాయియగు వేనుని విప్రులు మథించిరి. అతని చేతినుండి మహాతేజస్కుడగు పృథువు కలిగెను. అతనికి శిఖండి అను స్త్రీ యందు అంతర్ధానుడు, హవిర్ధానుడు అను కుమారులు కలిగిరి. హవిర్ధామునకు ఆగ్నేయి యందు ప్రాచీనబర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, ప్రజాజనుడు అను ఆరుగురు కుమారులు కలిగిరి. భగవానుడును మహాత్ముడునగు ప్రాచీనబర్హి ప్రజాపతి అయ్యెను. ఏలయన అతనిచేత హవిర్ధానులు అను పేర అనేకులగు ప్రజలు ప్రవర్తిల్ల జేయబడిరి. బంగారు గుర్రములు కలవారు మహాభాగులును భగవద్భక్తులును అగు పదిమంది అతని కుమారులు. వారికి అందరకును ప్రాచేతసులు అని పేరు. వారందరు ధనుర్వేదము చివర వరకు నేర్చిన వారు. ఒకప్పుడు భగవంతుని ఆదేశమున లోకమునందలి వృక్ష ఓషధీ జాతులను అగ్ని దహించెను. వాటిని ఈ ప్రాచేతసులు అంతట ప్రకాశించునట్లు చేసిరి. సోముని కన్యయగు మానస అనునామె వారికందరకు పత్ని అయ్యెను. ఆమె వారివలన పూజ్యుడగు దక్షుడను కుమారుని కనెను. అతని తరువాత నల్లని ఓషధులును, అనన్త, భద్రవతి అను కుమార్తెలును ఆమెకు సంతానమయ్యెను. సోమాంశము వలన కలిగిన ఆ దక్షునకు లెక్కలేనన్ని కోట్ల సంతానము కలిగెను. లోకమునందు నిలిచియున్న ఆ సంతాన విస్తరణమును తెలిపెదను వినుము. రెండు పాదములు కలవారు అనేక పాదములు కలవారు కోతి మొగము వంటి మొగము కలవారు, శంకువువంటి చెవులు కలవారు, కప్పువడిన చెవులు కలవారు పులి మొగము వంటి మొగము, పచ్చని మొగము, కుక్క మొగము వంటి మొగము, పంది మొగము వంటి మొగము, ఒంటె మొగము వంటి మొగము కలవారు అనేకులు మ్లేచ్చులందరును అతనికి మానస సుతులుగా జనించిరి. అనంతరము ప్రీతి అను భార్యయందు చాలమంది స్త్రీలు అతనికి కూతులుగా కలిగిరి, ఆ స్త్రీలనుండియే దేవతలు అసురులు మనుష్యాది ప్రాణులు; వీరితో జగత్తంతయు నిండిపోయెను.