గోమేధ, పుష్కర ద్వీప వర్ణనము

ఇది దధిసముద్రమునకు ద్విగుణ పరిమాణముగల స్వాదూదక (తీయనీటి) సముద్రముచే చుట్టబడినది. ఈద్వీపపు విస్తరము శాల్మలద్వీప విస్తరమునకు ద్విగుణము. దీనియందు జాత్యంజన మయమగు (స్వాభావికమగు కాటుకతో ఏర్పడిన) 1. సోమకము-సర్వౌషధి సమన్వితము మహోన్నతము సువర్ణమయమునగు; 2. కుముదము అను రెండు పర్వతములున్నవి. హవ్యుడను మను పుత్రునకు ధాతకి-కుముదుడు అను కుమారులు ఇద్దరు కలరు. సోమక పర్వతముగల ప్రథమ ఖండము ధాతకిచే పాలితమై ధాతకీఖండము-కుముద పర్వతము గలదియు గోమేద వర్షమని ద్వీపనామముతోనే ప్రసిద్ధమును సర్వసుఖమయమునగు రెండవ ఖండము కుముదునిచే పాలితమయి కుముదఖండము-అని ప్రసిద్ధములు.

ఈ సోమక కుముద పర్వతములు రెండును వృత్తాకృతులును మహోన్నతములును; సోమకము ద్వీప పూర్వార్ధ మందున్నది. దీని పాదములు (ప్రత్యంత పర్వతములు) తూర్పునకు సముద్రమువరకు సాగియున్నవి. కుముదము ఇట్లే ద్వీప పశ్చిమ భాగమున నున్నది. దీని ప్రత్యంత పర్వతములు పడమటగా సముద్రము వరకు సాగి ఉన్నవి. ఈ పర్వత పాదములు ద్వీపమును రెండుగా విభజించుచున్నవి. దక్షిణార్థము ధాతకీఖండము, ఉత్తరార్ధము కుముద ఖండము. గోమేద ద్వీపము నందు దేశములనినను వర్షములనినను ఈరెండే. (ఈ ద్వీపము ఆస్ట్రేలియా అని భావింపవచ్చును.)