సావిత్రి ఉపాఖ్యానము

సూతుడు ఋషులకు ఇట్లుచెప్పెను, అనంతరము అమిత విక్రముడగు మనురాజు పతివ్రతల మాహాత్మ్యమును తత్సంబంధిని యగు కథను తెలుపుమని దేవేశుడగు మత్స్యుని ఇట్లడిగెను: పతివ్రతలలో శ్రేష్ఠ ఎవరు? ఏ పతివ్రత మృత్యువును జయించెను? ఏ పతివ్రతా నామమును నరులు సదా కీర్తించదగును? సర్వ పాపక్షయకరమగు ఈ విషయమును నాకు తెలుపుము: అనగా మత్స్యుడు ఇట్లు చెప్పెను; ధర్మరాజు కూడ పతివ్రతలగు స్త్రీలకు ప్రతికూల మాచరించడు; ధర్మజ్ఞా! అతనికి కూడ వారు పూజ్యలే; ఈ విషయమున నీకు పాప ప్రణాశనమును స్త్రీ తన భర్తను మృత్యు పాశము నుండి విడిపించిన తీరును తెలుపునదియునగు కథను తెలుపుదును. పూర్వము మద్ర దేశములందు శాకల వంశమున అశ్వపతియను రాజుండెను; అతడు అపుత్రుడై సంతాపమందుచు పుత్రార్థియై సర్వకామ ప్రదాయినియు ద్విజులచే రక్షించ (ఆరాధించ) బడునదియునగు సావిత్రి నారాధించెను, నూరుమంది సర్వులచే పది మాసముల పాటు తెల్లని అవలతో ఆమెనుద్దేశించి యజించిన తరువాత ఒక చతుర్థీ తిథినాడు ఆమె రాజునకు సాక్షాత్కరించెను; రాజన్! నీవు నాకు భక్తుడవై ఉంటివి, నీకు ఉత్తమయగు పుత్రిని ఇత్తును, ఇట్లు నా ప్రసాదముచే ఈయబడిన పుత్రిని నీవు పొందగలవు, ప్రతుడగు ఆ రాజుతో ఈమాత్రము చెప్పి ఓ మనుచక్రవర్తీ ఆదేవి మెరపువలె అదృశ్య అయ్యెను. ఆరాజునకు మాలతియను పతివ్రతయగు పత్నియుండెను! ఆమె రూపమున సావిత్రీ దేవిని పోలు సుతనుకనెను; సావిత్రిచే ప్రీతితో ఈయబడిన సుత ఆమెవలె రూపవతి అగుట ఉచితమే కదా! అందుచే ఈమె పేరు సావిత్రి అగుగాకయని నృపతి విప్రులతో అనెను, వారును ఆమె పేరు సావిత్రియని అంగీకరించిరి.

ఆమె యౌవనవతి యగుటచూచి తండ్రి ఆమెను సత్యవంతున కిచ్చెను; తరువాత నారదుడు దీప్తతేజస్కుడగు ఆ రాజుతో ఈ నృప పుత్రుడు ఇక సంవత్సరములో క్షీణాయుడు (మృతుడు) అగును; రాజా! కన్యను బాగుగా ఆలోచించియే (వరునకు) ఈయవలెను అనెను, అయినను అనరాధిపుడు శుభుడు అని ఆద్యుమత్సేన పుత్రునకు (సత్యవంతునకు) తన కన్యనిచ్చెను; సావిత్రియును తనభర్త దగ్గరకుపోయి ఆద్యుమత్సేన రాజగృహమున (నగరమందు కాదు) వనమందే-తాను నారద వచనములతో మనస్సునందు బాధపడుచుండియు-అత్తమామలకు శుశ్రూష చేయుచుండెను; నరాధిపుడగు ద్యుమత్సేనుడు రాజ్యభ్రష్టుడును కండ్లులేనివాడునునై రాజపుత్రియగు ఈ కోడలిని పొందియు సంతుష్టుడు కాకపోయెను; (ఈమెయు తమతో పాటు క్లేశపడుచున్నందుల కతడు బాధనందుచుండెను;) ఋషులారా! ఇక నాలుగవవాడు సత్యవంతుడు మరణించుననగా ఆ రాజపుత్రి సావిత్రి ధర్మజ్ఞ కావున మూడు అహోరాత్రములు ఉపవసించెను; ఇక ఆ (నాలుగవ) దినమున ఆమె మనోహరములగు పూలుదాల్చి ఫలములు తిని వనమునకు పోయెను; అడిగినది కాదనినచో ఆమె ఏమనుకొనునో అని భయపడు మామగారి అనుమతితో సావిత్రి ఆర్త అయి తనమనస్సునందలి మహాభయమును బయలు పడనీయక బాధనందు మనస్సుతోనే భర్తతో కలిసి మహా వనమునకు పోయెను; వనమందామె వృక్షచ్ఛాయ నాశ్రయించి కూర్చున్న భర్తను (మీకు ఎట్లున్నదని) అడిగెను; నృవీరుడగు అతడును వనమందుండి శ్రమ నందిన పంకజ పత్రనేత్రయగు ఆరాజపుత్రిని ఆమెకు వనమందలి వృక్షములను చూపుచు ఓదార్చుచు మనస్సునకు ఉల్లాసము కలిగించెను.

