మత్స్య మహా పురాణము
కైలాసాది పర్వత వర్ణనము
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, ఆ అత్యాశ్రమమునకు ఉత్తరమున హిమవత్ పృష్ఠమున త్రిపుర సంహర్తయగు పరమశివుడు అనుభవించి ఆనందించుచుండు కైలాస పర్వతము ఉన్నది. అది కల్పద్రుమ విభూషితములగు నానా రత్నమయ శృంగములతో అలంకృతము. దానియందే శ్రీమంతుడగు కుబేరుడు గుహ్యకులతో కూడ నివసించుచుండును. అలకాధిపతియగు రాజరాజు కుబేరుడు అప్సరసలు తన వెంటనుండగా ఆ కైలాసపర్వత పాదమునుండి ప్రభవించు శుభమును పుణ్యమును (పవిత్రమును) మందార (కల్పవృక్ష) పుష్పరాగ పూర్ణమును దేవ సమాదర పాత్రమునునగు శీతల జలమును అనుభవించి ఆనందించుచుండును. ఆ కైలాసమునుండియే శుభయగు మందాకినీ (దేవగంగా) నది ప్రభవించును. ఆ నదీతీరము నందే గొప్పదియును శుభమునునగు నందన వనమున్నది.
కైలాసమునకు ఈశాన్యమున దివ్యమగు సౌగంధిక గిరికిని సర్వ గైరిక ధాతుమయమును దివ్యమునగు సువేల పర్వతమునకును చేరువగా సముద్రజలపు కాంతిగల చంద్ర ప్రభమను గిరి కలదు. దాని సమీపమందుకల అచ్ఛోదమను సరస్సునుండి శుభయగు అచ్ఛోదకయను దివ్యనది ప్రవహించును. దాని తీరమున గొప్పదియై దివ్యమును శుభమును నగు చైత్ర రథవనము ఉన్నది. దానియందు క్రూ(శూ)రులగు గుహ్యకులు తన పరివారముగా యక్షసేనాపతి మణ భద్రుడు తన యనుయాయులతో కలిసి నివసించును. ఈ అచ్ఛోదకా నదినే మందాకిని యనియు (కొందరు) వ్యవహరింతురు. అది మహీమండల మధ్యమున ప్రవహించి మహోదధిని ప్రవేశించును. (మహోదధితో కలియును.)
కైలాసమునకు ఆగ్నేయమున శుభకరమగు సర్వౌషధి గిరికిని మనశ్శిలా (మణిశిల) మయమును దివ్యమును నగు శబలపర్వతమునకును చేరువగా హేమ శిఖరములతో సూర్యుని వలె తేజరిల్లు లోహిత మహాపర్వతమున్నది. దాని పాదమున మహాదివ్యమగు లోహితమను మహాసరస్సు కలదు. దానినుండి లోహిత మహానదము ప్రభవించి లోకమున ప్రవహించును. అ సరస్తీరమున అశోకమను దేవ మహావనము కలదు. ఆగిరియందావనమున సౌమ్యులు సుధార్మి కులునగు గుహ్యకులు తన పరివారముగా జితేంద్రియుడగు మణిధరుడను యక్షుడు నివసించును.
కైలాసమునకు నైరృత దిశయందు కకుద్మత్పర్వతము గలదు. త్రికకుద్మంతము (మూడు శిఖరములు కలది) అగు ఆ త్రికకుద్మత్పర్వతపు త్రైకకుదాంజనమను శిఖరమున రుద్రుని ఉత్పత్తి జరిగెను. ఆ పర్వతపు పాదము నందు మహాదివ్యము సిద్ధ సేవితమునగు మానసమను సరస్సు కలదు. దానినుండి పుణ్యయు లోకపావనియునగు సరయూనది (ఇది హరయూ అని అవెస్తాలో పేర్కొనబడినది. ఇపుడిది పడమటి ఆఫ్ఘన్ స్తానులో హీరట్ కు దగ్గరగా హరిరుద్ అను పేరుతోనున్నది.) దాని తీరమునందు వైభ్రాజమను ప్రసిద్ధవనము కలదు. దానియందు కుబేరానుచరుడు జితేంద్రియుడు ప్రహేతి అను వాని కుమారుడు అనంత విక్రముడు నగు బ్రహ్మయోని (బ్రహ్మధానుడు) అను రాక్షసుడుండును.
