క్రీడా వర్ణనము

ఒకతె పూవులు కోయుచు ఏరుచునుండు ఆమెను తీగలు చుట్టుకొనెను. ఆమెను పాపము! సఖులును ప్రియుడును విడిచిపోయిరి. ఒకతె ముఖము కమల గంధము కలదగుటచే శ్వాస వాయువులచే ఆకర్షింపబడిన తుమ్మెదలు మొగముపై గుంపుగా క్రమ్మి కలవరపరచగా ప్రియుడును ఆమెను విడిచి దూరముగా పోయెను. ఒకతె కంటిలో మకరందము పడెను. ప్రియుడు తన శ్వాసవాయువులతో కంటియందలి ధూళిని పోగొట్టి బాధ పోగొట్టెను. ఒకతె పూవులు కోసిఏరితెచ్చి ప్రియునకీయ అతడు వానితో కూర్చినమాల తన శిరమున నలంకరించుకొని ప్రకాశించెను. ఒకతె తానై పూవులు కోసి ఏరి వానిని మాలగా కూర్చి ప్రియుని శిరమున నలంకరించగా నాతడు తను ధన్యునిగాను మన్మథోద్దీపనము చేయగల సుభగునిగాను భావించెను. ఒకతె తన ప్రియుడు తనతో ఏకాంతమున విహరింపగోరి అదిగో! ఆ దట్టమైన పూబొద యందు ఎక్కువ పూలుగల తీగలున్నవని అటకుపోయి పూలు సేకరించసాగెను. అపుడు ప్రియు డామెను విలాసముగా తీగలతో కట్టివేయగా ఆమె తాను మిగిలిన తన చెలులందరికంటె  సర్వాధిక గుణములుగల సౌభాగ్యవతీయని భావించి తృప్త అయ్యెను.

సాటిలేని కాముకియగు ఒకతె గంధర్వులతో తాను క్రీడించుచుండియు ఆ సరస్సులయందు వేరువేరుగ ప్రతిఫలించుచున్న ఆరాజును చూచుచుండెను. నిర్మలమయిన చిరునవ్వు నిర్మల హృదయము కల ఒకతె నీటితో ప్రియుని కొట్టి మరల నాతడు తను నీటితో కొట్టగా సంతోషించెను. ఒకతె ప్రియుడు తను కొట్టుచుండ పోనిమ్మని ఊరకుండెను. అందుచే ఆమెకు ఒడలు చెమట పట్టుటయు నిట్టూర్పు వాయువులచే ఆమె వక్షోజములు నృత్యము చేయుటయు కానవచ్చెను. ప్రియుడు తను వెంటాడి కొట్టుటచే ఒకతెకు కొప్పు శిథిలమైనందున మొగమంతయు వెంట్రుకలు క్రమ్మగా తుమ్మెదలు క్రమ్మిన పద్మలతవలె కానవచ్చెను. ఒకతె తన కన్నులను పోలు తామరలు కొలనినిండ ఉండుటచే తన ప్రియుడు వెదకి వెదకి చాల సేపటి కామెను గుర్తించి దగ్గరకు వచ్చెను. ఒకానొక ప్రౌఢాంగన (సుఖానుభవములో నేర్పు మీరిన స్త్రీ) స్నానము చేయుటచే చలి వేయుచున్నదను నెపమున తనకు చిరాభిలషితమగు తన ప్రియుని ఆలింగనమును పొందగలిగెను. స్నానమాడినందున తాను ధరించిన సన్నని వలువ తన ఒడలి కంటుకొని పోయిన ఒకతె చూపఱకు కామభావమును ఉద్దీపింపజేసెను. ఒకతెను ప్రియుడు ఆమె కంఠ మందలి హారములు పట్టిలాగెను. లాగుచుండగా ఆ దారమును తెగినందున ఆ ప్రియుడు ముందునకు మ్రొగ్గిపడగా ఆమె నవ్వెను. ఒకతె మోకాళ్ళపై ఆమెకు చేరువగానున్న చెలి తన గోళ్ళతో క్షతము చేయగా ఆమె తడబాటుతో పోయి తన ప్రియునిపై పడి అతనితో చాలసేపు మాటలాడుచు కనబడెను. ఒకతె సూర్యునికి ఎదురుగా నిలిచి వెంట్రుకలారబెట్టుకొనుచుండియు కామార్తములగు నేత్రములతో తన ప్రియుని చూచుచు శిలాతలముపై కూర్చుండియుండుట కానవచ్చెను. ఇట్లా సరస్సు నీరంతయు మాల్యములతో నిండెను కెలికి వేయబడెను. స్తన కుంకుమముతో కలిసెను. ఇట్లది రత్నములు పొదిగిన బంగారు సొమ్ములవలె నయ్యెను.

ఇట్టి స్థితియందు కూడ చక్కగా స్నానమాడిన దేవస్త్రీలును దేవగంధర్వ స్త్రీలును దేవదేవుడగు జనార్దనుని పూజించుచుండుటను ఆరాజు చూచెను.

