నారాయణ నాభి పద్మావిర్భావము

విభుడు, సర్వవ్యాపి  -  సర్వశక్తి సంపన్నుడు అగు నారాయణుడు, జలజంతువుల జాతికి జన్మస్థానము అగు జలరూపమున తానుండి తన వాస్తవరూపమును మరుగుపరచి ‘రసోవైసః’ అను శ్రుతి వచనానుసారము రసాత్మక జలరూపుడై ఉండి ‘యస్య జ్ఞానమయం తపః’ అను వచనానుసారము జ్ఞానాత్మకమగు తపమాచరించెను. జలములు కర్మను తెలుపును. ఈ విధముగ జ్ఞానకర్మములే సృష్టికి హేతువులను ఉపనిష ద్వచనము ఇచట నిరూపింపబడినది. ఇట్లు కొంతకాలము తపమాచరించిన తరువాత మహాత్ముడు అతిబలుడు (తానన్నింటియందు ప్రవేవిశించియుండును -  తనయందు అన్నియు ప్రవేశించియుండును కావున) విశ్వుడునగు నారాయణుడు లోకసృష్టి విషయమునను పంచమహా భూత సృష్టి విషయమునను ప్రతియొక యంశమును సంకల్పించెను. (ఇది పరమేశుని ఇచ్ఛా శక్తి ప్రవృత్తి) (అతని జ్ఞానమయ తపస్సుచే సృష్టి సంబంధి ప్రక్రియ అంతయు అతనికి తెలిసి జ్ఞానశక్తి రూపమున ఉన్నది కావున) తరువాత అతడు అట్లాలోచించుచుండగనే గాలియేలేక సముద్రము - నిశ్చలమయి యుండగా తరువాత సృజింపబడనున్న జగమంతయు జలమయ (రూప)మయి సూక్ష్మరూపమున (అవ్యక్త  -  వ్యక్తముకాని రూపమున) ఉండగా ఆకాశము కూడ లేని గహ్వరమున (లోతగు ఉనికియందు -  ఈ ఉనికియే భగవంతుని సద్ రూపము) సలిలమును (జలమును) ఆశ్రయించియున్న పరమాత్ముడు ఆ అర్ణవమును కొంచెముగ సంక్షోభింపజేసెను. ఇదియే ప్రథమ స్పందరూపమగు క్రియాశక్తి ప్రవృత్తి; ఈ స్పందమువలన ఏమాత్రమును ఎడము లేకున్న నీటి అలల(లో) నుండి సూక్ష్మమగు రంధ్రము ఏర్పడెను. ఇది అన్నిటికంటె పూర్వము (మొట్టమొదట) ఏర్పడిన ఆకాశమును సూక్ష్మభూతము; శబ్ద గుణమున కాశ్రయమగు ఆ ఆకాశచ్ఛిద్రము నందుండి అంతట శబ్దముతోపాటు వాయువను (సూక్ష్మ) భూతము ఉత్పన్నమయ్యెను. అది అవకాశమునంది వృద్ధినొందగా అది ఎంత అక్షోభ్యమైనను దానియందును భగవదిచ్ఛచే స్పందము కలిగి దానిచే సముద్రముకూడ క్షోభిల్లి, అ ఘర్షణచే అగ్ని ఉత్పన్నమయ్యెను. అతడే నల్లని పొగతో తన త్రోవను సూచించుటచే కృష్ణవర్త్మా (నల్లని త్రోవ కలవాడు) సర్వ నరుల జఠరములందుండి అహారమును జీర్ణమొనరించుటచే వైశ్వానరుడు (విశ్వ  -  సర్వ -  నర) అనబడనున్న సూక్ష్మ మహాభూతమయ్యెను. అగ్ని అంతట అధిక జలమును సంశోషింపజేసెను. ఆ నీరు శోషిల్లి ఏర్పడిన రంధ్రమున విశాలమగు ఆకాశము ఏర్పడెను. కాని అచట అగ్ని స్వతేజము నుండి అమృతముతో సాటియగు రుచి (రసము) కల