కైలాసమునకు పశ్చిమమున సర్వౌషధియను దివ్యగిరి కలదు. అచటనే స్వర్ణమయ గైరిక ధాతువులతో విభూషితము. అందుచేతనే బంగారువలె కనబడునది శివుని ప్రీతికి పాత్రమయినది. దివ్య సువర్ణ శిలా సమూహములతో వ్యాప్తము వందలకొలది బంగారు (వలె ప్రకాశించు) శిఖరములతో ఆకాశమును ఒరయుచున్నదో అనునట్లు తోచు అరుణమను పర్వతశ్రేష్ఠము కలదు. దాని దాపుననే సుమహాదివ్యమగు ముంజవత్పర్వతమును మహోన్నతమగు దుర్గ శైలము కూడకలవు. ఈ అరుణపర్వతమందు ధూమ్రలోహిత రూపుడగు శివుడు సన్నిధానము చేసి యుండును. ఈ అరుణపర్వత పాదమునుండి శైలోదమను సరస్సును దానినుండియే శైలోదయను నదియు ప్రభవించును. అనది (ఇదియే నేటి ఆక్సస్-(ఇం) చక్షుష్-వక్షు (సం) అమూదరియా (పార్శీ) నది) దక్ష-శీత-పర్వతముల నడుమగా పశ్చిమ సముద్రమున కలియును.
కైలాసమునకు ఉత్తరమున ఉన్న సర్వౌషధి గిరికిని హరి సాలమను వనమునకును చేరువగా దివ్యౌషధిమయమై గౌర వర్ణముగల హిరణ్య శృంగమను పర్వతశ్రేష్ఠము కలదు. దాని పాదమునందు మహాదివ్యమును కాంచన వాలుకము (బంగరు ఇసుకగలది) రమ్యము అగు బిందుసరమను సరస్సు గలదు. అచ్చటనే భగీరథుడను రాజర్షి తన పూర్వులు గంగా జలముతో తమ అస్థ్యాదికము తడిసినచో స్వర్గమున కేగుదురను ఆశతో అనేక వత్సరములు తపమాచరించెను. త్రిపథగ (మూడు మార్గముల పోవునది) ఐన గంగ మొదట అక్కడనే ఉండెడిది. ఆమె సోముని (శివ శిరఃస్థిత చంద్రుని) పాదమునుండి వెలువడెను. తరువాత ఆమె ఏడుగా విభాగమందెను. అక్కడ ఇప్పటికిని మణి నిర్మితములగు యూప (యజ్ఞ పశువును బంధించు) స్తంభములును హిరణ్మయచితులు (చితి=యజ్ఞవేదికా విశేషము)ను కలవు. అచ్చట ఇంద్రుడు సురగణములతో కూడి క్రతువులతో యజనము (దేవతారాధనము) చేసి కామితఫల సిద్ధిపొందెను. ఈ విషయమునందే సంప్రదాయము ఇట్లున్నది. నక్షత్రమండలమును ఆశ్రయించి దివ్యచ్ఛాయా మార్గము కలదు. (దీనికే స్వాతీపథమని పేరని శ్రీమద్రామాయణమున కలదు.) ఈ త్రిపథగ రాత్రులందు అంతరిక్షమున కనబడుచునే యున్నది. ఆమె (తన ప్రకాశమను జలముతో) అంతరిక్ష ద్యులోకములను పావనము (ముంచెత్తి తడుపుట) చేసి భూలోకమునకు వచ్చెను. (ఇందుచేతనే ఆమెకు త్రిపథగ = భూపథాంతరిక్ష పథద్యుపథము లందు మూడిటి యందును నడచునది.) అని వ్యవహారము-అని సంప్రదాయ వచనము.
