మత్స్య మహా పురాణము
రోహిణీ చంద్రశయన వ్రతము
నారదుడు ఈశ్వరుని ఇట్లడిగెను, “చంద్రమౌళీ! మానవుడు ఏవ్రత మాచరించినచో ఇహ లోకమున నిరంతరముగా దీర్ఘాయురారోగ్య వంశాభివృద్ధి సర్వగుణ సమృద్ధులు పొందునో అట్టి వ్రతము నుపదేశింపుము” అనగా ఈశ్వరుడిట్లు తెలిపెను, నీవుచక్కగా అడిగితివి. పురాణవేత్తలు చెప్పెడి వ్రతము ఒకటి పరలోకము నందు కూడ అక్షయ ఫలముల నిచ్చునది కలదు. అది చెప్పెదను. రోహిణీ చంద్రశయన వ్రతము ఉత్తమమయినది. ఈవ్రతమున నారాయణ ప్రతిమను చంద్రనామములతో పూజించవలెను. పూర్ణిమా సోమవారముకాని రోహిణితో పూర్ణిమ కాని ఐననాడు ద్విజులు) పంచగవ్యములతో అవపిండితో స్నానముచేసి “ఆప్యాయస్వ సమేతు తే” అను మంత్రమును అష్టోత్తరశతము జపించవలెను. శూద్రులయినచో పాషండ (వేదవిరుద్ధము లగు) వచనములు పలుకక ఇదే స్నానముచేసి వరదుడగు సోమునకును విష్ణునకును నమస్కార మను అర్థమిచ్చు ఈ మంత్రమును అష్టోత్తరశతము జపించవలెను. పిమ్మట నదీతీరము నుండి స్వగృహమునకు వచ్చి చెప్పబోవు విధమున చంద్రనామములతో విష్ణుపూజ చేయవలెను.
వ్రత దినమున హవిష్యాన్నమును (ఉప్పు కారము పులుపు తైలములేని ఆహారము- అదియును కేవలము బియ్యముతో పాలు పెసరపప్పుకాని సాత్వికములగు బీరవంటి కూర ముక్కలుకాని కలిపి అత్తెసరు పెట్టి వండిన అన్నము) తిని నేలపైనే పండుకొనవలెను. తెల్లవారి లేచిన తరువాత స్నానము చేయవలెను. బ్రాహ్మణునకు బంగారముతో కూడ జలపాత్ర దానమీయ వలెను. (పగలంతయు) ఉపవాసముండి గోమూత్రము మాత్రము ఆహారముగా తీసికొనవలెను. (రాత్రి) (మాంసాహారులు) మాంసము ఉప్పు పులుపు కారములేని ఆహారము ఇరువదెనిమిది ముద్దలు తినవలెను. ముహూర్తకాలము ఇతిహాసము వినవలెను. చంద్రరూప విష్ణుప్రీతిగా కడిమి- నల్లకలువ-మొగలి-జాజి-తామర-శతదళ పద్మము-వాడగన్నేరు-వాడని తామర-ప్రేంకణము-మల్లె-తెల్లని కరవీరము (ఎర్ర గన్నేరు ఆకులవంటి ఆకులుకల చెట్టున పూచెడి తెల్లని పూలు) (కరవీరము) ఎర్రగన్నేరు-సంపెంగ ఈ పండ్రెండు విధములగు పూలు శ్రావణము మొదలుగా ఆయా మాసములందు ఏమాసమునందు వ్రతముచేయుదుమో ఆ మాసము వంతునకు వచ్చు వానిని పూజకుపయోగించుట శ్రేష్ఠము.
ఇట్లొక సంవత్సరము వ్రతము జరుపవలెను. అనగా పూర్ణిమా సోమవారము కాని (కార్తీకమాసములో ఐనచో పూర్ణిమా రోహిణీ నక్షత్ర దినమునకాని ఆరంభించి తరువాత ప్రతి పూర్ణిమనాడును వరుసగ చేయవలయును. వ్రతము (సంవత్సరము) ముగిసిన తరువాత అద్దములు ఇతర పరికరములు అలంకారములు-వీటితో కూడ మంచము చేయించవలెను. ఆరంగుళముల చంద్రప్రతిమను నాలుగంగుళముల రోహిణీ ప్రతిమను బంగారుతో చేయించ వలెను. (అంగుళము=ఎనిమిది యవగింజలు అడ్డముగా ఒకదాని ప్రక్కను ఒకటిగా పెట్టుటచే అగు పొడవు-3/4 బ్రిటిషు అంగుళము) ఎనిమిది ముత్తెములు రోహిణికి కంటి ఆవరణ వస్త్రమును పాలపాత్రపై అక్షతలునింపిన కంచుపాత్రము-మంచి వస్త్రముల జత-భూషణము(లు) - శంఖము - భోజనము - తెల్లని బియ్యము - చెరకు – పండ్లు - మొగమున బంగారు బిళ్ల- వెండి గిట్టలు-వెండి కొమ్ములు పైని వస్త్రము-పాలు పిండు పాత్ర-దూడ-కల-పాడియావు- ఇవి అన్నియు ఉదయమున మంత్రపూర్వకముగా విప్రదంపతులకు దానమీయవలెను. సర్వ లక్షణములు సర్వ సద్గుణములుకల ఆ విప్రదంపతులను అలంకరించి వారిని లక్ష్మీవిష్ణ్వాత్మకులైన రోహిణీచంద్ర రూపులనుగా భావించవలెను. “విష్ణూ! రోహిణీరూపయగు లక్ష్మి చంద్రరూపుడవగు నిన్ను విడిచివెళ్లనట్లే నాకును ఆయా ఐశ్వర్యములతో భేదముకలుగకుండు గాక! చంద్రా! నీవు సర్వ భూతములకు పరమానందప్రదుడవు. కనుక సంసారభీతుడనై, ముక్తికాముడనైన నాకు నీయందలి దృఢభక్తిచే భుక్తిముక్తులు కలుగుగాక!” అని ప్రార్థించవలెను.
ఇది రూపాయురారోగ్య ప్రదమగు ఉత్తమ వ్రతము. పితృదేవతా స్త్రీ ప్రీతికరము. దీని నాచరించినవారు ఇరువదియొక్క వందల కల్పముల కాలము త్రిలోకాధిపతియై బ్రహ్మజ్ఞానము పొంది ముక్తినందును. స్త్రీలు దీని నాచరించినను ఇదే ఫలము కలుగును.