ఈశ్వరుడు త్రిపుర విజయమునకై వెడలుట

సూతుడిట్లు చెప్పనారంభించెను, బ్రహ్మాదులు తన్నిట్లు స్తుతించుచుండ దేవదేవుడు అగు మహేశ్వరుడు బ్రహ్మ నుద్దేశించి ‘దేవతలకు మహాభయ మెవరి వలన?’ అని యడిగి ఇంకను ఇట్లు పలికెను: దేవతలారా! మీకు స్వాగతమా! మీమనోగతమేమో చెప్పుడు. అది ఈయదగిన దగుగాక ఈయరానిదగుగాక: నాకు మాత్రమది ఈయరానిదికాదు. సురశ్రేష్ఠులారా! మీరు కోరు అభీష్టమేదైనను అది తప్పక ఇత్తును. నేను ఆచరించుచు మహోగ్రతపము కూడ మీకొరకే. మీకు ద్వేష్యులు నాకును ద్వేష్యులే; వారు నాకు నీచులు నీచతరులు కూడ; అట్లే మీకు శుభమగు విషయము నాకును శుభమయినదే.

ప్రీతితో శివుడిట్లు పలుకగా యజ్ఞమున భాగార్హులగు బ్రహ్మాది దేవతలందరును రుద్రునితో నిట్లనిరి: భగవన్! రౌద్ర (భయంకర) పరాక్రములగు దానవులు రౌద్రమగు తపమాచరించి తద్బలమున లోకములనే నిర్మూలించుచుండ భయమంది నిన్ను శరణు చొచ్చితిమి. త్రినేత్రా! మయుడను కలహప్రియుడగు దైత్యుడు రాజార్హములగు శ్వేత గోపురములు గల త్రిపుర దుర్గము నిర్మించెను. శ్రేష్ఠమగు ఆ దుర్గమాశ్రయించి దానవులు వర ప్రభావమున నిర్భయులై ప్రభువులు తమ సేవలనువలె మమ్ము బాధించుచున్నారు. వారు నందనాది వనములు భగ్నమొనర్చినారు. మేలగు రంభాద్యప్సరసలనెల్ల హరించినారు. ఇంద్రుని వాహనము లగు ఐరావత కుముదాంజన వామనములను చంద్రుడు మొదలగువారి వాహనములగు అశ్వములను దానవులు హరించినారు. వారు వానిచే తమ రథములు లాగించుకొనుచున్నారు. ఇంత ఏల? మారథములు గజము అశ్వములు స్త్రీలు ధనము సమస్తమును అపహరించుటే కాక దైత్యులు మాజీవితములే సంశయాస్పదములు చేసినారు.

ఇంద్రాది దేవత లిట్లుపలుక దేవేశుడు వరదుడు వృష వాహనుడగు త్రినేత్రుడు వారితో ఇట్లు పలికెను: దేవతలారా! మీరు దానవుల వలన భయపడ వలసిన పనిలేదు; నేనది తొలగింతును. అందులకై నేను త్రిపుర దుర్గమును దహింతును. మీరందులకై చేయవలసినది చెప్పెద వినుడు; అట్లు చేయుడు. నేను దానవులతోకూడ మయుని త్రిపుర దుర్గమును దహించుట మీకిష్టమైనచో-తడవు చేయక-నాకు తగిన రథమును సిద్ధపరపుడు. దిగ్వస్తుడగు శివుడట్లు పలుక బ్రహ్మాది దేవతలు అట్లేయని మహాదేవునితో పలికి వారుత్తమ రథమును సిద్ధపరచిరి. భూమియే రథము: శివుని పార్శ్వచరులిద్దరు కూబరములు (కాడికొనలు) మేరుపర్వత శిఖరము కూర్చుండు స్థానము; మందర పర్వతము ఇరుసు; చంద్రసూర్యులు ఇద్దరును బంగరు వెండి చక్రములు; శుక్ల కృష్ణపక్షములు రథనేమిద్వయము; నాగులలో మొదటి ఇద్దరు (శ్రేష్ఠుడు-వాసుకి) తక్షకుడు కంబళాశ్వతరనాగులు అనునాగులను త్రాళ్ళుగా చేసి శుక్ర బృహస్పతి బుధ అంగారక శనైశ్చరులను ఆయా రథ భాగములుగా చేసి ఈ భాగముల నాత్రాళ్ళతో బిగించి కట్టిరి. ఆకాశము ఆ రథమునకు దారు నిర్మిత రక్షణ పంజరము. మరి ముగ్గురు నాగశ్రేష్ఠులు బంగారు త్రివేణువు (అను రథపు ముందు భాగమునందలి త్రిభుజాకారపు అమరిక) గంగ సింధు శతద్రు చంద్రభాగ ఇరావతి వితస్త విపాశయమున గండకి సరస్వతి దేవిక సీత సరయూ అను నదులు అమ్ములపొదలు; ధార్తరాష్ట్ర కర్కోటక వాసుక్యైరావత జాతినాగులు తూణీరము లందలి శరములు అయ్యెను.

