అర్ధనారీశ్వరాది ప్రతిమా లక్షణములు

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, ఇప్పుడు శ్రేష్ఠమగు అర్ధనారీశ్వరుని మూర్తిని వివరింతును. దేవదేవుని అర్ధ భాగముతో ఏర్పడి మిగుల శోభించు నారీరూపమిది. ఈ మూర్తియందు ఈశునికి చెందిన అర్థభాగమందు బాలేందుకలతో కూడిన జటాభాగ ముండును; ఉమార్ధము నందు సీమంతమును తిలకమును ఉంచవలయును; దక్షిణ కర్ణమందు వాసుకిని వామకర్ణము నందు కుండలమునుగాని త్రిశూలమును గాని వామహస్తమందు దర్పణమును ఉంచవలయును; కేయూరములతో వలయములతో కూడిన వామబాహువును మణిముక్తామయమగు యజ్ఞోపవీతమును వామార్ధమందు పీనమగు స్తనమును అమర్చవలయును; అట్లే ఎడమవైపున ఉజ్జ్వలమగు హారార్ధమును సగములావగు పిరుదును నిర్మించవలయును; కుడివైపున ఊర్ధ్వముఖమగు లింగార్ధమును వ్యాఘ్రాజిన వస్త్రమును వామాంశమందు వ్రేలాడు కట్టువస్త్రమును (చీరను), కటి సూత్రత్రయమును చేయవలయును; అందే నానారత్న సముపేత హార ముండగా దక్షిణమందు భుజగహారముండును, దేవుని దక్షిణపాదము పద్మముపై నుండగా ఎడమ పాదము మాత్రము కొంచెము భాగము నూపురముతో భూషితమయి యుండును; వామాంగుళుల యందు రత్న విభూషితాంగుళీయకములు ఉండవలయును, వామపాదము లత్తుక రనముతో అలంకృతమయి యుండును, ఇది అర్ధనారీశ్వర రూపము.