(భగీరథుని తపః ప్రభావమున) ఆమె మొదట భవుని ఉత్తమాంగమున పడెను. శివుడు తన యోగమాయా శక్తిచే ఆమెనట సంరోధిం (ఆటంకపర)చెను. అందులకై క్రోధము చెందిన ఆమెనుండి కొన్ని బిందువులు క్రిందకుజారి భూమిపైపడెను. వానితో ఏర్పడినందున ఆ సరస్సునకు బిందు సరస్సని నామము.
శివుడు గంగను తన శిరమున నిరోధించగా ఆమె రోషించి క్రూర భావమునంది ‘నేనీ నిరోధమును ఛేదించి ప్రవాహవేగమున శివునిగూడ తీసికొని పాతాళమున ప్రవేశింతును’ అని తలచెను. ఆమె అభిప్రాయము నెరిగి శంకరు దానదిని తనశరీరమునందే మరుగు పరచ దలచెను. అంతలోనే శివునకు తనఎదుటనున్న భగీరతుడు కనబడెను. అతడు చిక్కి ఒడలంతయు ధమనులు మాత్రము వ్యాపించి కనబడుచుండెను. అతని ఇంద్రియములు ఆకటితో వ్యాకులములై యుండెను. ఈనది విషయమున ఇతడు తపముచే నన్నిదివరకే మెప్పించెను. నేనతనికి వరమిచ్చితిని అని స్మరించి ఆదేవుడు తన కోపమును నిగ్రహించుకొని బ్రహ్మవచనమును కూడ జ్ఞప్తికి తెచ్చుకొని నదిని అట్లే నిలిపి పట్టి తన తేజముచే సంరోధింపబడియున్న గంగను వదలివేసెను. ఆమె నదివరకే భగీరథుడు ఉగ్రతపముచే మెప్పించియుండెను. కావున అట్టి ఆమెను గంగ అనుపేరనే సప్తప్రోతస్సులు (ఏడు ప్రవాహములు)గా శివుడు వదలెను.
నళ్ళింది)ని -హ్లాదిని-ప్లావని అను మూడు ప్రోతస్సులు తూర్పునకును సీత -చక్షుస్ -సింధు- అను మూడును పడమరకును మరియొకటి భగీరథు ననుసరించి దక్షిణమునకును ప్రవహించెను. ఈ హేతువుననే దక్షిణ సముద్రమున కలిసిన ఈ సప్తమ స్రోతస్సు భాగీరథియైనది. మిగిలిన ఆరింటితోకూడ ఈ ఏడును హైమవత వర్షమను నామాంతరము గల భరత వర్షమును పావితమును ప్లావితమును (పవిత్రము చేయబడినది-తడిపి ముంచెత్తబడినది) గా చేయుచున్నవి.
పడమరగా ప్రవహించు సీత-చక్షుస్-(ఇదియే నేటి వక్షు ఆమూదరియా-అను పేరుగల నది) సింధు- అను మూడు గంగా ప్రోతస్సులును మ్లేఛ్ఛ ప్రాయములును పర్వత బహుళములు నునగు కుకురాన్ద్ర బర్బర యవనాంతిక పులసకులు త్థాంగలోక్యాధరా ప్లాక్షమరుకాలక శూలిక ఖరావర్తక శఖ పల్లవదరదశక జనపదములను పవిత్రమొనరించుచు ప్రవహించి తుదకు హిమవంతమున రెండుగా చీలిపోయిపోయి పశ్చిమ సముద్రములో కలియుచున్నవి. ఈమూడు ప్రవాహములు మిగిలినవి కూడ మొత్తము మీద దరద కుక్కుట గాంధారౌరస కురు శివపౌరేంద్ర మరుశాలీయ సైంధవారట్టక కాంభోజకుపథ భీమ గౌరిక శునోముఖోష్ట్రముఖ సింధురేత గంధర్వ కిన్నర యక్ష విద్యాధర కలాపగ్రామక కింపురుషార్షప కిరాత పుళింద భారత కురు పాంచాల కౌశిక మత్స్య మగధాంగ బ్రహ్మోత్తరవంగ తామ్ర లిప్త జనపదములను పవిత్ర మొనర్చుచున్నవి.