జలము లేర్పడెను. ఇట్లు ప్రథమ స్పందము వలన జలములందు కలిగిన ఛిద్రమునుండి ఆకాశమును దానినుండి వాయువును దానినుండి అగ్నియు దానినుండి జలములును ఏర్పడెను. సూక్ష్మ మహాభూత నిర్మాతయగు మహాదేవు డీ భూతములను చూచి ప్రీతుడయ్యెను. ఈ సూక్ష్మ భూతములతో లోక సృష్టి చేయుటకై భగవానుడును బహురూపుడునగు నారాయణుడు బ్రహ్మ జనించవలయునని (తానే బ్రహ్మరూపము ధరించవలయునని) సంకల్పించెను. సృష్టికర్తయగు బ్రహ్మ సామాన్యుడుకాడు, అతని మహా వ్యక్తిత్వము ఎట్టిది అనగా లోగడ చెప్పిన పండ్రెండువేల దివ్య వర్షముల పరిమాణమముకల మహాయుగములు వేయి అయినచో బ్రహ్మకు ఒక పగలు అగును. ఇంత దీర్ఘకాల పరిమాణముతో ఏర్పడు నూరు సంవత్సరములు జీవించగల బ్రహ్మ అతఃపూర్వము బహు జన్మములందు తనుదాను విశుద్ధముగా ఒనర్చుకొనిన జీవాత్మ చైతన్య రూపుడు, ఎట్లనిన - భూలోకమునందు తమ తపముచే చక్కగ సంస్కరింపబడి, ఆత్మకల ద్విజులలో శ్రేష్ఠులగు యోగులరుదుగా ఎవరుందురో - వారిలో కూడ విశ్వ కల్యాణమునకై ఉపయోగించు జ్ఞానమును దర్శించుట ఆ ఆత్మకు ముఖ్య (శ్రేష్ఠ) త్వమును ఇచ్చును; ఇట్టి జ్ఞానమును దర్శించినవాడయి సంపూర్ణమగు ఈశ్వరత్వమును (ఉత్తమ క్రియా సామర్థ్యమును) కూడ సంపాదించిన యోగిని గుర్తించి విశ్వేశుడగు నారాయణుడు అట్టివానిని లోకసృష్టి చేయు బ్రహ్మ పదమునందు నియోగించును. ఇట్టి బ్రహ్మను సృష్టించుటకు అనువుగా యోగతత్త్వ వేత్తయు అచ్యుతుడు అనగా తన్నాశ్రయించిన వారిని నాశమునందనీయక రక్షించువాడు హరి అనగా స్మరించిన వారి దోషములు హరించువాడు, లోకేశుడు లోకకర్తయగు నారాయణుడు ఆ మహాతోయమందు యథావిధిగా, యథా పూర్వముగా  -  ప్రతిసృష్టికి ఆరంభమునందు జరుగునట్లే జలక్రీడ చేయుచు తన నాభినుండి నాభి - అనగా నభమే -  ఆకాశమే, ఆకాశమునకును మూల భూతము విష్ణుని ఆశ్రయముగానున్న జలమే అని చెప్పబడినది; అది నారాయణ స్వరూపమే కావున  -  తననుండియే పద్మమును ఉత్పన్నమొనర్చెను. దానికి వేయి దళములుండెను; రజస్సు (రజోగుణము  -  ధూళి) లేదు; అది రవివలె ప్రకాశించుచుండెను, స్వర్ణమయము, అంతేకాదు, ప్రజ్వలించు అగ్ని శిఖలవలె మిగుల వెలుగొందు కాంతులుగలది, శరత్కాలమందు నిర్మలుడుగు అర్కుని తేజమువంటి తేజము కలది; ఇట్లా కమలము మహాత్ముడగు నారాయణుని తనువు అనగా శరీరము నుండి ఉత్పన్నమయి మనోహర రూపము కలిగి చాలగొప్ప వర్చస్సు కలిగి జనించి ప్రకాశించుచుండెను.