సురస-సరమ-కద్రువ-వినత-శుచి-తృష్ణ-బుభుక్షా-ఉగ్రవేదన-చిత్రసంభవ-బ్రహ్మత్య- గోహత్య-అశ్వహత్య మొదలగు భయానకతత్త్వములు గదలుగా శక్త్యాయుధములుగా నయి రథమున నిలిచెను. కృతయుగము కాడి-చాతుర్హోత్ర యజ్ఞము సారథి కూర్చుండుస్థానము - చతుర్వర్ణములు విలాసవంతములగు వన్నెల కుండలములయ్యెను. కృతయుగమువలె ధర్మ యుతమై ప్రకాశించు ఆగొప్పకాడిని రథశీర్షమున (అగ్రభాగమున)నిలిపి విషవంతుడగు ధృతరాష్ట్ర నాగునితో బంధించిరి. ఋక్సాయజురాథర్వణవేదములు నాలుగు గుర్రములయ్యెను. అన్న దానాది దానములు అశ్వములకు వేలకొలది భూషణము లయ్యెను. పద్మమహాపద్ములు తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు అను నాగులు గుర్రములను కట్టి వేయి పగ్గములయ్యెను. ఓంకారము నుండి జనించిన క్రతుప్రియములగు సర్వస్తోమములును పశుబంధ యజ్ఞములందు వినియుక్త మగు ఉపద్రవ ప్రతీహారాదికముల ఉపవాహ్యములు ఇవన్నియు వేలకొలది మణులు ముత్తెములు పగడములు మొదలగునవి అయ్యెను. ప్రణవము కొరడా వషట్కారము ఆకొరడాకొన - సినీవాలీ (చంద్ర దర్శనము కల అమావాస్య) కుహూ (చంద్రదర్శనములేని అమావాస్య) రాకా (నిండు పున్నమ ) భానుమతి (సూర్యు డస్తమించుటకు ముందే చంద్రోదయమగు పూర్ణిమ-ఇట్టి పర్వతిథు లన్నియు గుర్రములనుకాడితో కట్టు యోక్త్రములయ్యెను. నల్లనివి పచ్చనివి నీలవర్ణము. కలవి మాంజిష్ఠ (ఎర్రని) వర్ణముకలవియగు వ్యజన (ధవిత్ర)ములు (యజ్ఞములందుపయోగించు విసనకర్రలు) గాలిలో రెపరెపలాడు జెండాలయ్యెను. నాలుగు ఋతువులలో (వసంత గ్రీష్మములు ఒకటిగా హేమంత శిశిరములు ఒకటిగా లెక్కించగా) (ఆరు ఋతువులతో) చిత్రించబడిన సంవత్సరము ధనువయ్యెను. కాలాంశములన్నియు గట్టి అంబిక (బాణ)ముల మొనలు అయ్యెను. భగవానుడగు రుద్రుడు సాక్షాత్కాల మూర్తియగు సంవత్సరమే. అందుననే సత్వరూప ఉమ కాళరాత్రి రూప కావున ఆమె వింటినారి యయ్యెను. భగవానుడగు నీలలోహితమూర్తి త్రిపురముల దహించ సమర్థుడగు వీరుడయ్యెను. విష్ణు సోమాగ్ని దేవతాత్రయము ఒకటయి ప్రధాన బాణ మయ్యెను. అగ్నిరథి కూర్చుండు ఆసనము-సోముడు పీఠమున రథముతో బిగించు చీల(శల్యము) విష్ణువు; ఆ ఆసనపు శిఖాభాగము బాణమునకు ఆయా తేజస్సులతో పదును పెట్టిరి. బాణపు మొనయందు నాగరాజగు వాసుకి శత్రు సంహార సమర్థమగు తన కోరలయందలి జ్వలించు విషమును విడిచెను.

