మత్స్య మహా పురాణము
గృహాది నిర్మాణకాల నిర్ణయము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, శుభమగు కాలమును తెలిసికొని అట్టి సమయ మందే భవన నిర్మాణము ఆరంభించవలెను. గృహారంభమునకు చైత్రము వ్యాధిప్రదము, వైశాఖము ధన రత్న ప్రదము, జ్యేష్ఠము మృత్యుకరము, ఆషాఢము భృత్యరత్న పశువృద్ధికరము, శ్రావణము భృత్యలాభదము, భాద్రపదము హానికరము, ఆశ్వయుజము పత్నీనాశకరము, కార్తికము ధనధాన్య వృద్ధికరము, మార్గశిరము అన్నవృద్ధికరము, పుష్యము చోరభయ ప్రదము, మాఘము బహులాభదాయకము, పాల్గునము కాంచనమును బహుపుత్రులను ఇచ్చును.
నక్షత్రములలో అశ్విని రోహిణి మూల ఉత్తరఫల్గుని ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మృగశిర, స్వాతి, హస్త, అనూరాధ మంచివి; అదిత్య మంగళవారములు కాక మిగిలినవారములు మంచివి. యోగములు: వ్యాఘాతశూల వ్యతీపాతాలి గండములు విడువదగినవి; విష్కంభగండ పరిఘ వజ్రయోగములు ప్రశస్తములు.
ముహూర్తములు: శ్వేత, మైత్ర, మాహేంద్ర, గాంధర్వ అభిజిద్, రౌహిణి, వైరాజ, సావిత్ర ముహూర్తములు ప్రశస్తములు.
దివాకాలమునగాని రాత్రియందుగాని ప్రత్యేకముగా పదునైదేసి ముహూర్తములకును వరుసగా 1. రౌద్రము, 2. శ్వేతము, 3. మైత్రము, 4. సారభటము, 5. సావిత్రము, 6. వైరాజము, 7. విశ్వావసువు, 8. అభిజిత్, 9. రౌహిణము, 10. బలము, 11. విజయము, 12. నైరృతము, 13. వారుణము, 14. సౌమ్యము, 15. భగము అని నామములు అని ఆథర్వణ జ్యోతిషము అను గ్రంథము చెప్పుచున్నది. ఈ సంప్రదాయమును దృష్టిలో ఉంచుకొనియే ఇచ్చట గృహారంభమునకు ఉచితములగు ముహూర్తములు పేర్కొనబడినవని గ్రహించవలయును.
ఇచట చెప్పిన ముహూర్తములు ఎనిమిది; అవి: 1. శ్వేతము-ఇది రెండవది; 2. మైత్రము- ఇది మూడవది; 3. మాహేంద్రము-మహేంద్ర పుత్రుడు విజయుడు కావున ఇది పదునొకండవది; 4. గాంధర్వము-విశ్వావసువు ఒక గంధర్వుడు; కావున ఇది ఏడవ ముహూర్తము; 5. అభిజిత్- ఇది ఎనిమిదవది; 6. రౌహిణము - ఇది తొమ్మిదవది; 7. వైరాజము-ఇది అరవది; 8. సావత్రము-ఇది ఐదవది. ఈ ముహూర్తములు గృహారంభమునకు మంచివి.
చంద్ర రవి బలమును శుభలగ్నమును విచారించుకొని అట్టి శుభసమయమందు స్తంభములు నిలువబెట్టుట మొదలగునవి (గృహ-భవన-నిర్మాణమున) చేయవలయును; ప్రాసాద నిర్మాణము-కూపవాపీ నిర్మాణము మొదలగు వానియందును ఇవియే నక్షత్రాదులని తెలియవలెను. (ప్రాసాదములు=దేవతా-రాజ-భవనములు)