సత్యవంతుడు ఇట్లు పలికెను, ఈ వనమునందు పక్షులతో వ్యాప్తమును నయనములకును ముక్కులకును సుఖకరమును వసంత ఋతువునందు ఆనంద వర్ధకమును అగు మనోహరమై తీయమామిడి చెట్టును చూడుము, విశాలలోచనా! ఇందు (చిగురాకులచే) ఎర్రదనము కలదియు చక్కగ పూచినదియు అగు ఈ అశోక వృక్షమును చూడగా వసంతుడు నన్ను చూచి నవ్వుచున్నాడేమో అన్నట్లున్నది; దక్షిణ (అనురాగ) భావము కలదానా! ఈ దక్షిణ దిశ యందు ప్రజ్వలించు అగ్నితో సమానకాంతిగల పూచిన మోదుగలతో రమ్యమగు ఈ వనస్థలిని చూడుము; సువాసనకల పూలవాసనతో నిండినదియు వనశ్రేణి నుండి వెలువడి నదియు అగు వాయువు మనపై దాక్షిణ్యము చూపుచు శ్రమ పోగొట్టుచున్నది; విశాలనేత్రా! ఈపడమటి దిశలో చక్కగా పూచిన కర్ణికార వృక్షములతో మనోహరమగు ఈ వనశ్రేణి బంగారుతో అలంకరించబడినట్లు ప్రకాశించుచున్నది; అతిముక్తలతా సమూహములతో ఆక్రమించబడిన మార్గము కలదై ఈ వనస్థలి మనోహర సర్వాంగీ! కుసుమ సమూహముతో అలంకరించబడినదో యనునట్లు కనబడుచున్నది; తేనెత్రావి మత్తెక్కిన తుమ్మెదల ఝంకారమను మిషతోకాముడు హింసాదృష్టితో ఈదగ్గరలోనుండి చాపమును ఎక్కుపెట్టి లాగుచున్నాడో అనునట్లున్నది; పండ్ల (రసము)ను ఆస్వాదించుటచే ప్రకాశించు నోరుగల గండు కోయిలల నాదముతో నిండిన ఈ వనస్థలి అందమైన తిలక వృక్షములు కదలుగుటచే అందమగు తిలకముతో అలంకృతవగు నిన్ను పోలియున్నది. మామిడి కొమ్మకొనపై ఈ కోకిల పుష్పమంజరుల పరాగముతో పింజర (తెలుపు ఎరుపు కలిసిన) వర్ణము కలదై ఉండియు ఉత్తమవంశమున పుట్టినవాడు తన కార్యములతో వలె ఇది తన కూతలతో తాను ఇదియని స్పష్టముగా తెలియుచున్నది; తుమ్మెద పుష్పరేణువులు ఒడలినిండ పులిమికొనిన తన ప్రియురాలిని వెంటనంటుచు ఝంకారము చేయుచు పూవుపూవునకు తిరుగుచున్నది; మామిడిచెట్టున పూవులు చాలఉన్నను పడుచు గండుకోయిల తన ప్రియురాలు ముక్కుతో పొడిచిన మామిడి పూగుత్తినే ఆస్వాదించుచున్నది.

ఆచెట్టు కొనపై మగకాకి ప్రసవించి తన శిశువును రెక్కలతో కప్పి పెట్టుకొనియున్న తన ప్రియురాలిని తన ముక్కుకొనతో స్పృశించి ఆదరించుచున్నది. కామ పరవశమగు పడుచుకపింజల పోయి తన ప్రియురాలితో కూడి భూభాగమును చేరి ఆహారమును కూడ తినకున్నది; కలవింకపక్షి ప్రియురాలి ఒడిలోచేరి ఆమెను మాటిమాటికి ఆనందపెట్టుచు కాముకులను రెచ్చగొట్టుచున్నది. ఈచిలుక తన ప్రియతో కూడి రెమ్మపై కూర్చుండి తన బరువుతో ఆ రెమ్మ వంగుచుండ అవ్యక్తమును మధురమును అగు పలుకులు పలుకుచున్నది.