ఇట్లు దేవతలు తమ దివ్య ప్రభావముతో భూమిని రథశ్రేష్ఠమునుగా చేసి లోకాధిపతి యగు శివుని కడకు వచ్చి ఇట్లు పలికిరి: దేవ శత్రువుల సంహరించ సంకల్పించిన దేవా! ఇదిగో! ఈరథమును చక్కగా నిర్మించినాము. దహన మొనర్చుటలో నేర్పరివగునీవు దీని నారోహించి త్రిపుర దుర్గమును దగ్ధ మొనర్చుము. ఈ రథమును శంకరుడు చూడవలయునను కోరికతో మేరుశిఖరాకారమును త్రైలోక్యాత్మకమును నగు రథమును ఇట్లు వారు ప్రశంసించగా విషమలోచనుడగు ఆశివుడు ఆరథమును మాటిమాటికి చూచి చూచి మిగుల హర్షము చెందెను. దేవాధిపతియగు ఆశివుడు ఇంద్రాది దేవతలతో ఇట్లు పలికెను. దేవతలారా! నాకై మీ రీ రథ మును బాగుగా నిర్మించితిరి. ఇంతయోగ్యత కలిగిన రథమునకు యోగ్యుడవు సారథిని త్వరగా ఏర్పాటు చేయుడు. ఈమాటవినిన దేవతలు బాణములు దెబ్బలు తిని నట్లయిరి. ఇప్పుడేమి చేయవలయునని వారు చింతిల్లసాగిరి. మహాదేవునకు సాటియగు వాడు సారథిగా నుండదగిన వాడు విష్ణువు తప్ప మరెవ్వరును లేరు. అతడో-బాణము నాశ్రయించి యున్నాడు అని అలోచిం చుచు వారు బరువున పూన్చిన ఎద్దులవలె కొండతో ఢీకొనిన వృషభములవలె నిట్టూర్పులు విడువసాగిరి. అంతలో వారు బ్రహ్మదేవుని చూచిరి. లోకనాథుడగు ధూర్జటికి నేనే సారథి నయ్యెదనని బ్రహ్మ గుర్రముల (పగ్గముల)ను పట్టుకొనెను. వెంటనే దేవతలును గంధర్వులును బిగ్గరగా సింహనాద మొనరించిరి. బ్రహ్మ సారథియై కొరడా పట్టుకొనుట చూచి హరుడు రథ మారోహించెను. మహాదేవుడు రథమారోహించుచుండ హరుని బరువునకు తట్టుకొనలేక గుర్ర ములు పీడితములై మోకాళ్లపై వంగి నేలపైపడి మట్టికరిచినవి. వేదాశ్వములట్లు పేదవడి ముడిగియుండుట చూచి మహాదేవుడు ఆర్తులగు తండ్రులను సుపుత్రుడు లేవనెత్తినట్లు లేవనెత్తెను. తరువాత మరల యుద్ధ స్ఫోరకమగు భయంకరమగు సింహనాదమును సాటిలేని జయధ్వనిని దేవతలు ఆశ్చర్యకరముగ నొనరించిరి.