ఒకానొకచోట కొందరు (దేవ) స్త్రీలు తమ ప్రియులయందు తమ మనస్సులు లెస్సగా నిలిపి లతాగృహగతలయి తమ గాత్రముల నలంకరించుకొనుచుండుట రాజు కాంచెను. ఒకతె చేత అద్దముంచుకొని చూచుకొనుచు ఈన దూతి వచించు తన ప్రియుని వచనములు వినుచు మిగుల అందముతో ఒప్పెను. కామభావ పరవశయగు ఒకతె తను దూతి త్వరపెట్టుచుండ అందుచే జరుపుచున్న తన అలంకరణములో భూషణములు తారుమారును గురుతింపక పోయెను. ఒకానొకచోట వాయు ప్రేరణచే కదలు అతి సుగంధి పుష్పయుతమగు నల్లని పచ్చకబయట ఆయా పానీయముల త్రావు స్త్రీ లాతనిని కనవచ్చిరి. ఒక ఉత్తమాంగన తన ప్రియునిచే పాలు త్రావించుచుండెను. మరియొకతె తన ప్రియు డందించు పాలు త్రావుచుండెను. ఒకతె తన కన్నులవలె చంచలములగు నల్ల కలువ రెక్కలతో కూడి ఉన్న పాలు త్రావి నా కలువపూలెక్కడకు పోయెనని యడిగెను. నీవే అవి త్రావియుండవచ్చునని ప్రియుడనగా అప్పుడది గుర్తించి తానంతటి అమాయికురాలయినందులకు చాలసేపు సిగ్గుపడియుండెను. విశిష్టములగు రుచులు గల రసములతో మిశ్రితమగు కామవర్ధక పానీయమును తన ప్రియుడు త్రావి పిదప తనకందీయగా ఒకతె తానది త్రావెను. ఇట్లే జరుగుచుండిన ఆ పానగోష్ఠులందు తంత్రీవాద్యముల స్వరముతో విమిశ్రితమగు వివిధ గీతముల నాదేవస్త్రీలు పాడుచుండ రాజది వినెను. వారు అనుదినమును ప్రదోష సమయములందు అట్లే దేవదేవుడగు జనార్దనుని సన్నిధియందు నానావాద్య సహితముగా నృత్యము చేయుచుందురు. జామురాత్రి గడచిన తరువాత గుహా ముఖము నుండి వెలికివచ్చి తమకు తమకు ఏర్పరచబడిన ఆయా గుహలను తమ ప్రియులతో కూడి ఆవాసముగా చేసికొందురు. ఆ గుహలు నానాగంధాన్వితతలములయి సుగంధముల నీనుచుండును. నానా విధములగు పడకలు కుసుమాలంకరణములు వానియందుండును. ఈ విధముగ ఆ పర్వతమున అప్సరసలు చేయు ఆయా విహరణములను చూచుచుండియు వానియందాసక్తుడు కాక మహారాజు కేశవార్పితమానసుడై తపమాచరించెను.

ఒకప్పుడు ఆ గంధర్వాప్సరోగణములు రాజుకడకు పోయి ‘అరిందమా! నీవు వచ్చిన ఇది స్వర్గతుల్య దేశము. మేము నీకు మనఃకాంక్షిత వరముల నిత్తుము. అది గ్రహించిన తరువాత నీవిటనే యున్ననుసరే-ఇంటికి వెడలిననుసరే అనిరి. మద్రరాజు పురూరవసుడును “అమితమగు ఓజస్సుగల మీ దర్శనము వ్యర్థముకాదు. మధుసూదనుడు నన్ననుగ్రహించునట్లు వరమిండు” అనగా వారు ‘తథాస్తు’ అనిరి. ఆతడును ఒక మాసము కాలము జనార్దనుని పూజించుచు అటనేయుండెను. ఆతనికి లోలత్వము లేనందులకు ఆ గంధర్వాప్సరసలు సంతసించిరి. వారి కతడు ప్రీతిపాత్రుడయ్యెను. రత్న సహస్ర చిత్రమగు ఆ యాశ్రమమును ఆరాజు మాఘమాస మధ్యమున ప్రవేశించెను. ఫాల్గున మాసపు శీతోష్ణ భేదములతో ప్రీతి ననుభవించుచు ఒక మాసము గడపెను. ఫాల్గున కృష్ణ పక్షాంతమున రాజగు పురూరవునకు స్వప్నమున దేవ దేవుని శుభవచనము “రాజా! ఈరాత్రి గడువగనే నీకు అత్రిమునితో సమాన మగును. అందుచే నీవు కృతకృత్యుడవగుదువు.” అనుచు వినబడెను. ఇంద్రవిక్రముడగు ఆరాజర్షి ఇట్లు స్వప్నము కాంచి పిదప ప్రత్యూష కాలమున స్నానముచేసి నియతేంద్రియుడై కృతకృత్యుడనైతినను భావముతో జనార్దను నర్చించియుండెను. అంతలోనే కాంతితో జ్వలించుచు ఆత్రిముని ఆటకు వచ్చెను. ధార్మికుడగు ఆరాజు తన స్వప్న దర్శనమును ఆమునికి తెలిపెను. రాజా! ఇది ఇట్లే యగును. ఇందు సంశయింప వలసినపనిలేదు అని అత్రియు దేవతలును పలికిన పలుకులు అతనికి వినవచ్చెను. ఇట్లు దేవదేవుడగు జనార్దనుని వలన అనుగ్రహ మంది రాజు దేవతార్చన మును అగ్నిహోత్రమును జరిపి సర్వకామ పూర్తినొందెను.