ఇదుగో! అడవిలో ఇటు చూడుము. సింహము మాంసమును ఆస్వాదించి తృప్తినంది నిదురించుచున్నది; దాని ప్రియురాలు తన ప్రియుని కాళ్ళనడుమ పండుకొని యున్నది; పర్వత కందరపు నడుమ చూడుము; పులి దంపతులు ఉన్నవి; వాని కనుల వెలుగులో గుహచీలెనో అనునట్లు కనబడుచున్నది; ఇదిగో: ఈ చిరుతపులి మాటిమాటికి నాలుక కొనతో తన ప్రియను నాకుచున్నది; తన ప్రియురాలు కూడ తనను నాకుచుండ చాల ఆనందపడుచున్నది; ఈ ఆడుకోతి తన తొడపై తలపెట్టుకొని మైమరచి నిద్రించుచున్న మగకోతి పేలు తీసివేయుచు, తన ప్రియునకు హాయిగొలుపుచున్నది. నేలపై వెలకిలపండుకొనియున్న ఆడుపిల్లికి నొప్పికలుగకుండగనే దానిని తన గోళ్ళతో దంతములతో నొక్కుచు (హాయిగొలుపుచు)న్నది. ఈ ఆడు, మగ చెవులపిల్లులు తమ కాళ్ళనడుమ ఒడలు ముడిచికొని నిద్రించుచుండ అవి కనబడకున్నను వాటి చెవులను బట్టి మాత్రము అవి ఇవి అని తెలియుచున్నది; కామాతురమగు ఈ మగ ఏనుగు తామరపూలతో నిండిన సరస్సునందు తనప్రియురాలికి తామరతూడులతునుకలు తినుట కందించుచు ఆదరించుచున్నది; ఆడు అడవిపంది తన పిల్లలు తన వెంట వచ్చుచుండ తన ప్రియుని అనుసరించుచు అందమగు ముట్టెతో త్రవ్వి ఎత్తిన ముస్తెలను తినుచున్నది. దృఢదేహసంధులు కల అడవిదున్న ఇదిగో! ఈ అడవిలో బురద నిండిన ఒడలితో నుండినదై ఎంతో ఆసక్తితోను పొగరుగాను తన ప్రియురాలు పరుగెత్తి పోవుచున్నను దాని వెంటనంటి పోవుచున్నది.

మనోహరాంగీ! కుతూహలముతో తనవైపు చూచునన్నును నా భార్యనగు నిన్నును ఈ సారంగము చూచుచున్నది; నీవుకూడ గట్టిగ చూచినచో బెదరునేమో! నీవు దానిని నీకడగంట చూడుము, ఇటుచూడుము, ఆడురోహిమృగము వెనుకకాలితో తన మొగమును గోకికొనుచున్నది; అదే సమయములో అది తన హృదయమందలి స్నేహార్ర్ధ్ భావముతో తనకొమ్ము కొనతో తన భర్తను దగ్గరకు లాగి కొనుచున్నది. నడువక కదలక కూర్చున్న చమరీ (ఆడు చమర) మృగమును త్వరగ చూడుము, దానితోక కుచ్చుకాని రోమ సమూహముకాని ఎంత తెల్లగనున్నదో! మగ చమరము కాముకమై తన ప్రియురాలి అంటిపెట్టుకొని యుండి ఠీవిగా నన్ను చూచుచున్నది. ఎండలో ఆగవయమును చూడుము; నెమరువేయుచు తన మూపురముపై నున్న కాకిని తోలు కొనుచు తన భార్యతో కూడి సంతోషముగానున్నది; రేగు ఆకులు తినదలచి ఆ చెట్టు పెనుకొమ్మపై ముందరి రెండు కాళ్లుంచిన అడవి గొర్రె పొట్టేలును దాని భార్యను చూడుము; (జల పక్షుల వర్ణనము) చక్కని ముత్తెములతో అలంకృతమయిన చంద్రబింబపు శోభతో నుండి అతినిర్మలమగు సరస్సునందు సంచరించుచున్న ఆ హంసదంపతులను చూడుము; సుందరీ! అటుచూడుము; తన భార్యతోకూడి సరోమధ్యమందుండిన చక్రవాక పక్షిని చూడుము, అది ఈపద్మసరస్సునకు చక్కనిపూలతో అలంకరించుకొనిన సుందరికి ఉండు అందమును సంతరించుచున్నది; సరియేకాని - సుందరీ! ఇంతవరకు నేను పండ్లు ప్రోవుచేయగా నీవు పూలు సేకరింతివి; కాని కాష్ఠములు ప్రోవుచేయుట కాలేదు; ఇపుడిక ఆ పని చేయుదును; భామినీ! నీవు అంతలో ఒక క్షణకాలము ఈ సరస్తట మందలి చెట్టు నీడను ఆశ్రయించి విశ్రాంతి తీసికొనుచు నా కొరకు ఎదురుచూచుచు ఉండుము; అంతలో నేను వత్తును అనిన సత్యవంతుని మాటలు విని సావిత్రి- సరే; నీవు చెప్పినట్లే చేయుదును, కానిమ్ము; ప్రియా! నీవు మాత్రము నా దృష్టి పథము నుండి దూరముగా పోవలదు; ఈ కారడవిలో నాకు భయమగును” అనెను అంతట సత్యవంతు ఆ రాజపుత్రికి దూరము కాకుండగానే ఆ సరస్సునకు దగ్గరలోనే అడవిలో కట్టెలు సేకరించసాగెను. కాని ఆమె మాత్రము తన పతి మరణించినట్లే తలచెను.