ఓంకారమయమగు ప్రతోదమును (కొరడాను పట్టుకొని వరదుడు ప్రభుడు (మహా సమర్థుడు) నగు స్వయంభూ బ్రహ్మ భగవానుడు అశ్వములను తగిన విధమున అను మంత్రణము చేసెను. (మంచి మాటలతో నడచుటకు ప్రేరించెను.) అశ్వములు ఆకాశమును మ్రింగుచున్నవో - భూమిని విదలించి ఎగురగొట్టుచున్నవో అన్నట్లు పరుగందుకొనెను. శివునిచే ప్రేరితుడైన బ్రహ్మచే ప్రేరింపబడుచు ఆ వేద రూపాశ్వములు తమ వాక్కులతో సంసారగతిని పలుకుచు ప్రళయ కాల వాయువులో అనునట్లు ధనుర్ముక్తములగు బాణములో అనునట్లు మహావేగ వంతములై పోవుచుండెను. నంది అచట పరమేశ్వరేచ్ఛాను గుణముగా అత్యున్నత వినిర్మాణ ముకల ధ్వజ దండపు కొన నాక్రమించి వృషభపు రూపము ధరించి కూర్చుండెను. రవితేజస్కులు అథ ర్వాంగిరో ఋషులు రుద్రునకు ప్రీతిజనకులై దండములు చేత ధరించి రథచక్రరక్షకులయిరి. (కాలాత్ముడై) నరులకు అంతకరుడును భగవానుడు నగు శేషనాగుడు దానవులను దహింప గోరుచున్నాడో యనునట్లు రథమును అనుసరించి పోవుచుండెను. యముడు మహిషమును, వరుణుడు మకరమును, కుబేరుడు అశ్వమును, ఇంద్రుడు గజమును ఆరోహించగా వరదుడగు స్కందుడు వందల కొలది పించెములు కలిగి కింనరుడువలె కూయుచున్న మయూర మారో హించి వారితోపాటు తనతండ్రి రథమును రక్షించుచుండెను. వీర్యశాలియగు నందీశ్వర భగవానుడును శూలమును చేత ధరించి లోకక్షయకరుడేమో యనునట్లు రథమునకు పార్శ్వము లందును పశ్చాద్భాగముననుతానై యుండెను. అగ్నికవచులై ప్రమథులు అందరు రథము వెంట అగ్ని జ్వాలలు క్రక్కెడి పర్వతములో యనునట్లు నక్రములు మహార్ణవము వెంట పోయినట్లు పోవసాగిరి. భృగు, భరద్వాజ, వసిష్ఠ, గౌతమ, క్రతు, పులస్త్య, పులహ, మరీచ్యత్ర్యంగిరః ప్రాచేతసాది మహర్షులు వెంట పోవుచుండిరి వారు వచన విశేషములే విచిత్రాలంకారము లయియున్న వాక్కులతో అజితుడు అజుడు (ఓటమి నెరుగనివాడు పుట్టుకలేనివాడు) నగు హరుని స్తుతించుచుండిరి. ఇతరులును రెక్కలుకలదో యనునట్లున్న కాంచనరథశ్రేష్ఠ మారోహించి ఆకాశమున శివరథము ననుసరించి పోవుచుండిరి. ఏనుగులతో వృషభములతో మేఘములతో సదృశ్యులగు ప్రమథులు అందరును సజల మేఘములవలె ధ్వని చేయుచు తమ తమ దర్పము లతో కూడి దేవదేవుని పరివారించి రథమునకు అన్ని వైపులను క్రమ్మి పోవుచుండిరి. ప్రళయ మహార్ణవము వెంట మకరతిమి తిమింగిలాది జలజంతు సముదాయమువలె వారువెంట పోవు చుండ ఆ త్రిపుర రాహియగు రథశ్రేష్ఠము పిడుగుపాటుతో కూడిన మేఘమువలె ధ్వని చేయుచు ముందుకు సాగుచుండెను.