రాజు విడువవలసిన పనులు

రాజు వేటను పానమును అక్షములను అనగా ద్యూత క్రీడను విడువవలయును; వీనిని సేవించిన రాజులు లెక్కలేనంతమంది నాశము నందిరి; రాజు వ్యర్థముగ తిరుగుటను విశేషించి పగటి నిద్రను విడువవలెను; వాక్పారుష్యము, దండ పారుష్యము చేయరాదు; పరోక్షనింద చేయరాదు; రెండు విధములగు అర్థదూషణములు కలవు; (అర్థము అనగా ధనమును ఆస్తియును) వీనిలో మొదటిది- ఆస్తియగు ప్రాకారములు విరుగగొట్టుట -పాడుచేయుట దుర్గములు మొదలగునవి సరిగ కట్టించకపోవుట చెడినవి బాగు చేయించక పోవుట- ఒకచోట ఒక విధముగా నుండవలసినవి మరియొక చోటను మరియొక విధముగను నిర్మింపజేయుట మొదలగునవి; రెండవ విధమగునది-దేశకాల పాత్రము లెరిగి దానము చేయకపోవుట-అనుచితములగు విషయములకై ధనము వెచ్చించుట మొదలగునవి; మొదటిది-అర్థములను దూషించుట రెండవది అర్థములందు దూషించుట అనబడును, కామక్రోధలోభ మదమాన హర్షములను ప్రయత్న పూర్వకముగను విడుచుట యందాదరముతోను-విడువవలయును; ఈ దోషములను జయించిన తరువాత రాజు భృత్యులను (రాజోద్యోగులను) జయించి లోబరచుకొనవలెను; అనంతరము పౌర జానపదులను లోబరచుకొనవలెను.