హ్లాదినియను గంగా ప్రవాహము తూర్పుగ ప్రవహించి యవక నిషాదనీవర మూషిక నీలముఖ కళింగ దాతికకుశిక స్వర్గభూమిక సముద్ర పాద సంజాత జనపదములవారిని పవిత్ర మొనర్చుచున్నది. నందినియు తూర్పుగనే ప్రవహించి ఇంద్రద్యుమ్న సరఃపరిసరములందలి కుపథములను (ఇరుకు త్రోవలుగల ప్రాంతములను) చైత్ర శంకుపద ఋక్ష కఠరోష్ఠ ప్రావరణ దేశముల నడుమగా ప్రవహించిపోయి ఇంద్రద్వీప (ఖండ) సమీపమున (ఇంద్రద్వీప-అండమాన్-నికోబారు దీవులు కావచ్చును.) సముద్రమున కలియుచున్నది.
ప్లావనియను గంగాశాఖ వేగముతో తూర్పుదెసగా ప్రవహించుచు తోమర-హంసమార్గ- సమూహక-ములను పవిత్రమొనర్చుచు ఇంకను కొన్ని ప్రాగ్దేశములను సేవించుచు పలుతావుల పర్వతమును భేదించుచు పోయి కర్ణ ప్రావరణ (అ)శ్వముఖ జనుల జనపదములను తడుపుచు పర్వతమరు-ప్రదేశముల మీదుగా విద్యాధర ప్రదేశములచేరి శమీమండల గోష్ఠము అను మహా సరస్సున కలియుచున్నది. ఇంద్రుడు వర్షించు దేశములందుత్పన్నములగు నదులుపనదు లెన్నియో త్రోవలో ఈ గంగా శాఖలయందు కలియును. వస్వోకసార (అమరావతీ) సమీపమున సురభియను వనము కలదు. హిరణ్యశృంగుడు అనుపేరుగల విద్వాంసుడు జితేంద్రియు నగు హిరణ్యశృంగుడను కౌబేరకుడు (బేతాళుడు) యజ్ఞాపేతుడు సుమహాన్-అమితౌజస్-సువిక్రమ నామములుగల కుబేరానుచరులగు విద్వద్బ్రహ్మ రాక్షసులు నలుగురును ఇట్టివారు మరికొందరును తన పరివారముగా వసించును. పర్వతవాసులగు జనులు ఇట్టివారితోనే తమ పురుషార్థముల సిద్ధింపజేసికొందురు. ధర్మార్థ కామ ప్రవృత్తులలో వారందరు పరస్పరము రెట్టింపై యుందురు.
హేమకూట పర్వత పృష్ఠమున సర్పముల సరస్సు ఒకటి కలదు. ఆ హ్రదము నుండి సరస్వతీ-జ్యోతిష్మతీ అను రెండు నదులు ప్రభవిల్లి వరుసగా తూర్పు-పడమటి సముద్రములందు కలియుచున్నవి. నిషధమను పర్వతోత్తమమున విష్ణుపదమను సరస్సు కలదు. దాని నుండి గాంధారీ-కులా అను రెండు నదులు ప్రభవించును.
మేరు పార్శ్వమునుండి చంద్రప్రభమను సరస్సును పుణ్యయగు జంబూనదియు ప్రభవించును. జంబూనది నుండి లభించునది కావుననే బంగారునకు జాంబూనదమని వ్యవహారము. పయోదమను నీలహ్రదమును అతి శుభకరమగు పుండరీక హ్రదమును ఆ మేరు పార్శ్వము నందే ప్రభవించును. వానినుండి వరుసగా పుండరీకా-పయోదా అను నదులును ప్రభవించును. హిమవంతమునకు ఆవలివైపున ఉత్తరమానసమను సరస్సొకటి మేరు పార్శ్వము నుండి ప్రభవించును. దాని నుండి జ్యోత్స్నా అమృతకాంతా అను నదులు రెండు ప్రభవించుచున్నవి.
