దేవదానవ యుద్ధారంభము

సూతుడు శౌనకాదులకిట్లు చెప్పసాగెను, సురాసురుల ఆ పరమదారుణ సమ్మర్దము నందు ఇరుసేనలయందును గొప్ప త్రొక్కిసలాటయయ్యెను. దేవదైత్యుల గర్జనలతో శంఖ భేరీ తూర్య ధ్వనులతో ఏనుగుల ఘీంకారములతో గుర్రపు గుంపుల సకిలింతలతో, రథపు చక్రపు పట్టాల చప్పుడులతో, శూరుల విండ్లనారుల మ్రోతలతో మహాతుముల మయ్యెను. పరస్పర జయవాంఛతో అతిరోష పూర్ణులయి జీవితత్యాగమునకు సిద్ధపడిన ఉభయుల సేనయు ఒకరి సేనను మరి యొకటి సమీపించి ప్రక్రమముగాను విలోమముగాను ఎదిరించుకొనసాగిరి. రథము పదాతి మీదకు వచ్చును. రథము మీదకు గుర్రము దుముకును. ఏనుగు పదాతితో పెనగులాడును. రథికునితో రథికుడుతలపడును. ఏనుగులతో ఏనుగులు, ఏనుగులు గుర్రములతో, అనేక గజ ములతో ఒక ఏనుగు, అనేక పదాతులతో అనేక గజములు, ఒక పదాతి అనేక గజములతో తలపడుచుండెను.

ఇంకను ప్రాసవజ్ర గదాభిండివాల ఖడ్గ పట్టిశశక్తిముసల శూలముద్గర కుణిక గదలతోను చక్రపరశు తోమరాంకుశములతోను కార్షినాళీఆ ఆయుధములతోను నారాచ బాణములతోను వత్సదంతార్ధ చంద్రభల్ల శుకతుండా యుధములతోను ఆకాశమునందు అత్యాశ్చర్యకరమగు ఆయుధ వర్షము ఏర్పడి కనబడెను. దానిచే దిక్కులన్నియు కప్పబడి అంధకార మయమయ్యెను. దానిలో ఒకరికింకొకరు గుర్తు తెలియకయు ఆయుధ సముదాయము ప్రయోగించుచుండినను ఎవరు ఏది ఎవరిపై ప్రయోగించిరో తెలియకుండెను. సైనికులు సేనలనడుమ పడుచుండిరి. పరస్పరము చూచుచుండిరి.

ధ్వజములు, భుజములు, ఛత్త్రములు, కుండలములతో కూడిన శిరస్సులు, గజములు, తురంగములు, పదాతులు తెగిపడియు పడుచునుండగా అకాశమను సరస్సునుండి జారిపడిన పద్మములతోవలె వీనితో రణభూమి వ్యాప్తమయ్యెను. దంతములు విరిగి కుంభములు పగిలి తొండములు తెగి నెత్తురుకారుచు ఏనుగులు కొండలవలె పడిపోయెను. కాండ్లు విరిగి చక్రములు ఊడి ఇరుసులు విరిగి రథములును ముక్కలుగా తెగిపోయి వేలకొలదిగా అశ్వములును పడి పోయెను. అంతలోనే నెత్తుటి మడుగులతో ఆ భూమి దాటరానిదయ్యెను. నెత్తుటి సుడులతో నదులు మాంసాహారులకు హర్షప్రదమయ్యెను. ఆరణాంగణము బేతాళులకు క్రీడాస్థాన మయ్యెను.