పార్వతి బ్రహ్మ వరమున గౌరి అగుట

వీరకా! నీవు నీయందతివాత్సల్య పరవశనయి యున్న నన్ను లెక్క పెట్టక శంకరుని రహస్య సుఖమున అన్యస్త్రీల కవకాశమిచ్చితివి కావున పరుషయు రూక్ష అనగా బిరుసైనదియు అచేతన హృదయహీన అగుశిల నీకు తల్లియగును అని పార్వతి వీరకుని శపించెను. శివమహిమతత్త్వములందు గల ప్రక్రమానుసారము ఇట్టి విచిత్ర కథాశ్రయమగు ఈ వృత్తాంతమే వీరకుడు శిలనుండి జనించుటకు హేతువు. ఇంకొక జన్మమున ఈ వీరకుడు శిల నుండి జనించెనని దీనినిబట్టి ఎరుగవచ్చును.

ఇట్లు శపించిన తత్ క్షణమే పార్వతీ ముఖమునుండి ఆమె హృద్గత మహాక్రోధము మహా బలశాలియగు సింహమయి వెలికి వచ్చెను. ఆ సింహము మిట్ట పల్లములుగల ముఖము కలది; జడలు నిండిన కంఠము పైకి లేచి ఆడుచు వ్రేలాడుచు ఉండు పొడవుతోక కోరలతో వికటమగు ముఖ విస్తారము విశాలముగా తెరచిన నోరు కదలి ఆడు నాలుక సన్నని పొట్టకలదై కనబడినదెల్ల ఆహారముగా తిను కోరికతో ఉండెను. సతియగు పార్వతియు తానే దానికి ఆహారము కాదలచి ఉండెను. ఆమె సంకల్పమెరిగి బ్రహ్మ సకలసంపదలకు నిలయమగు ఆమె ఆశ్రమమునకువచ్చి దేవితో ఇట్లు స్పష్టముగా ఇట్లుపలికెను. “బిడ్డా! నీవేమిపొందగోరుచున్నావు? అది ఎంత అలభ్య మనినను నీకిత్తును. మిగులక్లేశకరమగు ఈ తపస్సు చాలింపుము; ఇది నాయాజ్ఞ అనిన వచనమువిని గిరిజ లోకగురువు అగు బ్రహ్మతో చాలకాలము క్రిందటనే తాను నిర్ణయించి యుండి ఇప్పుడు బయలుపరచు చున్నదియు చిత్రమగు వాంఛతో నిండిన వాక్కుతో ఏర్పడినదియు ఆదర పూర్వకముగా నేను దుష్కర తపమాచరించి శంకరుని పతిగా పొందితిని. అట్టి హరుడు నన్ను ‘శ్యామలవర్ణ’ ‘నల్లనిది’ అని చాలమారులు అనెను. నేను బంగారువన్నె కలదానను - భర్తకు ప్రీతిపాత్రురాలను - కావలయును. నాపతియగు భూతపతి శరీరమును నేనును అతని శరీరమనై ప్రవేశింప వలయును అని పలికెను.

పార్వతి పలికిన ఈమాట విని పద్మభవుడు ఇట్లనెను. నీవు ఈ (నీవుకోరిన) విధముగనే అగుదువు. భర్తృ దేహార్ధధారిణివి కూడ అగుదువు. అనగానే తుమ్మెద వంటి దేహము కల ఆ పార్వతి వికసించిన నల్లకలువల వంటి వన్నె కల చర్మమును విడిచెను. ఆ నల్లకలువ కాంతితో మిగిలిన ఆమె ప్రకాశించు చర్మముతో చేతియందు ఘంటయు మూడు కన్నులును నానా ఆభరణములతో పూర్ణమగు శరీరావయవములును కలిగి పచ్చని పట్టువస్త్రము ధరించిన స్త్రీగా అయ్యెను. ఈనల్ల కలువ కాంతితో ఉన్న ఆ దేవితో బ్రహ్మ ఇట్లు పలికెను: ఓనిశా! (విభావరీ! రాత్రిదేవీ!) నీవు పూర్వము నా ఆజ్ఞతో పార్వతీ దేహమున సంక్రమించితివి. ఇంతవరకును ఆమెతో (ఏకా - అనంశా) ఒకటిగా - ఆమెకు అంశభూతవు కాక - ఉండి కృతకృత్యురాలవయితివి; సుందరముఖీ! దేవీ క్రోధమువలన ఈసింహము ఉత్పన్నమయినది కదా! ఇది నీకు వాహనమగుటయే కాక నీధ్వజమందు కూడ ఉండుగాక! నీవు ఇపుడు వింధ్యాచలమునకు సొమ్ము; అచ్చట ఉండి నీవు దేవ కార్యము నెరవేర్చెదవుగాక; పంచాలుడను ఈ యక్షుడున్నాడే! ఇతనికి లక్షమంది అనుచరులున్నారు. ఇతడును వందల కొలది మాయల నెరిగినవాడు, ఇతనిని నీకు కింకరునిగా ఇచ్చుచున్నాను అని పల్కిన బ్రహ్మ వచనమును విని కౌశికీదేవి వింధ్యాచలమున కేగెను. పార్వతీ దేహము (కోశము) నుండి ఉత్పన్నయైనందున ఈమెకు కౌశికి యనిపేరు తన కోరిక నెరవేరి ఉమయును గిరీశుని కడకు పోయెను. అచట అంతఃపుర ద్వారమున సావధానుడై ఉన్న వీరకుడు మొదటికంటె రూపము మరియున్న దేవి లోనికి ప్రవేశించుచుండ ఆమెను ఇవతలకు ఈడ్చివేసెను. బంగారు ప్రేపబెత్తము ధరించినవాడు అగు అతడు కోపముతో ఇట్లు పలికెను. నీకిచ్చట ఏమియు పనిలేదు. నిన్ను చీల్చివేయు లోపలనే ఇటనుండి పొమ్ము. దైత్యుడు ఒకడు దేవీ రూపము ధరించి మమ్ములను వంచించి మాయతో లోన ప్రవేశించెను. శివుడు వానిని చంపెను. అటు తరువాత శివుడు కోపించి నన్నిట్లు అజ్ఞాపించెను. ద్వారముకడ నీవు సావధానుడవుగా లేవు. కనుక నీవు ఈపని చూడనక్కర లేదు. ఆపని నేనే చూచుకొందును. అనేక సంవత్సరముల కాలము నీవు నాద్వార పాలక పదములో నుండరాదు అని శివుడు పలికెను. కావున నీకు లోనికి ప్రవేశమీయను; త్వరగా ఇటనుండి పొమ్ము.