ఇవికాక మేరు పార్శ్వమునుండియే ప్రభవించినవి సముద్రమువలె విశాలములైనవి పండ్రెండ్రు హ్రదములు వైజయములను నామము కలవి కలవు. అవి ఉత్తరకురు వర్షమునందు ప్రసిద్ధములు. అవి ఎప్పుడును పద్మములతో మీనాది జలచరములతో ఆకులములై యుండును. వీటినుండి శాంతి-సంధ్యా-అను రెండు నదులు ప్రభవించును.
ఈ భరతవర్షము కాక మిగిలిన కింపురుషాది వర్షములయం దెనిమిదింటను ఇంద్రుడు వర్షించడు. అచట ఉద్భిజ్జమగు-నేలను చీల్చుకొని పైకి వచ్చు నీటితోనే నదులు ప్రభవించి అవి ఆయా దిక్కులందలి సముద్రములందు కలియును.
ఆయా వర్షములందు-
ఋషభ-బాలక-వజ్ర-మైనాక-చంద్రకాంత-ద్రోణ-పర్వతములు దక్షిణమునుండి ఉత్తరమునకు వ్యాపించి ఉత్తర దిగంతమున ఉత్తర సముద్రములోనికి చొచ్చుకొనియున్నవి. చక్ర రుధికర-నారద పర్వతములు పడమటగా సాగి పశ్చిమ సముద్రములోనికి ప్రవేశించినవి. జీమూత ద్రావణ మైనాక పర్వతములు దక్షిణ సముద్రము వైపునకు సాగియున్నవి. వజ్రము మైనాకము అను రెండు పర్వతముల నడిమికి తిన్నగా అగు విదిక్కు (మూల) నందు దక్షిణాపథ పరిసరములలో సంవర్తకుడను సముద్రవానియగు అగ్ని సముద్రపు నీటిని త్రాగుచుండును. అతనికే ఔర్వుడు-బడబాముఖుడు అనియు వ్యవహారములు.
పూర్వము ఇంద్రుడు తమ రెక్కలు భేదించరాగా ఆ భయము వలన ఈ పర్వతములు నాలుగు లవణోదధియందు ప్రవేశించెను. ఈ పర్వత ప్రదేశములందు చంద్రుడు మాసపు శుక్ల కృష్ణపక్షముల రెంటను సమాకృతియై కనబడును. ఈ పర్వతములు నాలుగును భారత వర్షమునకు సహాయకములని (ఉపకారములని) పెద్దలు చెప్పుచున్నారు. వేరు ప్రదేశములందు అతడు ఉదయించకపోయి నప్పటికిని ఇచ్చట చంద్రుని అన్ని కాంతులును (ఎల్లప్పుడు) కనబడుచుండును.
ఈ ఎనిమిది వర్షములందును జనులు ఆరోగ్యము ఆయుఃప్రమాణము ధర్మార్థకామ ప్రవృత్తులు తత్సిద్ధులు-ఈ విషయములందు ఒకదానికంటెను మరియొకటి రెట్టింపు చొప్పున అధిక్యము కలిగియుందురు. ఆ వర్షములన్నిటియందును ప్రాణులు ధర్మము విషయమున ఆయా సందర్భములలో మేలుతరములయి యుండును. ఆయా వర్షములందు నానాజాతుల భూతములు నివసించుచున్నవి. నానా జాతుల జనులు నివసించుచున్నాడు. ఈ విధమగు ఈ విశ్వమును తనయందు ధరించుచు ఈ భూమి ఇట్టి వర్షాది విభాగములతో ఉన్నది.